Odisha: సర్కారుకు హైకోర్టు భారీ షాక్‌

High Court Quashes Orissa Government Order On Merging Schools - Sakshi

భువనేశ్వర్‌: ప్రాథమిక పాఠశాలల విలీనం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్ని రాష్ట్ర హైకోర్టు మంగళవారం రద్దు చేసి షాకిచ్చింది. 20 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలల్ని చేరువలో ఉన్న మరో పాఠశాలలో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించి 2020వ సంవత్సరం మార్చి 11వ తేదీన  పాఠశాలల విలీనం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి కార్యాచరణ చకచకా ముగించేందుకు పాఠశాలలు–సామూహిక విద్యా విభాగం సన్నాహాలు వేగవంతం చేసింది.

ఈ ప్రక్రియను వ్యతిరేకించిన విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం (ఒడిశా అభిభాబొకొ మహాసొంఘొ) ప్రజాప్రయోజన  వ్యాజ్యాన్ని హైకోర్టులో దాఖలు చేసింది. ఈ వ్యాజ్యం ప్రాథమిక విచారణ సందర్భంగా మార్చి 30వ తేదీన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 11 వేల 560 ప్రాథమిక పాఠశాలల విలీనం ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా వేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ సన్నాహాలపట్ల రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఆలోచించాలని హితవు పలికింది. ఏప్రిల్‌ 13వ తేదీ నాటికి ప్రభుత్వ నిర్ణయం ప్రకటించాలని ఆదేశించింది. ప్రభుత్వ నిర్ణయంపట్ల పిటిషనర్‌ అసంతృప్తి చెందితే మళ్లీ కోర్టును ఆశ్రయించేందుకు అనుమతించి ప్రభుత్వ నిర్ణయం హైకోర్టుకు తెలియజేయాలని ప్రత్యేకంగా ఆదేశించింది.

స్పందించని సర్కారు
ఈ నేపథ్యంలో ఏడాది గడుస్తున్నా ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి నిర్ణయాన్ని హైకోర్టుకు తెలియజేయలేదు. అయితే పాఠశాలల విలీనాన్ని పురస్కరించుకుని ప్రాథమిక విద్యాభ్యాసానికి గండిపడే ప్రమాదకర పరిస్థితుల్ని పిటిషనర్‌ మరోసారి తాజాగా హైకోర్టుకు వివరించడంతో పాటు ప్రభుత్వ ప్రతిపాదనలో సాధ్యాసాధ్యాల్ని విశ్లేషించారు. ఈ పూర్వాపరాల్ని పరిశీలించిన హైకోర్టు ప్రభుత్వ వైఖరితో ఏకీభవించకుండా పాఠశాలల విలీనం ఉత్తర్వులను రద్దు చేస్తూ మంగవారం తుది ఆదేశాలు జారీ చేసింది.

చదవండి: అది కోర్టు ధిక్కరణ ఎందుకు కాదు: హైకోర్టు ఆగ్రహం

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top