వారసుల ప్రస్తావన లేదని వీలునామాను కొట్టిపారేయలేం: సుప్రీం  | Exclusion of Natural Heirs Alone Does Not Invalidate a Will | Sakshi
Sakshi News home page

వారసుల ప్రస్తావన లేదని వీలునామాను కొట్టిపారేయలేం: సుప్రీం 

May 22 2026 5:24 AM | Updated on May 22 2026 5:24 AM

Exclusion of Natural Heirs Alone Does Not Invalidate a Will

న్యూఢిల్లీ: సహజ వారసత్వ క్రమాన్ని మార్చడమే వీలునామా వెనకున్న అసలు ఉద్దేశమని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. కేవలం సహజ వారసుల ప్రస్తావన లేదనే ఏకైక కారణంతో వీలునామాను రద్దు చేయడం లేదా అనుమానాస్పదమైందిగా పరిగణించలేమని పేర్కొంది. చార్టెర్డ్‌ అక్కౌంటెంట్‌గా పనిచేసిన దివంగత షీనా నాయిరి 1983లో కర్ణాటకలోని తన ఆస్తుల్లో కొన్నిటిని సోదరి అయిన లక్ష్మీ నాయిర్తి పేరిట రాశారు.

 ఆ వీలునామా చెల్లదంటూ ఆయన భార్య, పిల్లలు వేసిన పిటిషన్‌పై జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, జస్టిస్‌ విజయ్‌ బిష్ణోయ్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. వీలునామా వాస్తవమైందేనని ట్రయల్‌ కోర్టు, అప్పిలేట్‌ కోర్టు, కర్ణాటక హైకోర్టు ప్రకటించిన విషయాన్ని ధర్మాసనం ఈ సందర్భంగా గుర్తించింది. ముంబైలో ఉంటున్న భార్య, పిల్లలకు చాలినంత ఆస్తిని ఇచ్చానంటూ ఆ వీలునామాలో షీనా నాయిరి పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రస్తావించింది.

 వీలునామా కర్త తన ఆస్తిని ఇష్ట ప్రకారం ఎవరికైనా ఇచ్చే చట్టపరమైన హక్కును కలిగి ఉంటారు. అయితే, సహజ వారసులను పక్కన పెట్టడం వెనుక ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు లేనంత వరకు.. కేవలం వారసులను మినహాయించిన కారణంగానే వీలునామా చెల్లకుండా పోదని ధర్మాసనం పేర్కొంది. రెవెన్యూ రికార్డుల్లో మ్యుటేషన్‌ ఎంట్రీల్లో వారసుల పేర్లు ఉన్నప్పటికీ వారికి ఆస్తిపై ఎలాంటి యాజమాన్య హక్కులను కల్పించవని, అవి కేవలం పన్నుల వసూలు వంటి ఆర్థిక అవసరాల కోసమేనని ధర్మాసనం స్పష్టం చేసింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement