25 కోట్లకు పెగసస్‌ స్పైవేర్‌ ఆఫర్‌.. సరికాదని తిరస్కరించా: సీఎం మమతా బెనర్జీ

CM Mamata Says Reject The Offer Of NSO Pegasus Spyware Selling Bengal - Sakshi

కోల్‌కతా: భారత్‌లో గతేడాది ప్రకంపనలు సృష్టించిన ఇజ్రాయెల్‌ భద్రతా సంస్థ ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌ తయారు చేసిన పెగసస్‌ స్పైవేర్‌ నిఘా వ్యవస్థపై పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌ సైబర్‌ ఇంటలిజెన్స్‌ సంస్థ ఎన్‌ఎస్‌ఓ.. నాలుగేళ్ల క్రితం పశ్చిమ బెంగాల్‌ పోలీసు డిపార్టుమెంటకు తమ స్పైవేర్లను విక్రయించడానికి వచ్చినట్లు తెలిపారు.

పెగసస్‌ను రూ.25 కోట్లకు విక్రయిస్తామని ఆ సంస్థ పేర్కొన్నట్లు సీఎం మమతా వెల్లడించారు. అయితే పెగసస్‌ వంటి స్పైవేర్‌ను కొనుగోలు చేయడం రాజకీయంగా దోపిడీకి పాల్పడినట్లు అవుతుందని,న్యాయమూర్తులు, కేంద్ర సంస్థల అధికారులను లక్ష్యంగా చేసుకోవడం ఆమోదయోగ్యం కాదని ఎన్‌ఎస్‌ఓ ఆఫర్‌ను తిరస్కరించినట్లు తెలిపారు.

జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు, వ్యాపారవేత్తలు ఫోన్‌లను లక్ష్యంగా చేసుకునేందుకు ప్రధాని నర్రేందమోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మమతా బెనర్జీ ముందు నుంచి ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. పెగసస్‌పై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కూడా ఆమె డిమాండ్‌ చేశారు. పెగసస్ స్పైవేర్‌ వివాదంపై బెంగాల్ ప్రభుత్వం విచారణ కూడా ఆదేశించింది. వివాదాస్పద పెగసస్‌ స్పైవేర్‌పై విచారణకు ఆదేశించిన మొదటి రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్ నిలవటం విశేషం.

పెగాసస్‌ స్పైవేర్‌ ద్వారా విపక్షనేతలు, హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులపై దాదాపు 50 దేశాల్లో నిఘా పెట్టారని అంతర్జాతీయ మీడియా పలు కథనాల్లో వెల్లడించింది. పెగసస్‌ స్పైవేర్‌ నిఘా వ్యవస్థని ఇజ్రాయెల్‌ ప్రపంచ దేశాలకు విక్రయిస్తోందని తెలిపాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top