
ఆహారానికీ– పీడ కలలకు సంబంధం!
లాక్టోస్, గ్లూటెన్ పడకుంటే నిద్రలేమి
పేగుల నుంచి మెదడుకు బ్యాడ్ సిగ్నల్స్
ఫైబర్, లీన్ ప్రొటీన్‌లతో కలల విరుగుడు
నీల్సన్, డెనాల్డ్, పావెల్ అధ్యయనం
ఇంతవరకూ ఎవరు చెప్పినా, ‘‘పగటి పూట ఆలోచనలే రాత్రి పూట కలలు’’ అని చెప్పినవాళ్లే. సిగ్మండ్ ఫ్రాయిడ్ అదే చెప్పారు. మన వేదాలూ, ఉపనిషత్తులూ అదే చెప్పాయి. అయితే ఏం తింటే కలలు, పీడకలలు వస్తాయో ఏ కలల శాస్త్రమూ చెప్పలేదు. ఏ శాస్త్ర పరిశోధనా గుట్టు విప్పలేదు. అయినా తినే ఆహారానికీ, నిద్రలో వచ్చే కలలకు సంబంధం ఉంటుందని అసలు ఎవరు ఊహిస్తారు కనుక?! ఆహారమేమో కడుపులోకి వెళ్లేది. కలలేమో బ్రెయిన్‌లోంచి వచ్చేవి. లింక్ ఎలా ఉంటుంది? అందుకే ఆ వైపుగా పరిశోధనలు జరగలేదు. తాజాగా ఇప్పుడు, పరిశోధన కాదు కానీ, అధ్యయనం ఒకటి జరిగింది. అందులో ఏం తేలిందంటే.. పడనివి తింటే పీడకలలు మన పీక పట్టుకుంటాయని!!
ఏం తింటే వస్తాయి?
కలలు ఎందుకొస్తాయో చెప్పే శాస్త్రాలే కానీ, ఏం తింటే కలలు వస్తాయో చెప్పిన శాస్త్రం ఒక్కటీ మనకు లేదు. ‘ఆన్ డ్రీమ్స్’ అని అరిస్టాటిల్ రాసినా, ‘ది ఫిలాసఫీ ఆఫ్ డ్రీమ్స్’ అని స్వామీ శివానంద విశ్లేషించినా.. అవేవీ కూడా ‘కలలకు మేత ఎవరు వేస్తున్నారు?’ అనే కోణం లోంచి దృష్టి సారించినవి కావు. అయితే ఇటీవల కెనడా అధ్యయనవేత్తలు కొందరు కలలకు–ఆహారానికి సంబంధం ఉందని నిర్ధారించటంతో, ‘ఏం తింటే పీడ కలలు వస్తాయి?’ అనే ఆసక్తి అంతటా మొదలైంది.
పాలు కలిస్తే పీడ కలలు!
తాజా అధ్యయనానికి ముందు కూడా కొన్ని సర్వేలు జరిగాయి. కానీ అవి – ‘కలలకు, కడుపుకు సంబంధం ఉండే అవకాశం లేకపోలేదు’ అన్నంత వరకు మాత్రమే ఫలితాలను అందించాయి. 2005 నుంచి ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న మరొక అధ్యయనం ఈ దిశగా ఒక అడుగు ముందుకు వేసి, ఫాస్ట్ ఫుడ్ తినే వారి కంటే పాల ఉత్పత్తులతో కూడిన ఆహారం తినే వారికే ఎక్కువగా వింతైన కలలు వస్తున్నట్లు కనుగొంది!
స్వీట్లు తినేవారిలో ఎక్కువ
2021లో జరిగిన సర్వేలో.. పండ్లు, చేపలు ఎక్కువగా తింటే, రాత్రి కన్న కలలు ఉదయానికి బాగా స్పష్టంగా జ్ఞాపకం ఉంటాయని; అలాగే చక్కెరలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల పీడ కలలు వస్తున్నాయనీ వేర్వేరుగా రెండు అంశాలను అధ్యయనవేత్తలు గుర్తించారు. ఇక 2015లో జరిగిన అధ్యయనంలో పాల్గొన్న వారిలో దాదాపు 18 శాతం మంది.. తినే ఆహారం కలలకు కారణం అవుతుందన్న భావనను ఆమోదించారు.
సైకాలజీ విద్యార్థులపై సర్వే
ఇరవై ఏళ్లుగా జరుగుతున్న అధ్యయనాలన్నిటికీ కొనసాగింపుగా, ఇటీవల 1,082 మంది కెనడా మనస్తత్వశాస్త్ర విద్యార్థులతో నీల్సన్, డెనాల్డ్, పావెల్ పరిశోధకులు ఆ¯Œ లైన్ సర్వే నిర్వహించారు. ఆ విద్యార్థుల ఆహార అలవాట్లు, ఆరోగ్యం ఎలా ఉంటున్నదీ, సరిగానే నిద్ర పోతున్నారా, ఎలాంటి కలలు వస్తుంటాయి అనే ప్రశ్నలు అడిగారు. ఆహారం, పడని ఆహారం కలలను ఎలా ప్రభావితం చేస్తోందన్నది కనిపెట్టటమే వారి లక్ష్యం.ఆ ప్రయత్నంలో పీడ కలలు రావటం పైన కూడా ఆహారం ప్రభావం ఉన్నట్లు వారు గుర్తించారు!
తాజా అధ్యయన ఫలితాలు
⇒ ఫుడ్ అలర్జీలు; గోధుమ, బార్లీలో ఉండే గ్లూటెన్ పడని వారికి పీడకలలు వస్తున్నాయి.
⇒ ఆహారంలోని లాక్టోస్ పడని వారికి నిద్రలేమి ఉంటోంది.
⇒ కడుపు నొప్పి, ఉబ్బరం వంటి జీర్ణాశయ ఇబ్బందులలో కూడా లాక్టోస్ పాత్ర ఉంటోంది.
⇒ గట్ మైక్రోబయోమ్ (పెద్ద పేగులో ఉండే బ్యాక్టీరియాలోని సంక్లిష్ట వ్యవస్థ), కేంద్ర నాడీ వ్యవస్థ మధ్య సంబంధం ఉంది.
⇒ పేగుల్లోని ఇబ్బంది నిద్రలో పీడ కలలకు దారి తీస్తోంది.
⇒ ‘పోస్ట్–ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్’ ప్రభావంగా కనిపించే పీడ కలలకు, ఆహారానికి లంకె కనిపించింది.
⇒ కొన్ని ఆహారాలు కలలపై ఎంతవరకు ప్రభావం చూపుతాయో పరీక్షించడానికి మరిన్ని అధ్యయనాలు అవసరం.
తదుపరి అధ్యయనాలు
⇒ లాక్టోస్ ఉన్న జున్ను, లాక్టోస్ లేని జున్ను వంటి కొన్ని ఆహారాలను తిన్నప్పుడు ఏమి జరుగుతుందో పరీక్షించడం.
⇒ లాక్టోస్ పడని వారు, తరచుగా పీడకలలు వచ్చేవారు, వివిధ రకాల ఫుడ్ అలర్జీలు ఉన్న వారిని మరింత లోతుగా పరిశీలించడం.
విరుగుడు ఉపాయాలు
పీడ కలల్ని నిరోధించటానికి అధ్యయనవేత్తలు కొన్ని సూచనలు ఇస్తున్నారు. అవి :
⇒ రాత్రి ఆలస్యంగా తినకండి.
⇒ తియ్యగా, కారంగా ఉండే ఆహారాలు భారీగా తీసుకోకండి.
⇒ లాక్టోస్ పడకపోతే, పడుకునే ముందు పాల ఉత్పత్తులను తీసుకోకండి. లాక్టోస్ లేని ఆహారాన్ని భుజించండి.
⇒ గట్టిగా ఉన్న, ఎక్కువ కాలం నిల్వ ఉన్న జున్నులో.. మృదువైన, తాజా జున్నులో కంటే లాక్టోస్ తక్కువగా ఉంటుంది.
⇒ మీకు ఫుడ్ అలర్జీలు ఉంటే, పడుకునే ముందు అటువంటి ఆహారాలను తీసుకోవడం తగ్గించండి.
⇒ మీ నిద్రను లేదా కలల నాణ్యతను ప్రభావితం చేసే ఆహార పదార్థాలేవో మీకు మీరే గుర్తించండి.
⇒ నిజంగా అవి మీ నిద్రను లేదా మీ కలల నాణ్యతను ప్రభావితం చేస్తాయో లేదో చూడటానికి వాటిని అప్పుడప్పుడు తినకుండా, ఏం జరుగుతుందో గమనించండి.
⇒ ఫైబర్ ఉన్న పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లతో కూడిన (కొవ్వులు, కేలరీలు తక్కువగా ఉండేవి) పోషకాలు అధికంగా ఉండే సమతుల ఆహారం తీసుకోండి. చక్కగా నిద్రపడుతుంది.
ప్రధాన అధ్యయనాలు
బ్రిటిష్ చీజ్ బోర్డ్ (2005) నీల్సన్, పావెల్ (2015)
అబ్దుల్ రజాక్ ఎట్ ఆల్ (2021) నీల్సన్, డెనాల్డ్, పావెల్ (2025)