డీఎంకేతో కటీఫ్‌.. విజయ్‌కు మద్దతు | Congress Break Up Stalin DMK Alliance With Vijay | Sakshi
Sakshi News home page

డీఎంకేతో కటీఫ్‌.. విజయ్‌కు మద్దతు

May 6 2026 1:03 PM | Updated on May 6 2026 1:41 PM

Congress Break Up Stalin DMK Alliance With Vijay

తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠకు తెర పడింది. ప్రభుత్వ ఏర్పాటులో విజయ్‌ టీవీకే పార్టీకి షరతులతో కూడిన మద్దతు ఇస్తున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. అంతేకాదు.. ఇకపై జరిగే అన్ని ఎన్నికల్లోనూ టీవీకే కలిసి పోటీ చేయాలని నిర్ణయించింది. దీంతో డీఎంకే కూటమికి గుడ్‌బై చెప్పినట్లైంది. 

తమిళనాట ప్రభుత్వ ఏర్పాటులో హైడ్రామా ఇంకా కొనసాగుతోంది. విజయ్‌ పార్టీకి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్‌ తొలి నుంచి భావిస్తోంది. అయితే డీఎంకే మాత్రం అందుకు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ క్రమంలో స్టాలిన్‌ నేతృత్వంలో నిన్న జరిగిన కూటమి మీటింగ్‌కు కాంగ్రెస్‌ తరఫు ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. బదులుగా.. టీవీకే నేత సెంగొట్టియాన్‌తో ఓ హోటల్‌లో సమావేశమై జట్టు గురించి చర్చలు జరిపారు. ఈ పరిణామం డీఎంకేకు మంట పుట్టించింది. 

కాంగ్రెస్‌ ఐదు స్థానాలు నెగ్గిందే స్టాలిన్‌ వల్ల అని.. టీవీకేతో వెళ్లడం వెన్నుపోటు కిందకే వస్తుందని మండిపడింది. తమిళనాడు కాంగ్రెస్‌ నేతలు ఈ విషయంలో రాహుల్‌ గాంధీని తప్పు పట్టిస్తున్నారని ఆరోపించింది. అయితే దీనికి కాంగ్రెస్‌ నేతలు వరుసగా కౌంటర్లు ఇచ్చారు. విజయ్‌ టీవీకేకు మద్దతు ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. మాణిక్యం ఠాగూర్‌ ఈ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. 

‘‘ఎన్నికల కోసమే డీఎంకేతో పొత్తు పెట్టుకున్నాం. ఎన్నికలు ముగిశాయి.. ప్రజలు తీర్పు ఇచ్చారు. ప్రజల తీర్పు వైపు మేముంటే తప్పేంటి? అని అన్నారాయన. ఈ ‍క్రమంలో తమిళనాడులో ఆరెస్సెస్‌, బీజేపీని అడుగు పెట్టనివ్వమని చెప్పారు. మరోవైపు.. 

కార్తీ చిదంబరం మాట్లాడుతూ.. టీవీకేకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. పార్టీలో అంతర్గత చర్చల తర్వాతే నిర్ణయం ప్రకటించాం. సెక్యూలర్‌ కూటమిని ఏర్పాటు చేయాలన్న విజయ్‌ లక్ష్యం సరైందని కాంగ్రెస్‌ భావిస్తోంది. విజయ్‌ చేస్తున్న ప్రయత్నాలు త్వరలోనే మంచి ఫలితాలిస్తాయి అని అన్నారు.

ఇంకోవైపు డీఎంకే కూటమికి కొత్తగా నెగ్గిన ఎమ్మెల్యే రాజేష్‌కుమార్‌ చురకలంటించారు. ఎన్నికల తర్వాత పార్టీలు కలవడం సాధారణ విషయం. కూటమిలో భాగంగానే మేం పోటీ చేశాం.. స్టాలిన్‌ ఫేస్‌తో ఏం గెలవలేదు. తమిళ ప్రజలు మాత్రం టీవీకే విజయ్‌ వైపు ఉన్నారు. ప్రజలు ఎటుంటే అటు ఉండడం తప్పమీ కాదు కదా అని అన్నారు. 

ఇండియా కూటమికి బీటలు
తమిళనాడు ఎన్నికల టైంలోనే సీట్ల పంపకాల విషయంలో డీఎంకే, కాంగ్రెస్‌ మధ్య విబేధాలు బయటపడ్డాయి. ఆ సమయంలో ఇండియా కూటమి పేరుతో కాకుండా సెక్యులర్‌ ప్రొగ్రెసివ్‌ అలయన్స్‌ పేరుతో ఎన్నికలకు వెళ్లారు. అయితే కేవలం 28 సీట్లు కేటాయించడంపై కాంగ్రెస్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చింది. తాజా పరిణామంతో తమిళనాడులో డీఎంకేతో దోస్తీకి కాంగ్రెస్‌ గుడ్‌బై చెప్పింది. దీంతో.. డీఎంకే నేరుగా రాహుల్‌ గాంధీని టార్గెట్‌ చేస్తూ విమర్శలకు దిగింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement