కేంద్రం సంచలన నిర్ణయం.. రైల్వేలో ఉద్యోగాల కోత | Indian Railways Orders Removal Employees Non-Safety Posts | Sakshi
Sakshi News home page

కేంద్రం సంచలన నిర్ణయం.. రైల్వేలో ఉద్యోగాల కోత

Apr 30 2026 7:10 AM | Updated on Apr 30 2026 7:10 AM

Indian Railways Orders Removal Employees Non-Safety Posts

ఈ ఏడాది 30 వేల పోస్టుల రద్దుకు ఆదేశాలు

ఏపీలో 2 వేల పోస్టులు కోల్పోయే అవకాశం

ఇకపై ఏటా 2 శాతం చొప్పున ఉద్యోగాల్లో కోత

సాక్షి, అమరావతి: ప్రైవేటు కంపెనీలకే పరిమితమైన ఉద్యోగాల కోత.. ఇప్పుడు ప్రభుత్వరంగ సంస్థలకూ పాకింది. తాజాగా రైల్వేశాఖలో ఉద్యోగాల కోతకు రంగం సిద్ధమైంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 30వేల పోస్టులను రద్దు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. 2026, ఏప్రిల్‌ 1 నాటికి మంజూరైన పోస్టుల్లో 30వేల పోస్టులను రద్దు చేయాలని రైల్వే శాఖ అన్ని జోన్ల జనరల్‌ మేనేజర్‌(జీఎం)లను తాజాగా ఆదేశించింది.

రద్దు చేసిన పోస్టుల్లో ప్రస్తుతం ఖాళీగా, ఉద్యోగులు ఉన్న పోస్టులూ ఉన్నాయి. రద్దు చేసిన పోస్టుల్లో ఉన్న ఉద్యోగులను ఇతర ప్రాంతాల్లో సర్దుబాటు చేస్తారు. ఆ ప్రకారం దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే పరిధిలోకి వస్తున్న ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు రెండు వేల పోస్టులను తగ్గించొచ్చని రైల్వే శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రద్దయ్యే పోస్టుల్లో ఎక్కువ క్లరికల్‌ విభాగం, మెయింటెనెన్స్‌ విభాగం పోస్టులు ఉన్నాయి.  

ఇక నుంచి ఏటా 2%
నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకునే దిశగా పోస్టులు రద్దు చేయాలని గతేడాది రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి 2 శాతం చొప్పున పోస్టులు రద్దు చేయాలని ప్రణాళిక రూపొందించింది. రైల్వే శాఖలో మంజూరైన పోస్టుల్లో దేశవ్యాప్తంగా 3.5లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిలో ఏటా 2 శాతం పోస్టుల చొప్పున రద్దు చేస్తారు. కొత్త పోస్టులు మంజూరు చేయరు. మొదటి దశలో క్లరికల్, నిర్వహణ విభాగాల పోస్టులనే రద్దు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది.

ఉద్యోగాల కోత ప్రణాళికలో భద్రతా విభాగం పోస్టులను చేర్చలేదు. కాగా రైల్వే శాఖ నిర్ణయాన్ని రైల్వే ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. నిర్వహణ విభాగంలో పోస్టుల రద్దుతో రైల్వే సేవలు మందగిస్తాయని, ప్రయాణికులకు అసౌకర్యంతోపాటు ప్రస్తుతం ఉన్న ఉద్యోగులపై పనిభారం బాగా పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరుతున్నాయి.

 

Advertisement
 
Advertisement
Advertisement