సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ప్రశ్న
తమకు టీ ఇచ్చే వ్యక్తిని సైతం పోలీసులు ప్రశ్నించారని ఆరోపణ
జంతర్‌మంతర్ వద్ద 10వ రోజుకు చేరిన సీజేపీ నిరసన
రెండో రోజుకు చేరుకున్న వాంగ్‌చుక్ నిరాహార దీక్ష
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఢిల్లీ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 10 రోజులుగా నిరసన సాగిస్తున్న తమకు పోలీసులు కనీస సౌకర్యాలను కూడా అందనివ్వడం లేదని ఆరోపించారు. తమకు టీ అందజేస్తున్న అనికేత్ పటేల్ అనే వ్యక్తిని సైతం ఢిల్లీ పోలీసులు ప్రశ్నించారన్నారు.
నిరసనకారులకు ఆహారం, దుస్తులు తీసుకువచ్చే వారినీ వదిలిపెట్టడం లేదని దీప్కే చెప్పారు. అనికేత్ పటేల్ ఆహ్వానం మేరకు అతడి టీ దుకాణం వద్దకు, అతడి ఇంటికి వెళ్లినట్లు చెప్పారు. టీ దుకాణం పెట్టుకోవడమూ నేరమేనా అంటూ పోలీసులను ప్రశ్నించారు. మంగళవారం ఉదయం 11.30 గంటలకు నిరసన వేదిక వద్ద బందోబస్తు విధుల్లో ఉండే పోలీసులకు తాను గులాబీలు, టీ అందజేస్తానన్నారు.
శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యతలను నిర్వర్తించాలని వారిని కోరుతానని చెప్పారు. ఇదే వేదికపై నిరాహార దీక్ష చేపట్టిన సోనమ్ వాంగ్‌చుక్ కోసం పోర్టబుల్ టాయిలెట్ సౌకర్యం కల్పించాలని ఆదివారం రాత్రి నిరసన చేపట్టినట్లు వెల్లడించారు.
జంతర్ మంతర్‌లోని పబ్లిక్ టాయిలెట్లకు నీటి సౌకర్యం లేదని చెప్పారు. పరీక్షపత్రాల లీకేజీలకు కేంద్రమే బాధ్యత వహించాలనే డిమాండ్‌తో ఆదివారం పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించడం తెల్సిందే. సీజేపీ నేతృత్వంలో ఇదే డిమాండ్‌తో జూన్ 20వ తేదీన దీప్కే సారథ్యంలో ఆందోళనలు మొదలయ్యాయి.
ప్రజాస్వామ్య ఉద్యమానికి మచ్చు తునక
ఈ సందర్భంగా సోనమ్ వాంగ్‌చుక్ మాట్లాడుతూ..జంతర్‌మంతర్‌లో విద్యార్థులు, వలంటీర్లు శాంతియుతంగా కొనసాగిస్తున్న నిరసన ప్రజాస్వామ్య తరహా ఉద్యమానికి ఓ ఉదాహరణ అని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో తమ వంతుగా భాగస్వాములయ్యారని చెప్పారు. పెద్ద సంఖ్యలో ముందుకు వస్తున్న వలంటీర్లు, సహకరిస్తున్న పోలీసులకు వాంగ్‌చుక్ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ నిరసన కార్యక్రమంలో దేశ వ్యతిరేక అంశమేదీ లేదని చెప్పారు. వీరంతా ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మాత్రమే కోరుతున్నారని వివరించారు. ‘మీరు ఇలాగే మొండిగా వ్యవహరిస్తూ పోతే నష్టపోయేదీ మీరే. ప్రజలకు మీపై నమ్మకం పోతుంది. ఆ తర్వాత వారు మిమ్మల్ని తిరస్కరిస్తారు. ప్రజల బాధను మీరు అర్థం చేసుకున్నప్పుడే మిమ్మల్ని అంగీకరిస్తారు’అంటూ వాంగ్‌చుక్ వ్యాఖ్యానించారు.
నీక్ పరీక్ష పత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్(ఏఐఎస్‌ఏ)కి చెందిన ఆరుగురు విద్యార్థి నేతలు ఇక్కడే మరో వేదికపై ఆదివారం నుంచి నిరాహార దీక్ష ప్రారంభించారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, బృందా కారత్, సీపీఐ నేత డి.రాజా నిరసన చేపట్టిన విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు.


