ఆరెస్సెస్‌ నేతల ఖాతాలకే ఇలా.. ఇదే ఆఖరి హెచ్చరిక

Govt gives final notice to Twitter for compliance with IT Rules - Sakshi

నిబంధనలు పాటించకపోతే చట్టపరమైన చర్యలు 

ట్విట్టర్‌కు కేంద్రం నోటీసులు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం, సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ మధ్య పోరు మరింత తీవ్రమైంది. కొత్త డిజిటల్‌ (ఐటీ) నిబంధనల ప్రకారం దేశంలో భారత్‌కు చెందిన అధికారుల్ని నియమించకపోవడంతో ట్విట్టర్‌పై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కొత్త నిబంధనల్లో అమల్లోకి వచ్చి వారం రోజులు గడిచిపోయినా ట్విట్టర్‌ ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో కేంద్ర ఐటీ శాఖ ఆ సంస్థకు చివరి హెచ్చరికగా శనివారం నోటీసులు జారీ చేసింది. ట్విటర్‌లో నెటిజన్లు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి భారత్‌కు చెందిన అధికారుల్ని నియమించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యక్తిగత ఖాతాకి సంబంధించి బ్లూ టిక్స్‌ బ్యాడ్జ్‌ని ట్విట్టర్‌ కొద్దిసేపు తొలగించి మళ్లీ పునరుద్ధించింది. ఇది జరిగిన కొద్ది గంట్లోలనే కేంద్రం ట్విటర్‌కి నోటీసులు పంపింది. కొత్త నిబంధనలు పాటించడానికి ట్విట్టర్‌ విముఖత చూపించడం భారతదేశ ప్రజల పట్ల ఆ సంస్థకు చిత్తశుద్ధి లేకపోవడాన్ని తేటతెల్లం చేస్తోందని పేర్కొంది. ట్విట్టర్‌ వేదికగా భారత్‌ ప్రజలు ఎదుర్కొనే సమస్యలు సరైన సమయంలో పారదర్శకంగా పరిష్కారమవ్వాలంటే దేశ పౌరులే అధికారులుగా ఉండాలని స్పష్టం చేసింది. ఇదే తాము ఇచ్చే చివరి నోటీసు అని తక్షణమే చీఫ్‌ కంప్లయన్స్‌ ఆఫీసర్, రెసిడెంట్‌ గ్రీవెన్స్‌ ఆఫీస్, నోడల్‌ కాంటాక్ట్‌ ఆఫీసర్లుగా భారతీయుల్ని నియమించకపోతే చట్టపరమైన చర్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ నోటీసుల్లో హెచ్చరించింది.

బ్లూ బ్యాడ్జ్‌ వివాదం
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ ట్విట్టర్‌ అకౌంట్లలో బ్ల్యూ బ్యాడ్జ్‌ను తొలగించడం చర్చనీయాంశంగా మారింది. వెరిఫై చేసిన అకౌంట్లకు ట్విట్టర్‌ బ్లూ బ్యాడ్జ్‌ ఇస్తుంది. అంటే సదరు వినియోగదారుడే ఈ ఖాతాను వాడుతున్నట్లు అధికారికంగా ధృవీకరించడమన్న మాట. శనివారం ఉదయం తొలుత వెంకయ్య వ్యక్తిగత ఖాతాకు బ్లూ బ్యాడ్జ్‌ను తొలగించిన ట్విట్టర్‌ తర్వాత పునరుద్ధరించింది. ఆరెస్సెస్‌ చీఫ్‌  భగవత్‌ వ్యక్తిగత ఖాతాతో పాటుగా ఇతర ఆరెస్సెస్‌ నేతలు సురేష్‌ సోని, అరుణ్‌కుమార్, సురేష్‌ జోషి, కృష్ణ గోపాల్‌ ఖాతాల్లో వెరిఫైడ్‌ బ్లూ టిక్స్‌ను తొలగించింది. 

ఆరెస్సెస్‌ నేతల ఖాతాలకే ఇలా జరగడం వివక్షాపూరిత చర్యని ఆరెస్సెస్‌ ఢిల్లీ యూనిట్‌ నాయకుడు రాజీవ్‌ మండిపడ్డారు. టెక్‌ ఫ్యూడలిజానికి ట్విట్టర్‌ నిదర్శనంగా మారుతోందని విమర్శించారు. ట్విట్టర్‌ చర్యలపై సర్వత్రా విమర్శలు రావడంతో ఆ సంస్థ వివరణ ఇచ్చింది. ఆరు నెలల పాటు ఖాతాను వినియోగించకపోతే, ఎలాంటి ట్వీట్లు చేయకపోతే బ్లూ బ్యాడ్జ్‌ ఆటోమేటిక్‌గా తొలగిపోతుందని ట్విట్టర్‌ తెలిపింది. గత కొద్దికాలంగా వారెవరూ ట్వీట్లు  చేయకపోవడంతో బ్ల్యూ టిక్స్‌ పోయాయని, ఇప్పుడు వాటిని పునరుద్ధరించామని వివరించింది.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top