‘చిట్టీ’ల్లో నష్టం... ముగ్గురిని అంతమొందించి.. | Chit Fund Money Misuse Case | Sakshi
Sakshi News home page

‘చిట్టీ’ల్లో నష్టం... ముగ్గురిని అంతమొందించి..

Mar 30 2026 8:52 AM | Updated on Mar 30 2026 10:45 AM

Chit Fund Money Misuse Case

చేసేది చిట్‌ఫండ్‌ బిజినెస్, సాగించేది విలాసవంతమైన జీవనం.. కానీ పరిస్థితి అదుపు తప్పింది, విపరీతంగా అప్పుల భారం, చెల్లించాలని ఒత్తిళ్లు.  ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి రాక్షసునిగా మారాడు. తన తల్లి, అక్క, ఆమె కొడుకుపై కత్తితో దాడి చేశాడు. వారిని చంపి, తాను ఆత్మహత్య చేసుకోవాలన్నదే అతని ప్రణాళిక.            ఈ దురాగతంలో ఇద్దరు మరణించారు, ఇద్దరు       తీవ్ర గాయాల పాలయ్యారు. బెంగళూరు శివార్లలోని ఆనేకల్‌ ఈ ఘోరానికి వేదికైంది.  

బెంగళూరు: చిట్‌ఫండ్‌ వ్యాపారంలో అప్పుల పాలై ఓ వ్యక్తి ఎవరూ ఊహించని ఘోరానికి పాల్పడ్డాడు. బెంగళూరు నగర జిల్లా పరిధిలోని ఆనేకల్‌ తాలూకాలోని అత్తిబెలే సమీపంలో ఉన్న మల్లెనహళ్లిలో శనివారం సాయంత్రం జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. మోహన్‌గౌడ (32) చిట్‌ఫండ్‌ వ్యాపారం చేసేవాడు. ఇంట్లో కత్తితో తల్లి ఆశా (56),, సోదరి వర్షిత (34), సోదరి కుమారుడు మయాంక్‌గౌడ (11) మీద దాడి చేసి వారి గొంతులు కోసి, తరువాత అదే కత్తితో తానూ గొంతుకోసుకున్నాడు. ఆశా, వర్షిత అక్కడికక్కడే మరణించారు. మోహన్‌గౌడ, బాలుడు తీవ్ర గాయాల పాలయ్యారు.  

సెల్ఫీ వీడియో పంపి 
మోహన్‌గౌడ రూ.5 లక్షల నుంచి 50 లక్షల వరకూ చిట్టీలు నిర్వహించేవాడు. జనం డబ్బులు చెల్లిస్తూ ఉండగా, విలాసవంత జీవనానికి అతడు అలవాటు పడ్డాడు. హత్యాకాండకు ముందు తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా బంధువులకు ఓ సెల్ఫీ వీడియోను పంపాడు. అప్పులవారి వేధింపులను భరించలేకపోతున్నట్లు తెలిపాడు. దీంతో కొందరు పరుగు పరుగున ఇంటికి వచ్చి చూడగా తలుపులన్నీ వేసి ఉన్నాయి. వెనుక తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లగా, రక్తపు మడుగులో తల్లీకూతురి మృతదేహాలు కనిపించాయి. మోహన్, మయాంక్‌లు  గాయాలతో పడి ఉన్నారని బెంగళూరు రూరల్‌ ఎస్పీ ఎంవీ చంద్రకాంత్‌ మీడియాకు తెలిపారు. అత్తిబెలె పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు అవివాహితుడని సమాచారం.  

అప్పులే కారణం: ఎస్పీ 
ఎస్పీ చంద్రకాంత్‌ మాట్లాడుతూ, శనివారం రాత్రి సుమారు 10:30 గంటలకు ఈ సంఘటన గురించి తమకు సమాచారం అందిందని తెలిపారు. అధిక అప్పులే కారణమని తేలింది. మోహన్‌గౌడ ఖాతాదారుల నుంచి లక్షల రూపాయల డబ్బులు తీసుకొని వారికి తిరిగి చెల్లించలేకపోయాడు, లగ్జరీ లైఫ్‌తో విపరీతంగా ఖర్చులు పెట్టేవాడు. ముందుగా తల్లి, సోదరి, మేనల్లుని గొంతులు కోసినట్లు తేలింది. విచారణలో మరిన్ని విషయాలు తెలుస్తాయి అని తెలిపారు. అతని వద్ద చిట్‌ వేసినవారు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement