
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం
లారీని ఢీ కొట్టిన ఏపీఎస్ ఆర్టీసీ బస్సు
ఐదుగురు మృతి, 16 మందికి గాయాలు
మృతులంతా ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసులు
బస్సు డ్రైవర్ లారీని ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించడం వల్లే ప్రమాదం
సాక్షి బెంగళూరు/కార్వేటినగరం: కర్ణాటకలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు ఏపీ వాసులు మృతిచెందారు. ఏపీఎస్ ఆర్టీసీ చిత్తూరు–2 డిపోకు చెందిన ఎక్స్‌ప్రెస్ బస్సు గురువారం రాత్రి తిరుపతి నుంచి బెంగళూరుకు బయలుదేరింది. బస్సు శుక్రవారం తెల్లవారుజామున బెంగళూరు శివారులోని హోసకోటె–కోలారు జాతీయ రహదారిపై గొట్టిపుర గేట్ వద్దకు చేరుకోగానే డ్రైవర్ వేగంగా వెళుతూ ముందు వెళుతున్న లారీని ఓవర్‌టేక్ చేసేందుకు ప్రయత్నించాడు.
బస్సు అదుపు తప్పి లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. బస్సులో ఉన్న ప్రయాణికుల్లో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. గాయపడిన మరో 18 మందిని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఇద్దరు మృతిచెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
మృతులను చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం పాపిరెడ్డిపల్లె పంచాయతి మారేడుపల్లె గ్రామానికి విశ్వనాథరెడ్డి భార్య శారద(40), వెదురుకుప్పం మండలం ఆళ్లమడుగు గ్రామానికి చెందిన కె.కేశవులురెడ్డి(45), అతని తమ్ముడు జనార్దన్‌రెడ్డి కుమారుడు 45 రోజుల చిన్నారి, శ్రీరంగరాజపురం మండలంలోని కమ్మకండ్రిగ గ్రామానికి చెందిన తులసి (22), తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం తిమ్మరాజుపల్లె గ్రామానికి చెందిన హరిబాబు, రోహిణి దంపతుల కుమార్తె ప్రణతి(4)గా గుర్తించారు.
ప్రణతి తండ్రి బెంగళూరులో ఆర్మీ ఉద్యోగం చేస్తున్నాడు. క్షతగాత్రులను సిలికాన్ సిటీ, ఎంవీజే ఆస్పత్రుల్లో చేర్పిం చి చికిత్స అందిస్తున్నారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతోపాటు అతి వేగంతో లారీని ఓవర్‌టేక్ చేయడానికి ప్రయతి్నంచడమే ఈ ప్రమాదానికి కారణమని హోసకోటె పోలీసులు తెలిపారు. బెంగళూరు రూరల్ జిల్లా ఎస్పీ సీకే బాబా ఘటనాస్థలాన్ని పరిశీలించారు.