చిన్నమ్మకు చుక్కెదురు

Chennai Court Rejects Sasikala Plea On Aiadmk Post - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: చిన్నమ్మ శశికళకు చెన్నై సిటీ సివిల్‌ కోర్టులో చుక్కెదురైంది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి నుంచి ఆమెను తొలగించడం సబబే అంటూ న్యాయస్థానం సోమవారం తీర్పు చెప్పింది.  

నేపథ్యం ఇదీ.. 
సుదీర్ఘకాలం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఉన్న జయలలిత 2016 డిసెంబర్‌లో కన్నుమూశారు. తరువాత ఆ బాధ్యతల్లో శశికళ, ఉప ప్రధాన కార్యదర్శిగా టీటీవీ దినకరన్‌ ఎంపికైనట్లు ఆపార్టీ 2016 డిసెంబర్‌ 19న ప్రకటించింది. ఇక ఆ తరువాత సీఎం సీటుపై కన్నేసిన జయలలిత శాసనసభాపక్ష నేతగా కూడా ఎన్నిక్కయ్యారు. అయితే అదే సమయంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళకు నాలుగేళ్ల శిక్ష పడగా బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలుకెళ్లారు. దీంతో ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళను, ఉప ప్రధాన కార్యదర్శి పదవి నుంచి టీటీవీ దినకరన్‌ను తొలగిస్తున్నట్లు పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్‌ ఓ పన్నీర్‌సెల్వం, ఉప కన్వీనర్‌ ఎడపాడి పళనిస్వామి 2017 సెప్టెంబర్‌లో జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంలో ప్రకటించారు.   

ఆ తీర్మానాలు చెల్లవంటూ..
ఇదిలా ఉండగా, ప్రధాన కార్యదర్శి సమక్షంలో జరగని (సర్వసభ్య సమావేశంలో) తీర్మానాలు చెల్లవని ప్రకటించాల్సిందిగా కోరుతూ శశికళ, దినకరన్‌ చెన్నై సిటీ సివిల్‌ కోర్టులో పిటిషన్‌ వేశారు. తనను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంటూ 2016లో చేసిన తీర్మానానికి పార్టీ సభ్యుల హోదాలో పన్నీర్‌సెల్వం, ఎడపాడి పళనిస్వామి బద్దులై ఉండాలని, కన్వీనర్, కో– కన్వీనర్‌ పదవులను ఏర్పాటు చేయడం చట్ట విరుద్ధమని ప్రకటించాలని శశికళ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. శశికళ వేసిన పిటిషన్‌ను నిరాకరించాల్సిందిగా పన్నీర్‌సెల్వం, ఎడపాడి కూడా పిటిషన్‌ వేశారు.

ఈ వ్యవహారం కోర్టులో విచారణకు వచ్చినప్పుడు పార్టీ తరపు న్యాయవాదులు తమ వాదన వినిపిస్తూ, శశికళ, దినకరన్‌ను పార్టీ నుంచి బహిష్కరించడాన్ని సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు, ఎన్నికల కమిషన్‌ సమర్ధించిందని చెప్పారు. తాను పార్టీ ప్రధాన కార్యదర్శినని.. న్యాయస్థానంలో శశికల అబద్ధమాడారని వివరించారు. అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం అనే పేరుతో సొంతగా పార్టీ స్థాపించినందున తాను వేసిన పిటిషన్‌ను వెనక్కితీసుకుంటున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దినకరన్‌ మరో పిటిషన్‌ ద్వారా కోర్టుకు విన్నవించారు. దీంతో ప్రధాన కార్యదర్శిగా ప్రకటించాలని కోరుతూ శశికళ దాఖలు చేసిన పిటిషన్‌పై మాత్రమే సోమవారం విచారణ సాగింది. శశికళ వేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని కోరుతూ పన్నీర్‌సెల్వం, ఎడపాడి పళనిస్వామి దాఖలు చేసిన పిటిషన్లను స్వీకరిస్తున్నట్లు, ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళను తొలగిస్తూ చేసిన తీర్మానం చెల్లుతుంది కాబట్టి ఆమె వేసిన పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు చెన్నై సిటీ సివిల్‌ కోర్టు న్యాయమూర్తి జె. శ్రీదేవి సోమవారం తీర్పు చెప్పారు.   

సివిల్‌ కోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్తాం..
సేలం: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తనను తొలగించడం సబబే అంటూ చెన్నై సిటీ సివిల్‌ కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలు చేస్తామని చిన్నమ్మ సోమవారం స్పష్టం చేశారు. నామక్కల్‌ జిల్లా తిరుచెంగోడులోని ఆర్ధనారీశ్వర స్వామి ఆలయానికి శశికళ సోమవారం వచ్చి స్వామిని దర్శించుకున్నారు. స్వామి, అమ్మవారు, నవగ్రహాల సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..  అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలే తనకు ఆధారమన్నారు. ఎంజీఆర్‌ రూపొందించిన విధి విధానాల ఆధారంగా కార్యకర్తలే ప్రధాన కార్యదర్శిని నిర్ణయించగలరని స్పష్టం చేశారు. దేశంలోని మరే పార్టీలోనూ ఈ షరతు లేదని, అన్నాడీఎంకే విధి విధానాల్లో మాత్రమే ఉందని స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగానే తాను పోరాడుతున్నట్లు చెప్పారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top