కొనేలా ఇన్‌ఫ్లుయెన్స్‌ చేస్తున్నారు | Content creators influencing retail | Sakshi
Sakshi News home page

కొనేలా ఇన్‌ఫ్లుయెన్స్‌ చేస్తున్నారు

Apr 16 2026 4:40 AM | Updated on Apr 16 2026 4:41 AM

Content creators influencing retail

రిటైల్‌ను ప్రభావితం చేస్తున్న కంటెంట్‌ క్రియేటర్లు 

లైవ్‌ డెమో, రివ్యూలతో కొత్త ఉత్పత్తుల పరిచయం

భారత్‌లో లైవ్‌ కామర్స్‌ 100 కోట్ల డాలర్లకు చేరిక 

సాక్షి, స్పెషల్‌ డెస్క్‌  :  తమ కంటెంట్‌ ద్వారా జనం మదిలో స్థానం సంపాదించుకుంటున్న క్రియేటర్లు.. ఇప్పుడు రిటైల్‌ రంగంలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నారు. ఎంతలా అంటే.. వారు సూచించిన ఉత్పత్తులను జనం కొనుగోలు చేసేంతగా. ఇంకేముంది.. వాణిజ్యానికి ఒక ప్రధాన ఇంజన్‌గా క్రియేటర్లు అవతరించారు. గత ఐదేళ్లలో కంటెంట్‌ క్రియేటర్ల సంఖ్య నాలుగు రెట్లు పెరిగిందంటే ప్రజలకు ఉన్న ఆసక్తిని, పెరుగుతున్న వారి ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చు. క్రియేటర్లు సృజనాత్మక కంటెంట్‌ ద్వారా విభిన్న ఉత్పత్తులను పరిచయం చేస్తున్నారు. 

లైవ్‌ డెమోలు, సమీక్షలు, సలహాలు ఇస్తూ వినియోగదారులకు వాటిని చేరుస్తున్నారు. వస్తువు ఎలా పనిచేస్తుందో ప్రత్యక్షంగా చూపించడం వల్ల వినియోగదారులకు కొనుగోలుపై గట్టి నమ్మకం కలుగుతుంది. ఫ్యాషన్, టెక్నాలజీ, సౌందర్య ఉత్పత్తుల వంటి విభాగాల్లో నిపుణులైన క్రియేటర్లు ఇచ్చే సలహాలు కస్టమర్లకు సరైన వస్తువును ఎంచుకోవడంలో సహాయపడుతున్నాయి. డెలాయిట్‌–గూగుల్‌ నివేదిక ప్రకారం 2030 నాటికి భారత ఈ–కామర్స్‌ రంగానికి క్రియేటర్ల నేతృత్వంలోని వాణిజ్యం 25 బిలియన్‌ డాలర్లను జోడించనుంది.  

క్రియేటర్ల సంఖ్య..  
2020:     9–10 లక్షలు 
2025:     35–45 లక్షలు

48 కోట్లు – ఆన్‌లైన్‌ వీడియోలు, కంటెంట్‌ చూసేవారు. 
33 కోట్లు – వీడియోలు చూస్తారు. కానీ ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేయరు. 
18 కోట్లు– ఆన్‌లైన్‌లో వస్తువులను కొనుగోలు చేసేవారు.

భారత లైవ్‌ కామర్స్‌.. 
ప్రస్తుత వ్యాపారం:  సుమారు 100 కోట్ల డాలర్లు
2030 నాటికి అంచనాలు: తక్కువలో తక్కువగా 500 కోట్ల డాలర్లు. 
సాధారణంగా: 700–800 కోట్ల డాలర్లు. 
గరిష్టంగా: వెయ్యి–1,200 కోట్ల డాలర్లు. 

వినియోగదారుల ధోరణి  
28% – క్రియేటర్ల ద్వారా కొత్త ఉత్పత్తులను తెలుసుకుంటున్నారు. 
63% – వస్తువుల సమాచారం, సిఫార్సుల కోసం ఇన్‌ఫ్లుయెన్సర్లను నమ్ముతున్నారు. 
68% – లైవ్‌ షాపింగ్‌ ఆస్వాదించడానికి సిద్ధపడుతున్నారు.

» క్రియేటర్ల ప్రభావంతో ఐదేళ్లలో ద్వితీయశ్రేణి నగరాలు, చిన్న పట్టణాల నుంచి 5–6 కోట్ల మంది ఆన్‌లైన్‌ షాపింగ్‌ వైపు మొగ్గు చూపుతారని అంచనా.  

»   సంప్రదాయ ప్రకటనల కంటే తమకు ఇష్టమైన ్రక్రియేటర్ల సిఫార్సులను వినియోగ దారులు 2.5 రెట్లు ఎక్కువగా నమ్ముతున్నారు. 2030 నాటికి ప్రతి 10 ఆన్‌లైన్‌ కొనుగోళ్లలో ఒకటి నేరుగా క్రియేటర్ల స్టోర్‌ ఫ్రంట్స్‌ ద్వారానే జరుగుతుంది.
»  2030 నాటికి లైవ్‌ కామర్స్‌ 800 కోట్ల డాలర్ల మార్కెట్‌గా ఎదుగుతుంది. 
»  కోట్లకొద్దీ ఫాలోవర్లు ఉన్నవారి కంటే తక్కువ మంది ఉన్నా పటిష్టమైన అనుబంధం ఉన్న క్రియేటర్ల ద్వారా అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయి.  
»  పెద్ద కంపెనీలు మార్కెటింగ్‌ బడ్జెట్‌లో 20–30% ఇన్‌ఫ్లుయెన్సర్లకే కేటాయిస్తున్నాయి.

టాప్‌ కేటగిరీలు..
ఫ్యాషన్, లైఫ్‌స్టైల్‌: ‘గెట్‌ రెడీ విత్‌ మీ’వీడియోలు, ‘ఫ్యాషన్‌ హాల్స్‌’ద్వారా ప్రజలు కొత్త ట్రెండ్స్‌ను అనుసరిస్తున్నారు. ఈ కేటగిరీలో 25–30% ఆన్‌లైన్‌ అమ్మకాలు నేరుగా క్రియేటర్ల సిఫార్సుల వల్లే జరుగుతున్నాయి. 

బ్యూటీ, పర్సనల్‌ కేర్‌: మేకప్‌ ట్యుటోరియల్స్, స్కిన్‌ కేర్‌ రివ్యూలకు డిమాండ్‌ ఉంది. క్రియేటర్లు తమ ముఖంపై ఉత్పత్తులను వాడి చూపే లైవ్‌ డెమోలను వినియోగదారులు 3 రెట్లు ఎక్కువగా నమ్ముతున్నారు. 

ఎల్రక్టానిక్స్, గ్యాడ్జెట్స్‌: 70%పైగా భారతీయులు యూట్యూబ్‌లో అన్‌బాక్సింగ్, రివ్యూ వీడియోలను వీక్షిస్తున్నారు. టెక్‌ క్రియేటర్లు ఇచ్చే బడ్జెట్‌ గైడెన్స్‌ వల్ల చిన్న పట్టణాల్లో ఎల్రక్టానిక్స్‌ అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. 

ఆరోగ్యం, ఫిట్‌నెస్‌: ఇంట్లో వ్యాయామం, డైట్‌ ప్లాన్స్, మానసిక ఆరోగ్యంపై అవగాహన పెరిగింది.  

ఫుడ్, కుకింగ్‌: ప్రాంతీయ భాషల్లో వంటల వీడియోలకు కోట్లకొద్దీ వ్యూస్‌ వస్తున్నాయి. కిచెన్‌ అప్లయెన్సెస్, మసాలా బ్రాండ్లు ఈ క్రియేటర్లపై భారీగా పెట్టుబడి పెడుతున్నాయి

Advertisement
 
Advertisement
Advertisement