మాస్క్‌ సరిగా ధరించకుంటే ఫైన్‌ | Sakshi
Sakshi News home page

మాస్క్‌ సరిగా ధరించకుంటే ఫైన్‌

Published Wed, Mar 31 2021 4:18 AM

Govt Warns Of Fines And police Action Against Flyers Ciolating Covid Norms - Sakshi

‌సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్‌–19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పౌర విమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌(డీజీసీఏ) విమానాశ్రయాలు, విమానయాన సంస్థలను అప్రమత్తం చేసింది. ప్రయాణికులు కోవిడ్‌ ప్రొటోకాల్‌ను తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని గట్టిగా కోరింది. మాస్క్‌ సరిగా ధరించని వారిని, భౌతిక దూరం పాటించని వారిని గుర్తించి అక్కడికక్కడే జరిమానా విధించడం వంటి చర్యలు చేపట్టాలని కోరింది. ఈ మేరకు మార్చి 13వ తేదీన డీజీసీఏ అన్ని విమానాశ్రయాలకు, విమానయాన సంస్థలకు ఈ మేరకు సూచనలు చేసింది. అయితే, కొన్ని విమానాశ్రయాల్లో కోవిడ్‌–19 ప్రొటోకాల్స్‌ ఉల్లంఘనలు ఇంకా కొనసాగుతున్నట్లు డీజీసీఏ తెలిపింది. ఈ నేపథ్యంలో డీజీసీఏ మంగళవారం తాజాగా మరో సర్క్యులర్‌ జారీ చేసింది.

‘ప్రయాణికులు ముక్కు, నోరు కవరయ్యేలా ముఖానికి మాస్క్‌ను సరిగ్గా ధరించడం మొదలుకొని విమానాశ్రయ పరిసరాల్లో భౌతిక దూరం పాటించడం వంటి అన్ని నిబంధనలను తు.చ. తప్పకుండా పాటించేలా విమానాశ్రయాల అధికారులు చర్యలు తీసుకోవాలి. ఈ మేరకు నిఘాను మరింత పెంచాలి’అని అందులో కోరింది. ‘నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం అక్కడికక్కడే జరిమానా విధించడం వంటి కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో స్థానిక పోలీసు అధికారుల సహకారం తీసుకోవాలి’అని సూచించింది. పదేపదే హెచ్చరించినా కోవిడ్‌–19 ప్రొటోకాల్‌ను పాటించని ప్రయాణికులను విమా నాశ్రయాల అధికారులు వెంటనే భద్రతా సిబ్బం దికి అప్పగించాలని మార్చి 13వ తేదీ నాటి సర్క్యులర్‌లో తెలిపింది. దీంతోపాటు, పలుమార్లు హెచ్చరించినా నిబంధనలను పాటించడానికి నిరాకరించే ప్రయాణికులను విమానం నుంచి దించివేయాలని, అటువంటి వారిని నిబంధనలు పాటించని ప్రయాణికులుగా గుర్తించాలని కూడా సూచించింది.

ఇలా గుర్తించిన ప్రయాణికులపై విమానయాన సంస్థలు మూడు నుంచి 24 నెలల వ రకు ప్రయాణ నిషేధం విధించవచ్చని డీజీసీఏ నిబంధనలు చెబుతున్నాయి. మార్చి 15 నుంచి 23వ తేదీ వరకు దేశీయ విమానయాన సంస్థల విమానాల్లో ప్రయాణించిన 15 మంది ప్రయా ణికు లు కోవిడ్‌–19 నిబంధనలను పాటించలేదన్న విష యాన్ని అధికారులు గుర్తించారు. వీరిపై 3 నెలల ప్రయాణ నిషేధం విధించే అవకాశం ఉందని డీజీ సీఏ ఉన్నతాధికారులు తెలిపారు. విమానం లోపల ఉన్న సమయంలో మాస్క్‌ ధరించేందుకు కొందరు నిరాకరిస్తుండగా, మధ్యసీట్లలో కూర్చునే వారు తప్పనిసరిగా పీపీఈ కిట్‌ ధరించాలనే నిబంధనను మరికొందరు పట్టించుకోవడం లేదని తెలిపారు.  

Advertisement
Advertisement