త్రివిధ దళాలకు డీఆర్‌డీఓ వ్యవస్థలు

Defence minister hands over 3 DRDO systems to chiefs of armed forces - Sakshi

న్యూఢిల్లీ: రక్షణ రంగ పరిశోధన సంస్థ డీఆర్‌డీఓ(డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌) అభివృద్ధి చేసిన మూడు భద్రత వ్యవస్థలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ శుక్రవారం త్రివిధ దళాల అధిపతులకు అందజేశారు. ఇండియన్‌ మారిటైమ్‌ సిచ్యువేషనల్‌ అవేర్‌నెస్‌ సిస్టమ్‌(ఇమ్‌సాస్‌)ను నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్‌ కరమ్‌బీర్‌ సింగ్‌కు, అస్త్ర ఎంకే –1 క్షిపణి వ్యవస్థను వైమానిక దళ చీఫ్‌ ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్‌కేఎస్‌ బధౌరియాకు, బోర్డర్‌ సర్వీలెన్స్‌ సిస్టమ్‌(బాస్‌)ను ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణెకు రాజ్‌నాథ్‌ అందజేశారని రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కార్యక్రమంలో రక్షణ శా ఖ సహాయ మంత్రి శ్రీపాద నాయక్, చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌ కూడా పాల్గొన్నారు.  

క్షిపణుల కంటే సెల్‌ ఫోన్లే శక్తివంతం
మారుతున్న కాలానికి అనుగుణంగా దేశ భద్రత విషయంలో కొత్త ముప్పు పొంచి ఉంటోందని, యుద్ధ రీతులు సైతం మారిపోతున్నాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. ఆయన శుక్రవారం చండీగఢ్‌లో జరిగిన మిలటరీ లిటరేచర్‌ ఫెస్టివల్‌లో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించారు. దేశాల మధ్య ఘర్షణల విషయంలో సోషల్‌ మీడియా అధిక ప్రభావం చూపుతోందని గుర్తుచేశారు. క్షిపణుల కంటే మొబైల్‌ ఫోన్ల పరిధే ఎక్కువ అని తెలిపారు. శత్రువు సరిహద్దు దాటకుండానే మరో దేశంలోని ప్రజలను చేరుకొనే సాంకేతికత వచ్చిందని, అందుకే ప్రతి ఒక్కరూ సైనికుడి పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top