సౌదీ అరేబియాలో చిక్కుకున్న ఉత్తరప్రదేశ్ వాసి
తనను రక్షించాలంటూ భారత ప్రభుత్వానికి వినతి
న్యూఢిల్లీ: గల్ఫ్ కష్టాలకు అడ్డకట్ట పడడం లేదు. ఉపాధి కోసం వెళ్లిన భారతీయులు అక్కడి యజమానుల చేతుల్లో అష్టకష్టాలు పడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయా గ్‌రాజ్ (అలహాబాద్)కు చెందిన ఓ వ్యక్తి తన కన్నీటి గాథను వినిపించాడు. సౌదీ అరేబియాలో ఉండిపోయానని, తనను ఈ చెర నుంచి విడిపించి, ఎలాగైనా స్వదేశానికి చేర్చాలని, లేకపోతే చావుతప్ప మరో మార్గం లేదని కన్నీటితో వేడుకున్నాడు.
తన పాస్‌పోర్టు లాక్కున్నారని చెప్పాడు. తనను కాపాడాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరాడు. వీడియోలో అతడి వెనుక ఒంటె కనిపిస్తోంది. అతడి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఢిల్లీకి చెందిన ఓ న్యాయవాది ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టుచేశారు. బాధితుడిని రక్షించాలని విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్‌కు విన్నవించారు.
వీడియోలో బాధితుడు భోజ్‌పురి భాషలో మాట్లాడుతూ ఏం చెప్పాడంటే... ‘‘మా ఊరు అలహాబాద్ జిల్లాలోని హండియా. పని కోసం సౌదీ అరేబియాకు వచ్చా. నా పాస్‌పోర్టును యజమాని లాక్కున్నాడు. ఇంటికి తిరిగి వెళ్తానని చెబితే చంపేస్తానని బెదిరించాడు. నా తల్లిని చూడాలని ఉంది. ఈ వీడియోను మీరంతా షేర్ చేయండి. నా ఆవేదన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చేరాలన్నదే నా కోరిక. మీరంతా నాకు సహకరించండి. మీరు ముస్లిం అయినా, హిందూ అయినా ఎవరైనా సరే నాకు అండగా ఉండండి. దయచేసి నన్ను ఆదుకోండి. నాకు జీవితం ప్రసాదించండి. లేకపోతే మరణమే గతి’’ అని అభ్యర్థించాడు.
ఈ వ్యవహారంపై సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. బాధితుడి జాడ తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించింది. అతడికి సంబంధించిన వివరాలు అందుబాటులో లేకపోవడంతో ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకోవడం సాధ్యం కావడం లేదని పేర్కొంది. అయితే, బాధితుడి ఆవేదనను సౌదీ అరేబియా సెక్యూరిటీ డిపార్టుమెంట్ కొట్టిపారేసింది. అతడి ఆరోపణలకు ఆధారాల్లేవని తేల్చిచెప్పింది. సోషల్ మీడియాలో వీక్షణలు (వ్యూస్), తద్వారా ఆదాయం పెంచుకోవడానికి ఈ ఎత్తుగడ వేశారని అనుమానం వ్యక్తం చేసింది.
కఫాలా వ్యవస్థ రద్దయినా..
సౌదీ అరేబియాలో కఫాలా వ్యవస్థను రద్దు చేసిన తర్వాత కూడా భారతీయుడు యజమాని చెరలో చిక్కుకుపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆధునిక బానిసత్వంగా విమర్శలు ఎదుర్కొంటున్న కఫాలా వ్యవస్థను సౌదీ ప్రభుత్వం ఇటీవలే రద్దు చేసింది. విదేశీ కార్మికులు పాస్‌పోర్టు లాక్కోవడం, నిర్బంధించడం, వేధించడం నేరమే అవుతుంది. వలస కార్మికుల హక్కుల విషయంలో ఇదొక కీలకమైన సంస్కరణగా చెబుతున్నారు. సౌదీ అరేబియాలోని కార్మికుల్లో ఎక్కువ మంది భారతీయులే కావడం గమనార్హం.


