భారత ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌ ప్రమాణం | CP Radhakrishnan Take Oath As Vice President Of India | Sakshi
Sakshi News home page

భారత ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌ ప్రమాణం

Sep 12 2025 10:12 AM | Updated on Sep 12 2025 10:39 AM

CP Radhakrishnan Take Oath As Vice President Of India

సాక్షి, న్యూఢిల్లీ: భారత దేశపు 15వ ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌ ప్రమాణం చేశారు. శుక్రవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతోపాటు, కేంద్ర మంత్రులు పలువురు ఎన్డీయే కూటమి సీఎంలు, మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధానులు, జగ్దీప్‌ ధన్‌ఖడ్‌ సహా మాజీ ఉపరాష్ట్రపతులూ పాల్గొన్నారు.

ఉప రాష్ట్రపతి ఎన్నికకు ఈ నెల 9న జరిగిన పోలింగ్‌లో ఎన్డీయే కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌ తన సమీప ప్రత్యర్థి జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డిపై 152 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఎన్నిక లాంఛనాలన్నీ పూర్తి కావడంతో గురువారం మహారాష్ట్ర గవర్నర్‌ పదవికి సీపీ రాధాకృష్ణన్‌ రాజీనామా చేశారు. ఓటమి తర్వాత జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి రాధాకృష్ణన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

సీపీ రాధాకృష్ణన్‌ పూర్తి పేరు చంద్రపురం పొన్ను స్వామి రాధాకృష్ణన్‌. 1957 అక్టోబరు 20న తమిళనాడులోని తిరుప్పూర్‌లో ఆయన జన్మించారు. కాంగ్రెస్‌ సానుభూతిపరులైన వ్యవసాయ కుటుంబంలో ఈయన జన్మించారు. పదహారో ఏట నుంచి ఆర్‌ఎస్‌ఎస్, జన్‌సంఘ్‌లతో కలిసి పనిచేశారు. సామాజికంగా, ఆర్థికంగా బలమైన కొంగు వెల్లాలర్‌ (గౌండర్‌) సామాజికవర్గం నుంచి వచ్చిన ఆయన బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ చేశారు. 1998 లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులోని కోయంబత్తూరు స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా 1.5 లక్షల ఆధిక్యంతో విజయం సాధించారు. 1999 ఎన్నికల్లో అక్కడినుంచే నెగ్గారు. వాజ్‌పేయీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే 2000లో రాధాకృష్ణన్‌ కేంద్రమంత్రి కావాల్సి ఉంది. మరో సీనియర్‌ నేత పొన్‌ రాధాకృష్ణన్‌ అప్పట్లో ఆ అవకాశాన్ని చేజిక్కించుకున్నారు. ఇద్దరి పేర్లూ ఒకటే కావడంతో అలాంటి పొరపాటు జరిగిందని చెబుతారు. 

ఇక.. 1996లో తమిళనాడు బీజేపీ కార్యదర్శిగా పనిచేశారు. 2004 నుంచి 2007 వరకు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2014, 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. అయినప్పటికీ పార్టీలో ‘తమిళనాడు మోదీ’గా ఈయన పేరుపొందారు. ఆపై.. రాధాకృష్ణన్‌ 2023 ఫిబ్రవరి 12న జార్ఖండ్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు. కొన్నాళ్లు తెలంగాణ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టారు. 2024 జులై 27 నుంచి మహారాష్ట్ర గవర్నర్‌గా ఉండి.. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో నెగ్గడంతో ఆ హోదాకు రాజీనామా చేశారు. సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆర్‌.వెంకటరామన్‌ల తర్వాత తమిళనాడు నుంచి ఉపరాష్ట్రపతి పీఠాన్ని అధిరోహించిన మూడోవ్యక్తిగా, దక్షిణాది నుంచి ఏడో వ్యక్తిగా రికార్డులకెక్కారు.  ఉపరాష్ట్రపతిగా ఆయన పదవీకాలం 2030 వరకు ఉంటుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement