జీతం కట్‌.. జాగ్రత్త!.. ప్రభుత్వ ఉద్యోగులకు సీఎస్‌ హెచ్చరిక

Join Strike, Lose Pay, Govt Tells Employees in Chennai - Sakshi

28, 29 తేదీల్లో సిబ్బంది హాజరుపై ఉదయం 10.15 గంటలకల్లా నివేదికివ్వాలి  

కలెక్టర్లకు సర్క్యులర్‌ జారీ 

సాక్షి ప్రతినిధి, చెన్నై : ఈనెల 28, 29 తేదీల్లో వర్తక సంఘాలు నిర్వహించనున్న జాతీయస్థాయి ఆందోళననలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొంటే జీతం కట్‌ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరైయన్బు హెచ్చరించారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆయన సర్క్యులర్‌ జారీచేశారు. అందులోని వివరాలు.. అఖిలభారత స్థాయిలోని కొన్ని వర్తక సంఘాలు డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా జాతీయస్థాయిలో ఈనెల 28, 29 తేదీల్లో పోరాటానికి దిగుతున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి.

ఈ పోరాటంలో రాష్ట్రంలోని కొన్ని గుర్తింపు పొందని సంఘాల సభ్యులు కూడా భాగస్వామ్యం అవుతున్నట్లు ప్రభుత్వానికి సమాచారం అందింది. ఈ ఆందోళనలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడం, పాల్గొనేలా ఇతర ఉద్యోగులను భయాందోళనలకు గురిచేయడం, ఆ పోరాటానికి మద్దతు పలికేలా వ్యవహరించడం ఎంతమాత్రం తగదని ఆయన అన్నారు. దైనందిన ప్రభుత్వ కార్యాలయ విధులకు ఇబ్బంది కలిగించినా.. ప్రభుత్వ ఉద్యోగుల నిబంధనలను అతిక్రమించినట్లు పరిగణిస్తామని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి అన్ని కార్యాలయాల సిబ్బందికి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్లను కోరారు. ఆ రెండు రోజుల్లో ఎవరైనా కార్యాలయానికి హాజరుకాకుంటే అనుమతి లేకుండా సెలవు తీసుకున్నట్లుగా భావించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

అంతేగాక “పనిచేయలేదు..జీతం లేదు’ అనే విధానం కింద ఆ రెండు రోజులు శాలరీ కట్‌ చేస్తామని చెప్పారు. 28, 29 తేదీల్లో మెడికల్‌ లీవు తప్ప మరేరకమైన సెలవు ఇవ్వరాదని ఆదేశించారు. అన్ని శాఖల అధిపతులు 28, 29 తేదీల్లో తమ కింది సిబ్బంది హాజరుపై ఉదయం 10.15 గంటల కల్లా నివేదికను సమర్పించాలని సూచించారు. చెన్నై సచివాలయంలోని అధికారులు సైతం ఉదయం 10.30 గంటలకల్లా హెచ్‌ఆర్‌ డిపార్టుమెంట్‌కు ఇదే నివేదికను అందజేయాలని ఆదేశించారు.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top