బ్లాక్ అండ్ వైట్ సూట్ అందుకే: ఎం విజ‌య్‌ | CM Vijay finally explains why he keeps wearing black and white suit | Sakshi
Sakshi News home page

అందుకే బ్లాక్ అండ్ వైట్ సూట్ వేసుకుంటున్నా: సీఎం విజ‌య్‌

Jun 2 2026 7:37 PM | Updated on Jun 2 2026 8:06 PM

CM Vijay finally explains why he keeps wearing black and white suit

తిరుచ్చి: తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన‌ప్ప‌టి నుంచి నలుపు-తెలుపు సూట్‌లోనే క‌న‌బ‌డుతున్నారు జోస‌ఫ్ విజ‌య్‌. ఇంత‌కుముందు ముఖ్య‌మంత్రులుగా ప‌నిచేసిన వారి వ‌స్త్ర‌ధార‌ణ‌కు భిన్నంగా మోడ్ర‌న్‌గా క‌నిపించ‌డంతో జ‌న‌మంతా ఆస‌క్తిక‌రంగా ఆయ‌న‌ను గ‌మ‌నిస్తున్నారు. సీఎం విజ‌య్ వ‌స్త్ర‌ధార‌ణ‌పై సోష‌ల్ మీడియాలో చాలా చ‌ర్చ‌లు జ‌రిగాయి. కొంత‌మంది నాయ‌కులు విజ‌య్ వ‌స్త్ర‌ధార‌ణ‌పై విమ‌ర్శ‌లు కూడా చేశారు. తన వస్త్రధారణపై వస్తున్న విమర్శలకు సీఎం విజయ్‌ తనదైన శైలిలో కౌంటర్‌ ఇచ్చారు.

తిరుచ్చి సభలో ఆయ‌న మాట్లాడుతూ.. ‘నేను కోట్‌ సూట్‌ వేసుకోవడం పైనా కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎందుకు, మనం సూటుకోటు వేసుకోకూడదా? కేవలం అణచివేసే శక్తులు, అధికారం చెలాయించే వారే సూటుకోటు వేసుకోవాలా? అయినా నేనేమైనా రంగురంగుల సూట్లు వేసుకుంటున్నానా? నా మనసు లాగే కేవలం రెండు రంగులు.. నలుపు, తెలుపు మాత్రమే ధరిస్తున్నాను. నన్ను ట్రోల్‌ చేసేవారికి ఒకటే విన్నపం.. దయచేసి మీ విమర్శలు ఆపకండి. అవే నాకు మరింత శక్తినిస్తాయి. మీరు విమర్శలు చేస్తూనే ఉండండి, నేను ప్రజలకు మంచి చేస్తూనే ఉంటాను’ అని వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నాయకుల విమ‌ర్శ‌లు త‌న ఎదుగుల‌కు దోహ‌ద‌ప‌డ‌తాయ‌న్నారు.

ఇప్పుడు వార్తలు చూస్తున్నారు
ఇదివరకు కాల‌క్షేపం కోసం సోషల్‌ మీడియాలో ‘రీల్స్‌’ చూసే జెనరేషన్ తమ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత‌ న్యూస్‌ ఛానళ్లు చూస్తోంద‌ని విజ‌య్ అన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ‘జెన్‌–జీ’ ఆస‌క్తి క‌న‌బ‌రుస్తోంద‌న్నారు. వారి కోసం ప్ర‌తిప‌క్షాలు త‌మ ప్రెస్‌నోట్‌ల‌ను తమిళం, ఇంగ్లీష్ భాష‌ల్లో ఇస్తున్నాయ‌ని తెలిపారు.  ఇప్పుడు ప్రజల్లో మార్పు స్ప‌ష్టంగా క‌న‌బ‌డుతోంద‌ని, వారిని త‌క్కువ చేసి చూడొద్ద‌ని విప‌క్షాల‌కు హిత‌వు ప‌లికారు. రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను ప్ర‌జ‌లు నిశితంగా గ‌మ‌నిస్తున్నార‌ని, అసెంబ్లీ స‌మావేశాల్లో ఎవ‌రేం మాట్లాడుతున్నారో చూస్తున్నార‌ని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement