సాక్షి, ఢిల్లీ: కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. డియర్ అలవెన్స్‌ను 2 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు శనివారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది.
ఉద్యోగుల వేతనాలపై 8వ వేతన కమిషన్ ప్రతిపాదనలు ఇంకా పరిశీలనలో ఉండడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో DA పెంపు ఉద్యోగులకు తక్షణ ఉపశమనంగా చెప్పొచ్చు. తాజా పెంపుతో డీఏ ప్రస్తుతం 60 శాతానికి చేరింది. ఈ ఏడాది జనవరి నుంచే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పెంపు వర్తించనుంది.
ఒకవైపు ఉద్యోగ సంఘాలు 8వ వేతన కమిషన్ కింద వేతన నిర్మాణంలో పెద్ద మార్పులు కోరుతూ.. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 3.83గా పెంచాలని, కనీస బేసిక్ పే రూ.18,000 నుంచి రూ.69,000కి పెంచాలని ప్రతిపాదించాయి. అలాగే, వేతన లెక్కల్లో ఆధారపడిన తల్లిదండ్రులను కూడా ‘కుటుంబం’ నిర్వచనంలో చేర్చాలని.. వేతన వ్యత్యాసానికి పరిమితి పెట్టాలని, ద్రవ్యోల్బణానికి అనుసంధానంగా అలవెన్సులు ఇవ్వాలని సూచిస్తున్నాయి.
ఉద్యోగుల ప్రయోజనాలతో పాటు, కేంద్రం సముద్ర రవాణా రంగానికి కూడా పెద్ద ఊరట ఇచ్చింది. సావరిన్ మారిటైం ఫండ్ పేరుతో రూ.13,000 కోట్ల నిధిని కేబినెట్ మీటింగ్‌లో ఆమోదించింది. దీని ద్వారా భారత్ నుంచి బయలుదేరే నౌకలకు స్థిరమైన, తక్కువ ఖర్చుతో కూడిన ఇన్సూరెన్స్ అందించనుంది. ఇది సముద్ర రవాణా రంగానికి భద్రతా పరంగా కీలకంగా మారనుంది.
గ్రామీణ రహదారి అభివృద్ధి కోసం కూడా కేంద్ర మంత్రి మండలి మరో నిర్ణయం తీసుకుంది. ప్రధాన్ మంత్రి గ్రామ సడక్ యోజన (PMGSY)ను 2028 వరకు పొడిగించింది. అదనంగా రూ.3,000 కోట్ల కేటాయింపును ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలు మెరుగుపడటానికి ఇది తోడ్పడనుంది.


