మహేంద్రగిరి స్వదేశీ సిరి | Indian Navy Inducts Fourth Stealth Frigate Mahendragiri | Sakshi
Sakshi News home page

మహేంద్రగిరి స్వదేశీ సిరి

May 2 2026 5:29 AM | Updated on May 2 2026 5:29 AM

Indian Navy Inducts Fourth Stealth Frigate Mahendragiri

స్వదేశీ యుద్ధనౌక నావికాదళానికి అప్పగింత  

శత్రు దేశాల యుద్ధ నౌకలు, జలాంతర్గాములపై సులువుగా దాడి చేసే సత్తా సొంతం  

ఆత్మనిర్భరతకు ప్రతీక అని రక్షణ శాఖ స్పష్టీకరణ  

న్యూఢిల్లీ: అత్యాధునిక యుద్ధనౌకల డిజైన్, నిర్మాణంలో భారత్‌ క్రమంగా స్వయం సమృద్ధి సాధిస్తోంది. స్వదేశీ పరిజ్ఞానంతో యుద్ధ నౌకలను తయారు చేస్తోంది. ఇతర దేశాలపై ఆధారపడే అవసరాన్ని తగ్గించుకుంటోంది. శక్తివంతమైన ఆయుధ వ్యవస్థ, అత్యాధునిక సెన్సర్ల సమూహంతో కూడిన స్వదేశీ స్టెల్త్‌ ఫ్రిగేట్‌ ‘మహేంద్రగిరి’ని భారత నౌకాదళానికి లాంఛనంగా అప్పగించినట్లు అధికారులు వెల్లడించారు. ఏప్రిల్‌ 30న ముంబైలోని మజగావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌(ఎండీఎస్‌ఎల్‌)లో ఈ కార్యక్రమం జరిగినట్లు తెలిపారు. నీలగిరి–క్లాస్‌(ప్రాజెక్టు 17ఏ) శ్రేణిలో ఇది ఆరో యుద్ధ నౌక కావడం విశేషం.

 ప్రాజెక్ట్‌ 17ఏ యుద్ధనౌకలు సముద్ర రంగంలో ఎదురవుతున్న, భవిష్యత్తులో ఎదురు కాబోయే సవాళ్లను పరిష్కరించడానికి రూపొందించిన బహుముఖ, బహుళ–కార్యనిర్వహణ నౌకలు అని రక్షణ శాఖ ఒక ప్రకటనలో స్పష్టంచేసింది. మహేంద్రగిరి స్టెల్త్‌ ఫ్రిగేట్‌ యుద్ధనౌకల నిర్మాణంలో భారతదేశ ఆత్మనిర్భరతకు ఒక ప్రశంసనీయమైన చిహ్నంగా నిలుస్తున్నట్లు హర్షం వ్యక్తంచేసింది. ఈ అత్యాధునిక ఫ్రిగేట్‌ నావల్‌ డిజైన్, ఫైర్‌పవర్, ఆటోమేషన్, మనుగడ సామర్థ్యంలో ఒక గొప్ప పురోగతికి ప్రతీక అని వెల్లడించింది.
  
→ మహేంద్రగిరి యుద్ధనౌకను ముంబై ఎండీఎస్‌ఎల్‌లో చాలావరకు స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించారు. ఒడిశాలోని తూర్పు కనుమల్లో ఉన్న మహేంద్రగిరి పర్వతం పేరును ఈ నౌకకు పెట్టారు.  

→ వార్‌షిప్‌ ఓవర్‌సీయింగ్‌ టీమ్‌ పర్యవేక్షణలో వార్‌íÙప్‌ డిజైన్‌ బ్యూరో(డబ్ల్యూడీబీ) మహేంద్రగిరిని డిజైన్‌ చేసింది.  

→ ప్రాజెక్టు 17ఏ కింద తయారైన ఫ్రిగేట్లు స్వదేశీ నౌకా రూపకల్పన, స్టెల్త్‌ సామర్థ్యం, మనుగడ సాగించే శక్తి, పోరాట సామర్థ్యాలలో గొప్ప ముందడుగును 
ప్రతిబింబిస్తాయి.  

→ నిర్దేశిత కాలపరిమితిలోపే నౌకను నావికా దళానికి అప్పగించినట్లు అధికారులు తెలిపారు. ఇందులో అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.  

→ పీ17 (శివాలిక్‌ శ్రేణి) నౌకలతో పోలిస్తే పీ17ఏ నౌకలకు అధునాతన ఆయుధాలు, సెన్సర్ల వ్యవస్థను అమర్చారు.  

→ ఈ నౌకల్లో కంబైన్డ్‌ డీజిల్‌ లేదా గ్యాస్‌ ప్రొపల్షన్‌ ప్లాంట్లు అమర్చి ఉంటాయి. వీటిలో ఒక డీజిల్‌ ఇంజిన్, గ్యాస్‌ టర్బైన్, ఇంటిగ్రేటెడ్‌ ప్లాట్‌ఫామ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌(ఐపీఎంఎస్‌) ఉంటాయి.  

→ శక్తివంతమైన ఆయుధాలు, సెన్సర్ల సమూహంతో శత్రు దేశాల యుద్ధ నౌకలు, జలాంతర్గాములపై సులువుగా దాడి చేయొచ్చు.  

→ ప్రాజెక్టు 17ఏలో భాగంగా తొలి యుద్ధనౌక(నీలగిరి)ను 2024 డిసెంబర్‌ 20న భారత నావికాదళానికి అప్పగించారు. కేవలం 17 నెలల వ్యవధిలోనే ఆరో నౌకను సైతం అప్పగించడం గమనార్హం.  

→ మహేంద్రగిరి స్టెల్త్‌ ఫ్రిగేట్‌ను అప్పగించడం మన స్వదేశీ రూపకల్పన, నౌకా నిర్మాణం, ఇంజనీరింగ్‌ సామర్థ్యానికి ప్రతీక అని అధికార వర్గాలు తెలిపాయి.  

→ 75 శాతం స్వదేశీ భాగస్వామ్యంతో కూడిన ఈ ప్రాజెక్టులో, 200కు పైగా ఎంఎస్‌ఎంఈలు పాలుపంచుకున్నాయని, తద్వారా సుమారు 4,000 మందికి ప్రత్యక్షంగా, 10,000 మందికి పరోక్షంగా ఉపాధి లభించినట్లు రక్షణ శాఖ తెలియజేసింది.  

→ సూపర్‌సానిక్‌ క్షిపణులతో సహా అత్యాధునిక ఆయుధ సంపత్తిని కలిగిన స్వదేశీ స్టెల్త్‌ ఫ్రిగేట్‌ ‘తారాగిరి’ని ఏప్రిల్‌ 3న భారత నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు.  

→ తాజాగా మహేంద్రగిరి రాకతో భారత నావికాదళం మరింత శక్తివంతంగా మారినట్లు అధికార వర్గాలు స్పష్టంచేశాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement