కుక్కను చూసుకుంటే నెలకు రూ.23లక్షలు!!
ఏంటి నమ్మశక్యంగా లేదా? కొన్ని విషయాలు అలాగే ఉంటాయ్ మరి. కానీ నమ్మాల్సిందే. ఓవైపు వీధికుక్కలు.. అవి పెడుతున్న పాట్లపై సుప్రీంకోర్టు కన్నెర్రజేస్తుంటే, మరోవైపు పెంపుడు శునకాలు కొందరికి కనకవర్షం కురిపిస్తున్నాయ్. వాటి ఆలనాపాలనా చూడటం ద్వారా బోలెడంత ఆదాయం సంపాదించిపెట్టే చాన్స్ ఇస్తున్నాయ్. కానీ ఇక్కడ కాదండోయ్.. అమెరికాలో ప్రస్తుతం అక్కడ ’డాగ్ నానీ’లకు డిమాండ్ మామూలుగా లేదు.
ధనిక కుటుంబాలకు చెందినవారు తమ పెంపుడు కుక్కలను చూసుకోవడానికి ప్రొఫెషనల్ కేర్‌టేకర్లను నియమించుకుంటున్నారు. ఇందుకోసం అధికమొత్తంలో జీతాలు కూడా చెల్లిస్తున్నారు. అమెరికాలో ఫుల్‌టైమ్ డాగ్ నానీలు నెలకు 10వేల డాలర్ల నుంచి రూ.24వేల డాలర్లకుపైగా (భారత కరెన్సీలో దాదాపు రూ.9.5 లక్షల నుంచి రూ.23 లక్షల వరకు) సంపాదిస్తున్నారు. అంటే ఏడాదికి గరిష్టంగా రూ.2.76 కోట్లు. వింటేనే బాప్‌రే అనిపిస్తోంది కదూ? – సాక్షి, సెంట్రల్ డెస్క్
ఎందుకు ఇంత డిమాండ్?
కరోనా లాక్‌డౌన్ సమయంలో చాలా మంది ఇంటి నుంచే పని చేయడం వల్ల.. తమ పెంపుడు జంతువులతో ఎక్కువ సమయం గడపడంతో వాటితో అనుబంధం పెరిగింది. ఫలితంగా పెంపుడు జంతువుల సంరక్షణను చాలా బాధ్యతగా మార్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో ధనిక కుటుంబాలు తమ కుక్కల కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించుకోవడం సాధారణమైంది. పెట్ కేర్ రంగం ఉత్తర అమెరికాలో వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం అక్కడ పెట్ సిట్టింగ్, జంతు సంరక్షణ సేవలకు సంబంధించి లక్షలాది ఉద్యోగాలు ఉన్నాయని మార్కెట్ అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పెద్ద నగరాల్లో పెంపుడు జంతువుల పెంపకం పెరుగుతున్న కొద్దీ ఈ ఉద్యోగాలకు డిమాండ్ కూడా పెరుగుతోంది.
డాగ్ నానీల బాధ్యతలేంటి?
డాగ్ నానీల పని కేవలం కుక్కను బయటకు తీసుకెళ్లడం మాత్రమే కాదు.. శారీరక దృఢత్వానికి తగిన వ్యాయామాలు చేయించడం, ప్రత్యేకంగా రూపొందించిన ఆహారాన్ని అందించడం, వాకింగ్ చేయించడం, గ్రూమింగ్ అపాయింట్‌మెంట్లు బుక్ చేయడం, మందులు ఇవ్వడం, యజమానులు విదేశీ ప్రయాణాలకు వెళ్లినప్పుడు వెంట తీసుకెళ్లడం, యజమానులు ఇంట్లో లేనప్పుడు కుక్కలు ఒంటరితనానికి గురికాకుండా 24 గంటలూ వాటిని కనిపెట్టుకుని ఉండటం వంటి బాధ్యతలు ఉంటాయి.
మరి అంత చెల్లిస్తున్నప్పుడు ఇంత చేయాల్సిందే కదా? అంత పెద్దమొత్తం ఇచ్చుకోలేని వారి పరిస్థితి ఏమిటి అంటే.. అలాంటి మధ్యతరగతి ప్రజల కోసం అమెరికాలో ’ది పెట్ నానీ’, ’ది పా నానీ’ వంటి ప్రొఫెషనల్ ఏజెన్సీలు అందుబాటులో ఉన్నాయి. ఇవి గంటల ప్రాతిపదికన లేదా రాత్రి సమయాల్లో కుక్కలను చూసుకోవడానికి నిపుణులను పంపుతాయి. అలాగే, ’రోవర్’, ’పెట్ బ్యాకర్’ వంటి మొబైల్ యాప్‌ల ద్వారా కూడా స్థానికంగా ఉండే డాగ్ సిట్టర్లను బుక్ చేసుకోవచ్చు.
ఎంత చదువు చదివితే ఇంత శాలరీ వస్తుంది.. ఇదేదో బాగుంది..అమెరికా పోదాం చలో అనుకునేవారు కాస్త ఆగాల్సిందే.. ఎందుకంటే, అమెరికాలో డాగ్ నానీగా స్థిరపడటం అంత సులువు కాదు. ‘నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ప్రొఫెషనల్ పెట్ సిట్టర్స్’ వంటి గుర్తింపు పొందిన సంస్థల నుంచి సర్టిఫికెట్లు పొందాల్సి ఉంటుంది. అలాగే పెంపుడు జంతువులకు ప్రథమ చికిత్స, వాటి హెల్త్ ఇన్సూరెన్స్ నిర్వహణ, క్లీన్ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ రికార్డులు ఉన్నవారికి మాత్రమే ఈ అవకాశం.


