Chhattisgarh: జీడిపప్పుకు సవాల్‌ విసిరిన వెల్లుల్లి!

Garlic is Giving Competition to Cashew Nuts - Sakshi

వెల్లుల్లి ధరలు విపరీతంగా పెరుగుతూ, జీడిపప్పుకు సవాల్‌ విసురుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని వైకుంఠ్‌పూర్, మనేంద్రగఢ్, చిర్మిరి, ఖడ్గవాన్‌తో సహా పరిసర ప్రాంతాల్లో కిలో వెల్లుల్లిని రూ.400 నుండి రూ.600కు విక్రయిస్తున్నారు. 

నెల రోజుల క్రితం కిలో వెల్లుల్లి రూ.200కు విక్రయించగా, తరువాత అంతకంతకూ పెరుగుతూవస్తోంది. స్థానిక కూరగాయల వ్యాపారి రాజ్ కుష్వాహ తెలిపిన వివరాల ప్రకారం జనవరిలో కిలో వెల్లుల్లి ధర రూ.200 ఉండగా, ప్రస్తుతం రూ.600 దాటింది. కూరల రుచిని పెంచే వెల్లుల్లి ఇప్పుడు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది. ప్రస్తుతం జీడిపప్పు ధరలతో వెల్లుల్లి ధర పోటీ పడుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మార్కెట్లో కిలో జీడి పప్పు ధర రూ. 800 నుంచి 1000 మధ్య ఉంటోంది.

ప్రభుత్వం వెల్లుల్లి ధరలను నియంత్రించే ప్రయత్నం చేయడంలేదని పలువురు విమర్శిస్తున్నారు. ఈసారి హోల్‌సేల్‌లో కూడా వెల్లుల్లి కిలో రూ.421 చొప్పున విక్రయిస్తున్నారు. దీంతో రిటైల్ మార్కెట్‌లో వెల్లుల్లి ధర రూ.600 దాటింది. గత శనివారం నుంచి కొత్త వెల్లుల్లి మార్కెట్‌లోకి రావడంతోనే వీటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. 

వెల్లుల్లి ధర ఒక్కసారిగా పెరగడంపై ఈ ప్రాంత రైతు అమిత్ కుమార్ గుప్తా మాట్లాడుతూ.. గత ఏడాది అధికశాతం రైతులు వెల్లుల్లి సాగు చేశారన్నారు. దీంతో మార్కెట్‌లో వెల్లుల్లి ధర బాగా తగ్గిందన్నారు. దీంతో ఈ ఏడాది రైతులు వెల్లుల్లి సాగును తగ్గించారు. దీంతో మార్కెట్‌లో వెల్లుల్లి కొరత ఏర్పడింది. ఫలితంగా వెల్లుల్లి ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. 

గత ఏడాది స్థానికంగా వెల్లుల్లి ఎక్కువగా పండడంతో గిట్టుబాటు ధర లభించక రైతులు తమ పంటలను నదులు, కాలువల్లో పడేశారు. గత సంవత్సరం, వెల్లుల్లి హోల్‌సేల్ ధర కిలో రూ. 40. మార్కెట్ ధర దీని కంటే తక్కువగా ఉంది. దీంతో రైతులు భారీగా నష్టపోయారు. ఫలితంగా రైతులు ఈసారి వెల్లుల్లి సాగును తగ్గించారు. 

whatsapp channel

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top