కరోనా రోగుల కోసం బోట్‌ అంబులెన్స్‌ సేవలు

Dal Lake In Srinagar Gets Floating Ambulance Service To Aid Covid Patients - Sakshi

శ్రీనగర్‌: కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రముఖులు, సెలబ్రెటీలు, మల్టీనేషనల్‌ కంపెనీలు భారీ మొత్తంలో విరాళాలను ఇచ్చాయి. చాలామంది కరోనా బాధితులకు తమవంతు సహాయం చేస్తున్నారు. నిరుపేదలు కూడా సేవలో తామున్నామంటున్నారు. ఎంతో మంది మానవతా మూర్తులు పెద్ద మనస్సును చాటుకుంటున్నారు. కశ్మీర్‌లో  తారిక్ అహ్మద్ పట్లూ అనే యువకుడు తన పడవను అంబులెన్స్‌గా మార్చి దాల్ సరస్సులో సేవలందిస్తున్నాడు. అతడి సేవకు జనాలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో నివసించే తారిక్ అహ్మద్ పట్లూ అనే యువకుడు ఈమధ్యే కరోనా మహమ్మారి బారిన పడ్డాడు. తారిక్‌కు కరోనా వచ్చినప్పుడు అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఆ సమయంలో ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు. కోలుకున్నాక కూడా ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లేందుకు ఎవరూ పడవలోకి ఎక్కనివ్వలేదు. కారణం కరోనా భయం. కరోనా సెకండ్ వేవ్‌లో ప్రజలు పడుతున్న కష్టాలేంటో స్వయంగా అనుభవించాడు.  

అప్పట్లో తారిక్ పట్లూ… 20 రోజులు ఇంట్లో క్వారంటైన్ అయ్యాడు. అప్పుడప్పుడూ ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చేది… అయితే ఎవరు కూడా తనను పడవ ఎక్కనిచ్చేవారు కాదు. పడవ నడిపే తన తోటి వారే పడవలోకి  ఎక్కించుకోవడానికి భయపడటం చూసి… పట్లూ బాధపడేవాడు. కానీ వారికి ఓ కుటుంబం ఉంటుందని అర్థం చేసుకున్నాడు. దాంతో తనకున్న పడవను అంబులెన్సుగా మార్చేశాడు. దాల్ సరస్సులో పర్యాటకులను తిప్పి ఆ డబ్బులతో జీవించే తారిక్ తన పడవను అంబులెన్స్గా మార్చి సేవలందిస్తున్నాడు. కరోనా రోగులను తన పడవలో తీసుకెళ్తున్నాడు..అంతేకాకుండా వారికి ఏం కావాలో తెలుసుకుని మరీ సహాయం చేస్తున్నాడు. తన ఫోన్ నంబర్ ఇచ్చి ఏం సహాయం కావాలన్నా తన శక్తి మేరకు చేసి పెడతానని భరోసా కల్పిస్తున్నాడు.

తారిక్‌ రూపాయి రూపాయి కూడబెట్టాడు. కొంత అప్పు చేశాడు. అలా ఆయన పడిన కష్టానికి ఏప్రిల్‌లో ఓ రూపం వచ్చింది. దాల్ సరస్సులో తేలియాడే పడవ కాస్తా అంబులెన్స్‌గా మారిపోయింది. వాటర్ అంబులెన్స్ సిద్ధం అయ్యింది. ఈ పడవ అంబులెన్స్ లో పీపీఈ కిట్స్,  స్ట్రెచర్స్ ఉన్నాయి. వీల్ చైర్ కూడా ఉంది. దీంతో కరోనా రోగులను ఆస్పత్రులకు తీసుకెళ్లడం తేలికైంది. కాగా..శ్రీనగర్‌కి పర్యాటకులు పెద్ద సంఖ్యలో రావడంతో… అక్కడ కరోనా కేసులు పెరిగాయి. ఏప్రిల్ 25న శ్రీనగర్‌లోని తులిప్ గార్డెన్ తెరవడంతో కేసులు మరింత ఎక్కువయ్యాయి. ఆ రోజు 131 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటివరకు జమ్మూకశ్మీర్‌లో 2.29 లక్షల కరోనా కేసులు నమోదు కాగా.. 1.75 లక్షల మంది కోలుకున్నారు. 2,912 మంది మరణించారు.

(చదవండి: ఆనంద్‌ మహీంద్ర: ‘‘చాలా మంది పాత రోజులనే ఇష్టపడుతున్నారు’’)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top