సీఎంగా నేడే డీకేఎస్‌ ఎంపిక  | DK Shivakumar will take oath as the 25th Chief Minister of Karnataka | Sakshi
Sakshi News home page

సీఎంగా నేడే డీకేఎస్‌ ఎంపిక 

May 30 2026 4:16 AM | Updated on May 30 2026 4:16 AM

DK Shivakumar will take oath as the 25th Chief Minister of Karnataka

విధానసౌధలో సాయంత్రం 4 గంటలకు సీఎల్పీ భేటీ 

శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు  

కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌ ఖరారు  

సిద్ధరామయ్య రాజీనామాను ఆమోదించిన గవర్నర్‌ 

మంత్రివర్గంలో చోటు కోసం ఎమ్మెల్యేల యత్నాలు  

ఢిల్లీలో కాంగ్రెస్‌ అగ్రనేతలతో సిద్ధరామయ్య, డీకేఎస్‌ భేటీ  

కొత్త ప్రభుత్వ ఏర్పాటు, కేబినెట్‌ కూర్పుపై చర్చలు  

సోమవారం డీకేఎస్‌ ప్రమాణ స్వీకారం  

సాక్షి బెంగళూరు:   కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై పూర్తిస్థాయి స్పష్టత రావడంతో గందరగోళానికి తెరపడింది. సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయడంతో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ కర్ణాటక ప్రభుత్వ పగ్గాలు చేపట్టడం దాదాపుగా ఖరారైంది. ఇందుకు అవసరమైన ప్రక్రియను కాంగ్రెస్‌ పార్టీ ప్రారంభించింది. కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై కసరత్తు సాగుతోంది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ వేర్వేరుగా ఢిల్లీకి చేరుకున్నారు. 

మంత్రివర్గంలో తమ అనుచర వర్గానికి చోటు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. శనివారం సాయంత్రం 4 గంటలకు బెంగళూరు విధానసౌధలో ఆపద్ధర్మ  ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన కాంగ్రెస్‌ శాసనసభాపక్ష(సీఎల్పీ) సమావేశం జరగనుంది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతోపాటు కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్‌ సింగ్‌ సూర్జేవాలా తదితరులు పాల్గొంటారు. కాంగ్రెస్‌ అధిష్టానం సూచన మేరకు డీకే శివకుమార్‌ను సీఎల్పీ నేతగా ఎన్నుకోనున్నట్లు సమాచారం.    

ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు  
ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌ అభ్యర్థిత్వాన్ని కర్ణాటక కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి రణదీప్‌ సింగ్‌ సూర్జేవాలా ప్రతిపాదించనున్నారు. ఈ ప్రతిపాదనకు పార్టీ ఎమ్మెల్యేలు ఆమోదం తెలపాల్సి ఉంది. సీఎల్పీ నేతను ఎన్నుకున్న తర్వాత ఎమ్మెల్యేల మద్దతు లేఖను లోక్‌భవన్‌లో గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌కు అందజేస్తారు. 

కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని గవర్నర్‌కు తెలియజేస్తారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ గవర్నర్‌ ఆహ్వానిస్తే.. సోమవారం విధానసౌధ వద్ద కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ప్రమాణ స్వీకార శుభముహూర్తం కోసం ఆయన ఇప్పటికే జ్యోతిష్యులను  సంప్రదించినట్లు సమాచారం. సోమవారం మంచి ముహూర్తం ఉందని వారు సూచించినట్లు తెలిసింది. విధానసౌధ ఎదుట ప్రమాణ స్వీకారానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.   

ఢిల్లీలో సిద్ధరామయ్య, డీకేఎస్‌   
ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం సిద్ధరామయ్య ఢిల్లీకి చేరుకున్నారు. శుక్రవారం ఉదయం అగ్రనేతలు సోనియా గాం«దీ, రాహుల్‌ గాం«దీ, మల్లికార్జున ఖర్గేను కలుసుకొని ధన్యవాదాలు తెలియజేశారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గం కూర్పుపై సుమారు గంటకు పైగా చర్చించారు. అలాగే సిద్ధరామయ్య రాజకీయ భవిష్యత్తుపైనా చర్చ జరిగినట్లు తెలిసింది. జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిందిగా ఆయనను మరోసారి ఆహ్వానించినట్లు సమాచారం. 

ఈ సందర్భంగా సిద్ధరామయ్య వెంట ఆయన కుమారుడు యతీంద్ర, సీనియర్‌ మంత్రి కేజే జార్జ్‌ కూడా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఇప్పటివరకు తనకు అవకాశం కల్పించినందుకు, సహకరించినందుకు అధిష్టానం పెద్దలకు సిద్ధరామయ్య కృతజ్ఞతలు తెలిపారు. డీకే శివకుమార్‌ సైతం పార్టీ అగ్రనేతలను కలుసుకున్నారు. మంత్రివర్గంలో తన వర్గం ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరినట్లు తెలుస్తోంది.  
రాజీనామాకు గవర్నర్‌ ఆమోదం  

సిద్ధరామయ్య రాజీనామాకు గవర్నర్‌ గెహ్లాట్‌ శుక్రవారం ఉదయం ఆమోదం తెలిపారు. రాజీనామా తక్షణమే అమల్లోకి వస్తున్నట్లు గవర్నర్‌ ప్రకటించారు. ఈ మేరకు గెజిట్‌ విడుదల చేశారు. నూతన సీఎం ప్రమాణస్వీకారం చేసేదాకా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని సిద్దరామయ్యను గవర్నర్‌ కోరారు. శనివారం జరిగే సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలందరూ తప్పనిసరిగా పాల్గొనాలని కేపీసీసీ ఆదేశించింది. ఢిల్లీలో ఉన్న సిద్ధరామయ్య, డీకే శివకుమార్, రణదీప్‌ సింగ్‌ సూర్జేవాలా శుక్రవారం రాత్రి బెంగళూరుకు తిరిగి వచ్చారు.  

మంత్రి పదవుల కోసం లాబీయింగ్‌  
కొత్తగా ఏర్పడనున్న మంత్రివర్గంలో చోటు కోసం కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు లాబీయింగ్‌ ప్రారంభించారు. చాలామంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి చేరుకుని అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.  కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య  హైకమాండ్‌తో మంత్రివర్గ కూర్పుపై సంప్రదింపులు జరుపుతున్నారు. ఒకట్రెండు రోజుల్లో మంత్రుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. 

తమ సన్నిహిత ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కేలా సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ అధిష్టానం వద్ద పావులు కదుపుతున్నారు. తమ వర్గానికి అత్యధిక మంత్రి పదవులు దక్కించుకునేందుకు ఇరువురు నేతలు పోటీ పడుతున్నారు. ఈసారి మంత్రివర్గంలో కొత్తముఖాలకు ఎక్కువగా ప్రాధాన్యం దక్కుతుందని ఊహాగానాలు సాగుతున్న తరుణంలో సీనియర్‌ మంత్రులు, ముఖ్యంగా సిద్ధరామయ్య వర్గీయుల్లో టెన్షన్‌ పెరుగుతోంది. 40 మందికి పైగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మంత్రివర్గంలో చోటు కోసం ప్రయతి్నస్తున్నారు.  

సిద్ధరామయ్యపై డీకేఎస్‌ పొగడ్తల వర్షం  
డీకే శివకుమార్‌ ‘ఎక్స్‌’లో సిద్ధరామయ్యపై పొగడ్తల వర్షం కురిపించారు. ‘‘దేవుడు వరం ఇవ్వడు, శాపం కూడా ఇవ్వడు, అవకాశం మాత్రం ఇస్తాడు. ఆ అవకాశంతో ఏం సాధిస్తామనేది ముఖ్యం’’ అంటూ వేదాంత ధోరణిలో స్పందించారు. అవకాశాలను అందిపుచ్చుకుని విజయం సా«ధించిన వారిలో ముఖ్యుడు సిద్ధరామయ్య అని కొనియాడారు. మైసూరు జిల్లాలోని ఓ కుగ్రామంలో జన్మించి, పోరాటం ద్వారా రాజకీయాల్లోకి వచ్చి, సామాజిక న్యాయం అందిస్తూ, పేదల పెన్నిధిగా, కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య సేవలందించారని డీకే శివకుమార్‌ ప్రశంసించారు. కర్ణాటక రాజకీయ చరిత్రలో అత్యంత విజయవంతంగా, దీర్ఘకాలంగా ముఖ్యమంత్రిగా పనిచేసి సామాన్య ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్నారని ఉద్ఘాటించారు. నూతన మంత్రివర్గ ఏర్పాటుపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఢిల్లీలో డీకే శివకుమార్‌ తెలిపారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement