పరీక్షకు ముందే ప్రశ్నాపత్రాలు లీక్‌ 

FDA Exam Question Paper Leak In Karnataka - Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (కేఎస్‌పీఎస్సీ) పరిధిలోని ఎఫ్‌డీఏ ఉద్యోగాల పరీక్షా ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో ఇప్పటివరకు 14 మందిని బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 36 పేజీల ప్రశ్నాపత్రాలను సీజ్‌ చేశారు. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఎఫ్‌డీఏ పరీక్ష జరగాల్సి ఉండగా, లీకేజీ వల్ల శనివారం రాత్రి రద్దు చేశారు. క్వశ్చన్‌ పేపర్‌లో 100 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 36 పేజీల ప్రశ్నాపత్రం లీక్‌ అయింది. నిందితుల వద్ద క్వశ్చన్‌ పేపర్‌ ముందు, వెనుక పేజీ మినహాయించి మిగిలిన అన్ని పేజీలు లభించాయి. జ్ఞానభారతి పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఉల్లాళలో ఉన్న అపార్టుమెంటులో శనివారం సీసీబీ అధికారులు సోదాలు జరిపి ప్రధాన నిందితుడు చంద్రు, రాచప్ప అనే ఇద్దరిని అరెస్టు చేశారు. వీరిని విచారించగా మరో 12 మంది గురించి చెప్పగా వారినీ అరెస్టు చేశారు.  

రూ.35 లక్షలు, 4 కార్లు సీజ్‌..: మొత్తం ఈ 14 మంది నిందితుల వద్ద నుంచి రూ 35 లక్షల నగదు, నాలుగు కార్లు, వారి వద్ద ఉన్న జీకే, కన్నడ క్వశ్చన్‌పేపర్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులకు ఆ ప్రశ్నాపత్రిక ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరెవరు ఈ లీకేజీ స్కామ్‌లో ఉన్నారనే విషయంపై పోలీసులు విచారణ చేపడుతున్నట్లు సీసీబీ పోలీసు కమిషనర్‌ సందీప్‌ పాటిల్‌ తెలిపారు. కేపీఎస్సీ కార్యాలయంలోని ఇద్దరు సిబ్బందిపై సీసీబీకి అనుమానంగా ఉంది. అనుమానితుల మొబైల్‌ ఫోన్లు స్విచ్ఛాప్‌ అయి ఉండడంతో అనుమానం మరింత బలపడుతోంది. ఈ ఘటనపై హోం మంత్రి బసవరాజు బొమ్మాయి స్పందిస్తూ ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు, ఘటన వెనుక ఎంతటివారున్నా.. ఉపేక్షించేది లేదని తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top