బెంగాల్‌ దీదీకి ‘సరిహద్దు’ సెగ | Infiltrations become a major agenda in the assembly elections | Sakshi
Sakshi News home page

బెంగాల్‌ దీదీకి ‘సరిహద్దు’ సెగ

Mar 31 2026 5:26 AM | Updated on Mar 31 2026 5:28 AM

Infiltrations become a major agenda in the assembly elections

అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ఎజెండాగా మారిన చొరబాట్లు  

హిందువుల ఓట్లను సంఘటితం చేస్తున్న బీజేపీ  

సీఏఏ అమలు, ‘మతువా’ల పౌరసత్వంపై కమలనాథుల ఆశలు  

సంక్షేమ పథకాలు, మైనార్టీ ఓట్ల ఏకీకరణను నమ్ముకుంటున్న మమతా బెనర్జీ  

దేశ రాజకీయాల్లో ఎప్పుడూ ఆసక్తి రేపే పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల రణరంగాన్ని ఈసారి పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌ పరిణామాలు ప్రభావితం చేస్తున్నాయి. వరుసగా నాలుగోసారి అధికార పీఠాన్ని దక్కించుకోవాలని తహతహలాడుతున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సరిహద్దు అంశాలు తలపోటుగా మారాయి. చొరబాటు అ్రస్తాన్ని సంధించి ఎలాగైనా దీదీ కోటలో పాగా వేయాలని బీజేపీ కంకణం కట్టుకుంది. బెంగాల్‌కు బంగ్లాదేశ్‌తో 2,216 కిలోమీటర్ల మేర సుదీర్ఘ సరిహద్దు ఉంది. ఇప్పుడు బెంగాల్‌ రాజకీయాలకు ఇదే కేంద్ర బిందువుగా మారింది.  

చొరబాట్లు కేంద్రం వైఫల్యమే..  
సరిహద్దు గుండా శరణార్థులు, చొరబాటుదారుల రాక భారీగా పెరిగిందని, ఇది రాష్ట్ర జనాభా ముఖచిత్రాన్ని మార్చేస్తోందంటూ బీజేపీ తీవ్రస్థాయిలో ప్రచారం చేస్తోంది. జాతీయ భద్రతకు ముప్పు పొంచి ఉందని చెబుతూ హిందువుల ఓట్ల ఏకీకరణకు ప్రయతి్నస్తోంది. మరోవైపు, అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ ఈ ఆరోపణలను తిప్పికొడుతోంది. సరిహద్దుల భద్రత చూసుకునే బీఎస్‌ఎఫ్‌ కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుందని, చొరబాట్లు జరిగితే అది కేంద్రం వైఫల్యమేనని సీఎం మమతా బెనర్జీ వాదిస్తున్నారు. బంగ్లాదేశ్‌తో ఉన్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను గుర్తుచేస్తూ, చొరబాట్ల పేరుతో బెంగాలీలను లక్ష్యంగా చేసుకోవడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సరిహద్దు జిల్లాల్లో రైతులను ప్రభావితం చేసే ‘తీస్తా నదీ జలాల పంపిణీ’వివాదం కూడా ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనుంది.  

‘మతువా’ల చుట్టూ రాజకీయ చదరంగం  
బెంగాల్‌లో దాదాపు 17 శాతం ఉన్న దళిత (నామశూద్ర) ‘మతువా’సామాజిక వర్గం ఉత్తర 24 పరగణాలు, నదియా లాంటి సరిహద్దు జిల్లాల్లో సుమారు 30 నుంచి 40 అసెంబ్లీ స్థానాల్లో గెలుపోటములను శాసించగలదు. దశాబ్దాల క్రితం బంగ్లాదేశ్‌ నుంచి వలస వచ్చిన వీరు భారత పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) కింద అధికారికంగా పౌరసత్వం కల్పిస్తామంటూ బీజేపీ ఇచి్చన హామీ వారిని ఆకర్షిస్తోంది. అయితే, సీఏఏ, ఎన్‌ఆర్‌సీలను బెంగాల్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయబోమని టీఎంసీ చెబుతోంది. మతువాలు ఇప్పటికే భారత పౌరులని దీదీ వాదిస్తున్నారు. సీఏఏ బీజేపీకి అస్త్రంగా మారింది. దీదీ మాత్రం సంక్షేమ పథకాలు, మైనారిటీ ఓట్ల ఏకీకరణపై ఆశలు పెట్టుకున్నారు. 

సరిహద్దు జిల్లాల్లో పెరిగిన ముస్లిం జనాభా  
బంగ్లాదేశ్‌ సరిహద్దు వెంబడి ఉన్న 7 జిల్లాల్లో ప్రతి ఏటా దాదాపు 5 వేల చొరబాటు కేసులు నమోదవుతున్నాయి. గుర్తించని చొరబాట్లు ఇంకా ఎన్నోరెట్లు ఉంటాయి. సరిహద్దు జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో ముస్లింల జనాభా 40 శాతం నుంచి 70 శాతం వరకు పెరిగింది. ముర్షిదాబాద్, మాల్డా జిల్లాల్లో ముస్లిం జనాభా 50 శాతానికిపైగా ఉండగా, దక్షిణ 24 పరగణాలు వంటి జిల్లాల్లో 40 శాతం వరకు ఉంది. అక్రమ చొరబాట్ల వల్లే ముస్లింల జనాభా పెరిగినట్లు బీజేపీ ఆరోపిస్తోంది. ముస్లింలను భయపెట్టే రాజకీయాలు చేస్తున్నారని, బెంగాల్‌ సంస్కృతి, ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నం సాగుతోందని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆక్షేపిస్తోంది. 

పెండింగ్‌లో 40 లక్షల ఎస్‌ఐఆర్‌ కేసులు  
ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్‌)లో భాగంగా సుమారు 25 లక్షల ఓటర్ల కేసులు పరిష్కారం కాగా, ఇంకా 40 లక్షల కేసులు పరిశీలనలోనే ఉండటం రాజకీయ చర్చకు దారితీసింది. సరిహద్దు జిల్లాలైన ముర్షిదాబాద్‌లో 12 లక్షల కేసులు, మాల్డాలో 8 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. మిగిలిన వివాదాస్పద ఓటర్లలో 20 లక్షల మంది ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో ఉన్నారు.

సరిహద్దు జిల్లాల్లో పరిస్థితి ఇలా..  
→ జనాభాలో సగానికి పైగా ముస్లింలు ఉండే ముర్షీదాబాద్, మాల్డా జిల్లాలు ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోటలు. కానీ, ఇప్పుడు టీఎంసీ పాగా వేసింది. ఇక్కడ హిందువుల ఓట్లను సంఘటితం చేయాలని బీజేపీ, పాత ఓటు బ్యాంకును కాపాడుకోవాలని వామపక్ష కూటమి యతి్నస్తున్నాయి.  
→ రాజ్‌బన్షీలు, గూర్ఖాలు, తేయాకు తోటల కారి్మకులు ఉన్న ఉత్తర బెంగాల్‌ (కూచ్‌ బెహార్, జల్పాయ్‌గురి, డార్జిలింగ్‌) భౌగోళికంగా, సాంస్కృతికంగా భిన్నమైనది. ఇక్కడ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లు సజీవంగా ఉన్నాయి. ఈ ప్రాంతం కొన్నేళ్లుగా బీజేపీకి ఆయువుపట్టుగా మారింది.  
→ సుందర్బన్స్‌ అటవీ ప్రాంతంతో కూడిన దక్షిణ 24 పరగణాల జిల్లా టీఎంసీకి అభేద్యమైన కోట అనడం సబబు. మైనారీ్టలు, గ్రామీణ పేదలు ఎక్కువగా ఉండటం, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రభావంతో ఇక్కడ ఏ ఎన్నికలైనా సరే టీఎంసీ విజయం సాధిస్తోంది. స్థానికంగా బీజేపీ ఇంకా బలపడాల్సి ఉంది.    

-సోమన్నగారి రాజశేఖర్‌రెడ్డి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement