
న్యూఢిల్లీ: కాలువలు తవ్వడానికి, పాత ఇళ్లు కూల్చడానికే కాకుండా వంటలు వండడానికి, పప్పు కలపడానికి కూడా జేసీబీ ఉపయోగించవచ్చని మీకు తెలుసా? ఇక్కడ అచ్చంగా అదే చేశారు. భారీ పాత్రలో ఉడుకుతున్న పప్పును జేసీబీతో చక్కగా కలిపారు. అదే పప్పును అదే జేసీబీతో ట్రాక్టర్ ట్రాలీలోకి ఎత్తి, తర్వాత వేలాది మంది అతిథులకు వడ్డించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నీరాజాద్ అనే వ్యక్తి దీన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఈ సంఘటన ఎప్పుడు ఎక్కడ జరిగిందో తెలియదు గానీ క్షణాల్లోనే ఇంటర్నెట్‌లో పాకిపోయింది.
జేసీబీనే మాస్టర్ చెఫ్‌గా మారిందని పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి తిండి తింటే ఇంకేమైనా ఉందా? మరికొందరు ఆందోళన వ్యక్తంచేశారు. తిండి విషయంలో శుభ్రత గురించి కాస్తయినా పట్టించుకోండి అని సూచిస్తున్నారు. ఇదొక గొప్ప ఆవిష్కరణ అంటూ మరికొందరు జోక్ చేస్తున్నారు. ఇలా కూడా చేయొచ్చని మాకు ఇప్పటిదాకా తెలియదని అంటున్నారు. మట్టిని తవ్వడానికి వాడే యంత్రాన్ని వంటలు వండే ప్రదేశం దాకా తీసుకురావడమే పెద్ద తప్పు, అలాంటిది దాంతోనే పప్పు కలపడం ఏమిటని ప్రశి్నస్తున్నారు. జేసీబీతో కలిపిన పప్పు భలే టేస్టు అంటూ సెటైర్లు సైతం విసురుతున్నారు. ఇకపై ఎవరూ ఇలాంటి పనులు చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చాలామంది ప్రభుత్వాన్ని కోరారు.