
న్యూఢిల్లీ: రష్యాలో మూడు రోజుల పర్యటనకు గాను మన విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ మంగళవారం మాస్కోకు బయలుదేరారు. రష్యాతో కొనసాగుతున్న చిరకాల మైత్రిని మరింత దృఢతరం చేయడమే ఈ పర్యటన లక్ష్యమని విదేశాంగ శాఖ తెలిపింది. రష్యా నుంచి ముడి చమురు కొంటుందనే సాకుతో భారత్ ఉత్పత్తులపై 50 శాతం టారిఫ్‌లను విధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో రెండు దేశాల మధ్య సంబంధాలు కొంతమేర దెబ్బతిన్న నేపథ్యంలో జై శంకర్ చేపట్టిన ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
బుధవారం జరిగే వాణిజ్య, ఆర్థిక, శాస్త్ర, సాంకేతిక, సాంస్కృతిక సహకార రష్యా–చైనా ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్ 26వ సెషన్‌కు ఆయన సహాధ్యక్షత వహిస్తారని విదేశాంగ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమంలో రష్యా ఫస్ట్ డిప్యూటీ ప్రధానమంత్రి డెనిస్ మంతురోవ్ సహాధ్యక్షత వహిస్తారంది.
వీరిద్దరూ ఈ ఏడాది చివర్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ చేపట్టే భారత పర్యటనకు అవసరమైన కార్యాచరణను రూపొందిస్తారని చెప్పారు. జై శంకర్ అనంతరం రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌తోనూ భేటీ అవుతారు. రష్యా– ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం, అందుకు సంబంధించి ఇటీవల ట్రంప్ ప్రభుత్వం ప్రకటించిన చర్యలపై వీరిద్దరూ చర్చలు జరుపుతారు. ఇతర ద్వైపాక్షిక అంశాలతోపాటు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలనూ చర్చిస్తారు. ఇంధన రంగంలో రెండు దేశాల సంబంధాలు కూడా ప్రస్తావనకు వస్తాయని విదేశాంగ శాఖ తెలిపింది.