
ఈఓఎస్–09 ప్రయోగం నేడే మోసుకెళ్లనున్న పీఎస్‌ఎల్‌వీ వాహకనౌక
ప్రతికూల పరిస్థితుల్లోనూ నిరంతర సేవలు
అత్యంత స్పష్టతతో కూడిన చిత్రాలు, డేటా
సూళ్లూరుపేట: పహల్గాం ఉగ్ర దాడి, అందుకు ప్రతీకారంగా పాక్ పీచమణచిన ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేసుకునే దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేస్తోంది. అత్యంత అధునాతనమైన నిఘా ఉపగ్రహం ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈఓఎస్–09)ను ప్రయోగించనుంది. పీఎస్‌ఎల్‌వీ–సీ61 రాకెట్ ద్వారా దాన్ని కక్ష్యలోకి చేర్చేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సన్నద్ధమైంది.
ఆదివారం ఉదయం 5.59 గంటలకు శ్రీహరికోటలోని మొదటి లాంచ్‌ప్యాడ్ నుంచి ప్రయోగం జరగనుంది. 17 నిమిషాలకు ఉపగ్రహాన్ని 529 కిలోమీటర్ల ఎత్తులోని సన్ సింక్రనస్ పోలార్ ఆర్బిట్ (ఎస్‌ఎస్‌పీఓ)లో ప్రవేశపెడతారు. ఇది ఐదేళ్లపాటు సేవలందిస్తుందని ఇస్రో తెలియజేసింది. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ) శ్రేణిలో ఇది 63వ ప్రయోగం. కాగా ఇస్రో చరిత్రలో 101వ ప్రయోగం. ఈ ప్రయోగం ద్వారా టెస్ట్ వెహికల్–డీ2 (టీవీ–డీ2) మిషన్‌ను కూడా రోదసిలోకి పంపుతున్నారు. ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.నారాయణన్ శనివారం చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో పూజలు చేయించారు.
సరిహద్దులపై డేగకళ్లు
మేఘాలు, దట్టమైన చీకటి కమ్ముకున్నా, తుఫాన్ల వంటివి చెలరేగినా చాలా ఉపగ్రహాలు మూగవోతాయి. కానీ ఈఓఎస్–09 అలా కాదు. అన్ని రకాల అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో, రేయింబవళ్లూ బ్రహా్మండంగా పని చేస్తుంది. సాధారణ ఆప్టికల్ శాటిలైట్లకు అడ్డుగోడలుగా నిలిచే మేఘాలు, వర్షాలు, దుమ్మూధూళి, పొగమంచు వంటివాటి గుండా కూడా భూమిని అత్యంత స్పష్టంగా చూడగలుగుతుంది. అత్యాధునిక సి బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రాడార్ సాయంతో ఒక మీటర్ పరిధిలోని వస్తువులను కూడా కచి్చతత్వంతో ఫొటోలు తీస్తుంది.
→ రెండు దశాబ్దాల క్రితం రూపొందించిన పూర్తి దేశీయ రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ (రిశాట్)–1కు ఈఓఎస్–09 నిఘా ఉపగ్రహం కొనసాగింపు.
→ చట్టవ్యతిరేక కార్యకలాపాలను, తీవ్రవాదుల ఉనికిని గుర్తించగలదు. వాహనాల కదలికలను కూడా అత్యంత స్పష్టంగా, కచ్చితంగా చిత్రించడం దీని ప్రత్యేకత.
→ ఇందుకోసం దీనికి హెచ్‌ఆర్‌ఎస్ (హై రిజల్యూషన్ స్పాట్‌లైట్), మీడియం రిజల్యూషన్ స్కాన్ (ఎస్‌ఏఆర్) వంటి అత్యాధునిక హంగులు అమర్చారు.
→ వ్యవసాయం, అడవుల పర్యవేక్షణ, విపత్తుల నిర్వహణ, పట్టణ ప్రణాళిక, జాతీయ భద్రత వంటి అంశాల్లో ఇది కీలకమైన సేవలు అందించనుంది.
→ దీని డేగకళ్లు పాక్ నుంచి చైనా దాకా మన 15 వేల కి.మీ. విస్తారమైన సరిహద్దులను, 7,500 కి.మీ. పొడవైన సముద్రతీరాన్ని అణువణువూ కాపు కాస్తాయి. ఎలాంటి అనుమానాస్పద కదలికలనైనా ఇట్టే పట్టేస్తాయి.
→ వరదల వంటి ప్రాకృతిక విపత్తుల వేళ మేఘాలను చీల్చుకుంటూ ఈఓఎస్–09 అందించే రియల్ టైం చిత్రాలు, డేటా నష్ట తీవ్రతను తక్షణం అంచనా వేయడంలో దోహదపడతాయి.