ఏందయ్యా మీ గొడవ.. కోర్టుకు మరో పనిలేదా..  సీజే అసహనం

Chief Justice Serious On Petitions Of AIADMK Leaders - Sakshi

అన్నాడీఎంకేలో అగ్రనేతల వర్గపోరు న్యాయస్థానానికి కూడా తలనొప్పిగా మారింది. కోర్టులో దాఖలవుతున్న పిటీషన్ల పరంపరపై సాక్షాత్తూ న్యాయమూర్తే అసహనం వ్యక్తం చేశారు. ‘ప్రధాన న్యాయమూర్తికి మరో పనిలేదని భావిస్తున్నారా’ అంటూ న్యాయమూర్తి కృష్ణన్‌ రామస్వామి అన్నాడీఎంకే నేతలు, వారి న్యాయవాదులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  

సాక్షి ప్రతినిధి, చెన్నై : అన్నాడీఎంకే అగ్రనేతలు ఎడపాడి పళనిస్వామి, పన్నీర్‌సెల్వం మధ్య అంతర్గత పోరు చిలికిచిలికి గాలివానగా మారిన విషయం తెలిసిందే. సమన్వయ కమిటీ కనీ్వనర్‌గా పన్నీర్‌సెల్వం, ఉప కనీ్వనర్‌ ఎడపాడి పళనిస్వామి ఉన్న ద్వంద విధానానికి స్వస్తి చెప్పి ఏక నాయకత్వంతో ముందుకు సాగాలనే అంశం పార్టీలో అగ్గిరాజేసింది. ఓపీఎస్‌ ఆదేశాలను అనుసరించి జూన్‌ 23వ తేదీన జరిగిన సర్వసభ్య సమావేశాన్ని ఈపీఎస్‌ వర్గం ధిక్కరించింది. పైగా జూలై 11వ తేదీన మరో సర్వసభ్య సమావేశం నిర్వహించింది. పనిలోపనిగా ఎడపాడిని తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుని, ఓపీఎస్, ఆయన ఇద్దరు కుమారులు, అనుచరులపై బహిష్కరించింది.

అయితే, ఓపీఎస్‌ వేసిన పిటిషన్‌తో ఎడపాడి నిర్వహించిన సర్వసభ్య సమావేశం చెల్లకుండా పోగా, పన్నీర్‌ పదవులు మళ్లీ పదిలమయ్యాయి. అన్నాడీఎంకే నిర్వహించిన సర్వసభ్య సమావేశం చెల్లదని ప్రత్యేక న్యాయమూర్తి జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎడపాడి పళనిస్వామి మరో పిటిషన్‌ వేశారు. పార్టీలోని ఇరువర్గాలు ఏకమై మరో సర్వసభ్య సమావేశం జరుపుకోవాలని కోర్టు చేసిన సూచనకు ఎడపాడి తరపు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. పన్నీర్‌సెల్వంతో ఎడపాడి కలిసి పనిచేసేందుకు అవకాశమే లేదని మద్రాసు హైకోర్టులో గురువారం జరిగిన వాదోపవాదాల్లో తేల్చిచెప్పారు. ఇలా ఇరువురూ నేతలూ పోటాపోటీగా మద్రాసు హైకోర్టు, సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లలో కొన్ని ఇంకా విచారణ దశలో ఉన్నాయి.  

తాజాగా మరో రెండు.. 
తిరుచెందూరుకు చెందిన న్యాయవాది, అన్నాడీఎంకే సభ్యుడైన పి. ప్రేమ్‌కుమార్‌ ఆదిత్యన్, అదే పార్టీ సభ్యుడు సురేన్‌ పళనిస్వామి మద్రాసు హైకోర్టులో బుధవారం వేర్వేరుగా రెండు సివిల్‌ పిటిషన్లు వేశారు. 2017 సెపె్టంబర్‌ 12వ తేదీన సర్వసభ్య సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. 2021 డిసెంబర్‌ 1వ తేదీన పార్టీ విధానాల్లో చేసిన మార్పులు, డిసెంబర్‌ 6వ తేదీన జరిగిన సమన్వయ కమిటీ ఎన్నికలు, సంస్థాగత ఎన్నికలు, 2022 జూన్‌ 23వ తేదీన సర్వసభ్యç సమావేశలో చేసిన తీర్మానాలు చెల్లవని ప్రకటించాల్సిందిగా కోరుతూ ఈ పిటిషన్‌ వేశారు.

వీరిద్దరూ దాఖలు చేసిన కేసు మద్రాసు హైకోర్టులో విచారణలో ఉంది. తాము దాఖలు చేసిన సివిల్‌ పిటిషన్లు, జూన్, జూలై నిర్వహించిన సర్వసభ్య సమావేశ సమావేశాన్ని వ్యతిరేకిస్తూ సమన్వయ కమిటీ కన్వీనర్, ఉప కన్వీనర్‌ దాఖలు చేసిన పిటిషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలకు వ్యతిరేకంగా కొందరు దాఖలు చేసిన పిటిషన్లు విచారణకు ప్రత్యేక బెంచ్‌ ఏర్పాటు చేయాలని అందులో కోరారు. ఇప్పటికే అన్నాడీఎంకే కేసుల విచారణకు ఈనెల 17వ తేదీన ప్రత్యేక న్యాయమూర్తిని ఏర్పాటు చేసి ఉన్నట్లు ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. రామ్‌కుమార్‌ ఆదిత్యన్‌ తదితరులు వేసిన పిటిషన్లు న్యాయమూర్తి కృష్ణన్‌ రామస్వామి ముందుకు విచారణకు వచ్చింది. 

ఇద్దరి నాయకుల తరపున హాజరైన న్యాయవాదులు ప్రత్యేక బెంచ్‌కోసం రిజి్రస్టార్‌కు వినతిపత్రం సమర్పించిన విషయం వెలుగులోకి రావడంతో న్యాయమూర్తి తీవ్రంగా ఆక్షేపించారు. కేసు విచారణ దశలో ఉండగా ప్రధాన న్యాయమూర్తికి వినతిపత్రాలు సమరి్పంచడమే మీపనిగా ఉంది, సీజేకి మరో పనిలేదని భావిస్తున్నారా..? అంటూ న్యాయమూర్తి ప్రశ్నించి కేసు విచారణను సెపె్టంబర్‌ 9వ తేదీకి వాయిదా వేశారు. గతనెల 11వ తేదీ జరిగిన సర్వసభ్య సమావేశం చెల్లదని ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్, సుప్రీంకోర్టు జారీచేసిన ఉత్తర్వులపై మద్రాసు హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ ఇదే న్యాయమూర్తి ముందుకు విచారణకు వచ్చింది.

అయితే పార్టీ సమన్వయ కమిటీ  కన్వీనర్‌ పన్నీర్‌సెల్వం న్యాయవాది అభ్యర్థన మేరకు కేసు విచారణను మరో న్యాయమూర్తికి బదిలీ చేశారు. ఈమేరకు న్యాయమూర్తి జయచంద్రన్‌ను నియమిస్తూ ఈనెల 17న ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ దశలో అన్నాడీఎంకే కేసులన్నీ విచారించేందుకు ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేయాలని మరో రెండు పిటిషన్లు దాఖలు కావడంపై న్యాయమూర్తి కృష్ణన్‌ రామస్వామి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top