ఆ చట్టాలను రద్దు చేయండి!

Ghulam Nabi Azad demands repeal of agri laws - Sakshi

ప్రభుత్వం ప్రతిష్టకు పోవద్దు; రైతులను శత్రువులుగా చూడొద్దు

రాజ్యసభలో విపక్ష సభ్యుల విజ్ఞప్తి

లోక్‌సభలో కొనసాగిన వాయిదాలు

న్యూఢిల్లీ:  వివాదాస్పద వ్యవసాయ చట్టాలు, రైతుల ఉద్యమాన్ని చర్చలో ప్రస్తావించేందుకు అధికార, విపక్షాల మధ్య అంగీకారం కుదరడంతో.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం రాజ్యసభలో చర్చ ప్రారంభమైంది. చర్చలో సాగు చట్టాలు, రైతాంగ ఉద్యమం అంశాలను ప్రస్తావించేందుకు వీలుగా చర్చా సమయాన్ని మరో ఐదు గంటల పాటు పెంచేందుకు అధికారపక్షం అంగీకరించింది. దాంతో, ఆ చర్చ ముందుగా అనుకున్న 10 గంటల పాటు కాకుండా, మొత్తం 15 గంటల పాటు కొనసాగనుంది. ఇందుకు గానూ, బుధవారం ప్రశ్నోత్తరాల సమయాన్ని, అలాగే, గురువారం జీరో అవర్‌ను, ప్రశ్నోత్తరాల సమయాన్ని నిర్వహించకూడదని నిర్ణయించారు.

ఈ మేరకు, అధికార, విపక్షాల మధ్య అంగీకారం కుదిరింది. దాంతో, బుధవారం చర్చ ప్రారంభమైంది. వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోవాలని ఈ సందర్భంగా విపక్ష సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రతిష్టకు సంబంధించిన అంశంగా తీసుకోవద్దని, రైతులను శత్రువులుగా పరిగణించవద్దని సూచించారు. చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ స్వయంగా ప్రకటిస్తే బావుంటుందని రాజ్యసభలో విపక్ష నేత, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు గులాం నబీ ఆజాద్‌ సూచించారు. ఆ సమయంలో ప్రధాని సభలోనే ఉండటం విశేషం. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న సమయంలోనే కాకుండా, పలు సందర్భాల్లో రైతుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన విషయాన్ని ఆజాద్‌ గుర్తు చేశారు.

రిపబ్లిక్‌ డే రోజు ఎర్రకోటపై జరిగిన ఘటనలను ఖండిస్తున్నామని, జాతీయ పతాకాన్ని అవమానించడం ఎవరూ సహించరని ఆయన స్పష్టం చేశారు. జనవరి 26న రైతుల ట్రాక్టర్‌ ర్యాలీ తరువాత అదృశ్యమైన రైతుల ఆచూకీని గుర్తించడం కోసం కమిటీని వేయాలని సూచించారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వాలని డీఎంకే సభ్యుడు తిరుచ్చి శివ డిమాండ్‌ చేశారు. ఆ చట్టాలు ఆమోదం పొందిన తీరును విమర్శించారు. దానిపై స్పందించిన చైర్మన్‌ వెంకయ్యనాయుడు.. నిబంధనల ప్రకారమే అవి ఆమోదం పొందాయని స్పష్టం చేశారు. రైతులను శత్రువులుగా చూడొద్దని, వారి భయాందోళనలను గుర్తించి, ఆ చట్టాలను రద్దు చేయాలని చర్చలో పాల్గొన్న సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు రామ్‌గోపాల్‌ యాదవ్‌ కోరారు. ఉద్యమంలో రైతులు చనిపోతున్నా పట్టించుకోకుండా, నిర్దాక్షిణ్యంగా, క్రూరంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు.

రైతులు ఉద్యమిస్తే పెద్ద పెద్ద నేతలే గద్దె దిగిన విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ‘అధికారం నెత్తికెక్కకూడదు. రైతులతో చర్చించండి. ఇది ప్రజాస్వామ్యం. మన జనాభాలో వారే ఎక్కువ. చట్టాలను రద్దు చేస్తామని వారికి చెప్పండి’ అని యాదవ్‌ ప్రభుత్వానికి హితవు పలికారు. ఉద్యమంలో చనిపోయిన రైతుల కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని, పిల్లల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రైతు నిరసన కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన భద్రతాఏర్పాట్లపై స్పందిస్తూ.. ‘ఈ పార్లమెంటు వద్ద, పాకిస్తాన్, చైనా సరిహద్దుల వద్ద కూడా అంత భద్రత లేదు. వారేమైనా ఢిల్లీ మీద దాడికి వచ్చారా? వారేమైనా మన శత్రువులా?’ అని ప్రశ్నించారు. రైతులు దేశానికి అన్నం పెడ్తున్నారని, వారి పిల్లలు దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ఉన్నారని గుర్తు చేశారు. వ్యవసాయ చట్టాలను హడావుడిగా ఆమోదించారని సీపీఎం సభ్యుడు ఎలమారం కరీమ్‌ విమర్శించారు.

లోక్‌సభలో..
వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై ప్రత్యేకంగా చర్చ జరపాలన్న విపక్షాల డిమాండ్‌పై బుధవారం లోక్‌సభ పలుమార్లు వాయిదా పడింది. సభ సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కాగానే, కాంగ్రెస్‌ సభ్యుడు ఆధిర్‌రంజన్‌ చౌధురి రైతు ఉద్యమ అంశాన్ని లేవనెత్తేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ పలువురు విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకువెళ్లారు. ప్రశ్నోత్తరాల సమయం జరగాలని, అందుకు సభ్యులు సహకరించాలని స్పీకర్‌ ఓం బిర్లా పలుమార్లు సభ్యులకు విజ్ఞప్తి చేశారు. సభ్యులు పట్టించుకోకపోవడంతో, సభను సాయంత్రం 4.30కు వాయిదా వేశారు. తిరిగి సమావేశమైన తరువాత కూడా సభ్యుల నిరసన కొనసాగడంతో, వరుసగా మూడుసార్లు సభను స్పీకర్‌ వాయిదా వేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చతో పాటు రైతు ఉద్యమం, సాగు చట్టాలపై ప్రత్యేకంగా చర్చ జరగాలని ఆధిర్‌ రంజన్‌ చౌధురి డిమాండ్‌ చేశారు. సభ్యుల నిరసనల మధ్యనే జీరో అవర్‌ను నిర్వహించేందుకు స్పీకర్‌ ప్రయత్నించారు. ‘దేశమంతా గమనిస్తోంది. నిరసనలు, నినాదాలతో సభ ప్రతిష్టను దిగజార్చవద్ద’ని పలుమార్లు ఆయన సభ్యులను కోరారు. వెల్‌లోకి వచ్చి నిరసన తెలిపిన వారిలో శిరోమణి అకాలీదళ్‌ ఎంపీ, మాజీ మంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌తో పాటు డీఎంకే, కాంగ్రెస్, ఆప్‌ పార్టీల సభ్యులున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top