రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్‌ ఏకగ్రీవం | Harivansh Narayan Singh Elected to Rajya Sabha Deputy Chairman | Sakshi
Sakshi News home page

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్‌ ఏకగ్రీవం

Apr 18 2026 4:56 AM | Updated on Apr 18 2026 4:56 AM

Harivansh Narayan Singh Elected to Rajya Sabha Deputy Chairman

న్యూఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ మరోసారి ఎన్నికయ్యారు. ప్రతిపక్ష అభ్యర్థులెవరూ నామినేషన్‌ దాఖలు చేయకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. పాత్రికేయుడిగా ఉండి రాజకీయ నాయకుడిగా మారిన ఆయన డిప్యూటీ  చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడం ఇది మూడోసారి. ఏప్రిల్‌ 9న హరివంశ్‌ పదవీకాలం ముగియడంతో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ పదవి ఖాళీ అయింది. 

అనంతరం రాజ్యసభకు నామినేట్‌ అయిన ఆయన.. మళ్లీ బాధ్యతలు చేపట్టారు. ఉన్నత రాజ్యాంగ పదవికి హరివంశ్‌ మూడోసారి ఎన్నిక కావడం అరుదైన ఘనతని రాజ్యసభ చైర్మన్‌ సి.పి.రాధాకృష్ణన్‌ అభివర్ణించారు. రాజ్యసభకు అధ్యక్షత వహించడం అంత సులభమైన పని కాదని, హరివంశ్‌ తన బాధ్యతను అద్భుతమైన సంయమనం, సహనం, నిష్పాక్షికతతో నిర్వర్తించారని రాధాకృష్ణన్‌ కొనియాడారు. పార్లమెంటరీ కార్యకలాపాలను, సంప్రదాయాలు, బాధ్యతలను అర్థం చేసుకోవడంలో కొత్తగా ఎన్నికైన సభ్యులకు హరివంశ్‌ ఒక మార్గదర్శిగా, స్ఫూర్తిదాయకంగా ఉంటారని చైర్మన్‌ అన్నారు. 

ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంలో సభ చూపిన సమష్ఠి  వివేకాన్ని చైర్మన్‌ ప్రశంసించారు. డిప్యూటీ చైర్మన్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన అనుభవం రాజ్యసభకు ఎంతో అవసరమని, హరివంశ్‌ నేతృత్వంలో సభ మరింత శక్తిమంతమవుతుందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా నూతన ఉపసభాపతికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిపక్షానికి కూడా తగిన ప్రాధాన్యం ఇస్తారని ఆశిస్తున్నామన్నారు. సభ గౌరవాన్ని నిలబెట్టడానికి, సభ్యుల హక్కులను పరిరక్షించడానికి, సభా కార్యకలాపాలు సజావుగా సాగేలా చూడటానికి అన్ని విధాలా కృషి చేస్తానని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ హామీ ఇచ్చారు. 

సభ్యుల సన్మానం అనంతరం మాట్లాడిన హరివంశ్, ‘పార్లమెంటరీ నియమా లు, సంప్రదాయాలు, రాజ్యాంగ పరిధిలోనే ఉంటూ, సభ గౌరవాన్ని నిలబెట్టడానికి, సభ్యుల హక్కులను పరిరక్షించడానికి, సభ సజావుగా సాగేలా చూడటానికి నేను అన్ని విధాలా ప్రయత్నిస్తానని సభకు హామీ ఇస్తున్నాను’అని అన్నారు. పార్లమెంటులో ఆరోగ్యకరమైన సైద్ధాంతిక చర్చకు ఆస్కారం ఉందని, ప్రజాస్వామ్యంలో ఎలాంటి విద్వేషాలకు తావులేదని ఆయన అన్నారు. సన్మానం అనంతరం, సభా కార్యకలాపాలకు అధ్యక్షత వహించిన ఆయన.. ఇదే తన మొదటి కర్తవ్యమంటూ సభను నేటికి వాయిదా వేశారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement