భారతీయ నేలల్లో తగ్గుతున్న నైట్రోజన్, సేంద్రీయ కర్బన పాళ్లు
ఆందోళనకర అంశాలను బయటపెట్టిన అధ్యయనం
ఇప్పటికైనా తేరుకోకుండా ఆహార భద్రతకు పెనుముప్పు
న్యూఢిల్లీ: దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయి అని అభ్యుదయ కవి గురజాడ అప్పారావు తన రచనల ద్వారా ఉపదేశించారు. అయితే దేశంలో మనుషులను మాత్రమే పట్టించుకుంటే సరిపోదని, మట్టిని సైతం అందులోనూ సేద్యభూములనూ పట్టించుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని తాజా అధ్యయనం కొత్త ప్రమాద ఘంటికలు మోగించింది. మనుషులు బాగుండాలంటే వాళ్లు తినే ఆహారం పోషకాలతో సమృద్ధిగా ఉండాలి.
పోషకాలు సమపాళ్లలో ఉండాలంటే పంటలు పండించే నేలల్లో సహజ పోషకాలు తగు మోతాదులో ఉండాలి. అయితే అధిక దిగుబడి ఆశతో రైతన్నలు కోట్ల టన్నుల కొద్దీ కృత్రిమ రసాయనాలను పొలాల్లో వెదజల్లుతూ నేల సహజ సారానికి ఉరివేస్తున్నారని అధ్యయనం వెల్లడించింది.
భారతీయ నేలల్లో సహజ పోషకాలైన నైట్రోజన్, సేంద్రీయ కార్బన్‌ల మోతాదుకు చాలా తక్కువగా ఉందని ఢిల్లీ కేంద్రంగా పనిచేసే మేథో సంస్థ అయిన ‘ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరోన్మెంట్’ ప్రకటించింది. సంస్థ తన అధ్యయనంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అందించే ‘నేల ఆరోగ్య కార్డు’ల నుంచి సమాచారాన్ని సేకరించి, క్రోడీకరించి చేదు నిజాలను బహిర్గతంచేసింది. రాజస్థాన్‌లోని నీమ్లీ పట్టణంలోని అనిల్ అగర్వాల్ పర్యావరణ శిక్షణా కేంద్రంలో జరిగిన సుస్థిర ఆహార వ్యవస్థల జాతీయ సదస్సులో ‘సుస్థిర ఆహార వ్యవస్థలు: వాతావరణ మార్పుల వేళ అజెండా’’ పేరిట ఈ నివేదికను విడుదలచేశారు.
64% నేలల్లో తక్కువ నైట్రోజన్
దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లోని నేల శాంపిళ్లపై అధ్యయం చేయగా 64 శాతం శాంపిళ్లలో నైట్రోజన్ తగు మోతాదులో లేదని తేలింది. ఇక 48.5 శాతం శాంపిళ్లలో సేంద్రీయ కర్బనం తక్కువగా ఉందని అధ్యయనం కుండ బద్దలు కొట్టింది. భారత్‌లో 2023–24కాలంలో రైతులు ఏకంగా 601 లక్షల మెట్రిక్ టన్నుల కృత్రిమ ఎరువులను తమ సాగుభూముల్లో వినియోగించారు.
ఇన్ని కోట్ల టన్నుల ఎరువులు వాడినా సాగు నేలల్లో నైట్రోజన్ స్థాయిల్లో ఎలాంటి పెరుగుదల కన్పించలేదని అధ్యయనం ప్రకటించింది. నైట్రోజన్, సేంద్రీయ కర్బనం తగు మోతాదులో ఉంటేనే ఆ భూమిలో పంట బాగా పండుతుంది. వాతావరణ మార్పులను సైతం తట్టుకుంటూ పంట బలంగా ఎదుగుతుంది. అతిగా ఫెర్టిలైజర్లనూ వాడినా అది నేల ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో వైఫల్యాన్ని చవిచూస్తోందని అధ్యయనం విశ్లేషించింది.
‘‘కృత్రిమంగా నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం మిశ్రమ ఎరువులను ఉపయోగించినా ఎలాంటి ప్రయోజనం దక్కట్లేదు. ఈ పెడపోకడ ఇలాగే కొనసాగితే దీర్ఘకాలికంగా చూస్తే పంట దిగుబడి తగ్గిపోతుంది. అది దేశంలో ఆహార భద్రతను మరింత ప్రశ్నార్థకంగా మారుస్తుంది. నేలలో కర్బన ధాతువు తగ్గిపోతే వాతావరణ మార్పులను భవిష్యత్తులో ఎదుర్కోవడం మరింత కష్టమవుతుంది. ఆరోగ్యవంతమైన నేల మాత్రమే సేంద్రీయ కార్బన్‌ను తనలో పట్టి ఉంచగల్గుతుంది. అలాంటి అత్యవశ్యకమైన కార్బన్ నెమ్మదిగా భారతీయ నేలల్లో తగ్గిపోతోంది. ఏటా కనీసం 7 టెరాగ్రాముల కార్బన్ నేల నుంచి అదృశ్యమవుతోంది’’ అని అధ్యయనం ఆందోళన వ్యక్తంచేసింది.
అక్కరకొస్తున్న సాయిల్ హెల్త్ కార్డ్
పదేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం నేల ఆరోగ్య కార్డ్(ఎస్‌హెచ్‌సీ) పథకాన్ని ప్రారంభించింది. సుస్థిర వ్యవసాయ జాతీయ కార్యక్రమంలో భాగంగా ఈ పథకాన్ని తీసుకొచ్చారు. రైతన్నల సాగులో ఉన్న భూమి నుంచి కొంత మట్టిని సేకరించి అందులో 12 రకాల రసాయనాలు ఉన్నాయో లేదో, ఎంత పాళ్లలో ఉన్నాయో లెక్కించి ఎస్‌హెచ్‌సీని ఇస్తారు. గత రెండేళ్లలో దాదాపు 1.3 కోట్ల నేల శాంపిళ్లను ఇలా ల్యాబ్‌లో పరీక్షించి ఏఏ ప్రాంతాల్లో సాగునేలల స్వభావం, ఆరోగ్యం ఎలా ఉందో లెక్కించారు.
మరింత కృషి జరగాలి..
భూసార పరీక్షలు చేసి భూ ఆరోగ్యకార్డ్‌ల జారీతో ప్రభుత్వాలు చేతులు దులిపేసుకుంటే పరిస్థితిలో ఎలాంటి మార్పు రాదని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎని్వరోన్మెంట్(సీఎస్‌ఈ)లోని ఆహార వ్యవస్థల కార్యక్రమ డైరెక్టర్ అమిత్ ఖురానా వ్యాఖ్యానించారు. ‘‘ ఆయా సాగు భూముల్లో సహాజ ధాతువులు పెరిగేలా కృషి చేయాలి. రైతులు సైతం తమ వంతుగా సేంద్రీయ ఎరువుల వాడకాన్ని పెంచాలి. అప్పుడు నేల ఆరోగ్యం బాగుంటుంది. అధిక కృత్రిమ ఎరువులతో నేల నిస్సారంగా తయారవుతుంది. ప్రభుత్వాలు కేవలం నేల ల సామర్థ్యాన్ని గణించి కార్డ్‌లు జారీచేస్తే సరిపోదు.
ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్‌ఏఓ) వంటి అంతర్జాతీయ సంస్థల గ్లోబల్ సాయిల్ ల్యాబోరేటరీ నెట్‌వర్క్‌లతో సమన్వయంతో కలిసి పనిచేయాలి. వాళ్ల సూచనలు, సలహాలను అమలుచేయాలి’’ అని ఖురానా సూచించారు. ‘‘ భారత్‌లో 14 కోట్ల వ్యవసాయ కుటుంబాలు ఉంటే ఇప్పటిదాకా కేవలం 1.1 కోట్ల భూ కార్డ్‌ల పరీక్ష పూర్తయింది. పరీక్షలకు, ఆచరణకు మధ్య ఉన్న అగాథాలను పూడ్చాలి’’ అని ఆఘాఖాన్ ఫౌండేషన్‌లో వ్యవసాయ, ఆహార భద్రత, వాతావరణ మార్పుల విభాగ అంతర్జాతీయ సారథి అపూర్వ ఓజా సూచించారు.
కార్బన్ లోపాలకు బయోచార్‌తో చెక్
పంట వ్యర్థాలు, కొయ్య వంటి సేంద్రీయ పదార్థాలను ఆక్సిజన్ తక్కువగా ఉండే వాతావరణంలో మండించడం(పైరోలైసిస్) ద్వారా ఉత్పన్నమయ్యే జీవ బొగ్గునే బయోచార్ అంటారు. అది బొగ్గు పులుసు వాయువును నేలలోనే బంధిస్తుంది. ఈ కట్టె బొగ్గు నేల సారాన్నీ, పంట దిగుబడినీ పెంచుతుంది. పొలంలో, పల్లెల్లో ఉత్పన్నమయ్యే పంట వ్యర్థాలను, కలప ముక్కలను అక్కడికక్కడే బయోచార్‌గా మార్చి నేలలో నిక్షిప్తం చేస్తే ఆయా సాగు భూముల్లో కార్బన్ స్థాయిలు మెరుగవుతాయి. అయితే భారత్‌లో సరైన ప్రమాణాల మేరకు బయోచార్‌ను ఉత్పత్తిచేసే పరిస్థితులు లేవు. పైగా సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ పథకాలు తెస్తున్నప్పటికీ ఆ పథకాల పరిధిలో ఉన్న సాగు భూముల విస్తీర్ణం సైతం చాలా తక్కువగా ఉంది. బయోచార్ వినియోగం, సేంద్రీయ వ్యవసాయం ద్వారా మాత్రమే కర్బనపాళ్లను పెంచి నేల ఆరోగ్యాన్ని కాపాడవచ్చని, తద్వారా భారతీయులను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దవచ్చని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరోన్మెంట్ సదస్సు అభిప్రాయపడింది.


