నిరసన గళం వారిదే | Sakshi
Sakshi News home page

నిరసన గళం వారిదే

Published Thu, Dec 17 2020 6:21 AM

Farmers Protest Completes 20 Days In Punjab Farmers Serious At Delhi - Sakshi

వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలంటూ వారి గళం దేశమంతా ప్రతిధ్వనిస్తోంది. కేంద్రం బుజ్జగించినా వినడం లేదు, కరుకు లాఠీ దెబ్బలకి వెరవడం లేదు. 20 రోజులు దాటిపోయింది. ఢిల్లీ వీధుల్లో నిరసనలు హోరెత్తిపోతున్నాయి. ఈ రైతు పోరాటంలో పంజాబ్‌ రైతులే ఎందుకు ముందున్నారు? వారే ఎందుకు ఉద్యమాన్ని ఉరకలెత్తిస్తున్నారు ?

హరిత విప్లవం వెల్లువెత్తిన రాష్ట్రం అది.  దేశంలో ఆర్థిక సరళీకరణలు ప్రారంభమవడానికి ముందే అర్బన్‌ ఇండియా పురోగతికి బీజాలు వేసిన రాష్ట్రం అది. వ్యవసాయ రంగంలో పెట్టుబడులు అత్యధికంగా పెట్టే రాష్ట్రంలోనూ పంజాబే ముందుంటుంది.  కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)తో దేశం మొత్తమ్మీద ఎక్కువగా లబ్ధి పొందేది  పంజాబ్‌ రైతులే. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌ కమిటీ (ఏపీఎంసీ) దేశం మొత్తమ్మీద పండే పంటలో 10శాతాన్ని కొంటే పంజాబ్‌లో పండే పంటలో 90% శాతాన్ని కొనుగోలు చేస్తుంది. కొత్త సాగు చట్టాలు ఒకే దేశం ఒకే మార్కెట్‌ వ్యవస్థకు శ్రీకారం చుట్టడంతో రాష్ట్రాలు ఎలాంటి సెస్‌లు, పన్నులు విధించడానికి వీల్లేదు. దీంతో మండీ వ్యవస్థ నీరు కారిపోయి కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కే ఎసరొస్తుందన్న ఆందోళనలు రైతుల్లో ఉన్నాయి. దేశంలోని వ్యవసాయ ఉత్పాదకతలో 70శాతం పంజాబ్, ఏపీ, కర్ణాటక, యూపీ, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, హరియాణా,  మహారాష్ట్రల నుంచి వస్తోంది. ఆ 8 రాష్ట్రాల్లో సాగు భూమి, వ్యవసాయ ఉత్పత్తుల వాటా, వ్యవసాయ రంగంలో పెట్టే పెట్టుబడులు, చేసే ఆదా, ఎరువుల వినియోగం వంటి గణాంకాలన్నీ పంజాబ్‌ రైతులు ఈ పోరాటాన్ని ఎందుకంత ఉధృతంగా చేస్తున్నారో తేటతెల్లం చేస్తున్నాయి.  








ఢిల్లీలో జరుగుతున్న రైతు నిరసనల్లో మహిళలు అంతగా కనిపించడం లేదు. దీనికి కారణం పంజాబ్‌లో భూమిపై హక్కులు కలిగిన మహిళల సంఖ్య చాలా తక్కువ. దేశంలోని మహిళల్లో సగటున 12.9% మంది మాత్రమే భూమిపై యాజమాన్య హక్కులు కలిగి ఉన్నారు. ఈ అంశంలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలు కాస్త మెరుగ్గా ఉన్నాయనే చెప్పాలి. దక్షిణాదిన 15.4% మంది మహిళలకి భూమిపై హక్కులు ఉంటే, ఉత్తరాదిన 9.8 శాతంగా ఉంది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలైన పేదరిక నిర్మూలన, లింగ సమానత్వం వంటివి సాధించాలంటే మహిళలకు భద్రమైన జీవితం, భూమిపై హక్కులు ఉండాలి. ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ అంచనాల ప్రకారం వ్యవసాయ కూలీల్లో 32% ఉన్న మహిళలు ఉత్పత్తి విషయానికొచ్చేసరికి  55–66శాతం వాటా ఇస్తున్నారు. 

Advertisement
Advertisement