సాక్షి,చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో కొత్త తరం నాయకుల యుగం ప్రారంభమైంది. సినీ నటుడు విజయ్ తొలిసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఆయనకు రాజకీయ అనుభవం లేకపోయినా ప్రజల మద్దతుతో సీఎం కుర్చీని అధిరోహించారు. తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్, ప్రధాన ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. స్టాలిన్ ఎన్నికల్లో ఓడిపోవడంతో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ వ్యవహరించనున్నారు. తొలుత సీఎం విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం చెపాక్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఉదయనిధి స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేశారు. అయిదేళ్ళ క్రితం వరకూ చూస్తే సీఎంగా స్టాలిన్ ఉంటే ప్రధాన ప్రతిపక్ష నేతగా పళని స్వామి వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే ఈసారి ఆ చాన్స్ పళనిస్వామికి లేకుండా పోయింది.
ఎన్నికల్లో ఓడిపోయిన స్టాలిన్ స్థానంలో ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించారు. 74 సీట్లు గెలుచుకున్న డీఎంకే కూటమికి ఆయన నాయకత్వం వహించనున్నారు. ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు అదనపు బలం. విజయ్ 52 ఏళ్ల వయసులో సీఎం అయ్యారు. ఉదయనిధి 49 ఏళ్ల వయసులోనే ప్రతిపక్ష నేతగా అవతరించారు. ఇద్దరూ యువకులే కావడంతో తమిళనాడు రాజకీయాల్లో కొత్త తరాన్ని ప్రజలు చూడబోతున్నారు.
కాగా ఉదయనిధి పలు సినిమాలకు నిర్మాతగా, హీరోగా సినీ రంగంలో గుర్తింపు పొందారు. 2008లో ఆయన నిర్మించిన 'కురువి' చిత్రంలో విజయ్ హీరోగా నటించారు. ఆ చిత్రంలో త్రిష కథానాయిక. ఆ రకంగా విజయ్, ఉదయనిధి మధ్య రెండు దశాబ్దాల క్రితమే స్నేహం ఉంది. 
అయితే ఇప్పుడు ఆ స్నేహం రాజకీయ వేదికపై ప్రత్యర్థిత్వంగా మారింది. అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం సమయంలో ఇద్దరి మధ్య విభేదాలు స్పష్టంగా కనిపించాయి. విజయ్ ప్రమాణం చేస్తున్నప్పుడు ఉదయనిధి ఆయన వైపు చూడలేదు. కానీ ఉదయనిధి ప్రమాణం చేస్తుండగా విజయ్ మాత్రం ఆయనను చూసి ఓ చిరునవ్వు నవ్వారు.
విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, విజయ్‌కు రాజకీయ అనుభవం లేకపోవడం ఒక సవాల్‌గా మారవచ్చు. కానీ ఉదయనిధి ఇప్పటికే ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవంతో ప్రతిపక్షాన్ని బలంగా నడిపే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇకపై అసెంబ్లీలో సీఎం విజయ్, ప్రతిపక్ష నేత ఉదయనిధి మధ్య ఢీ తప్పదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.


