తెలుగు రాష్ట్రాలపై కేంద్రం ప్రశంసలు

Centre Praises To Telangana, AP States Of Drinking Water Implementation - Sakshi

ఏపీ, తెలంగాణ పనితీరుపై సంతృప్తి

పార్లమెంట్‌కు నివేదిక సమర్పించిన స్థాయీ సంఘం

సాక్షి, న్యూఢిల్లీ: ‘చిన్నారులకు సురక్షిత తాగునీరు’ నినాదంతో చేపట్టిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు నూటికి నూరు శాతం ప్రగతి కనబర్చడంపై జల వనరులపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం సంతృప్తి వ్యక్తం చేసింది. పాఠశా లలు, అంగన్‌వాడీలు, గిరిజన వసతి గృహాలకు సురక్షిత తాగునీటి సరఫరాపై 2020, అక్టోబర్‌ 2న ఈ కార్యక్రమాన్ని నిర్దేశించింది. స్థాయీ సంఘం తన 11వ నివేదికను సోమవారం పార్లమెంటుకు సమర్పించింది. ఆంధ్రప్రదేశ్‌లో 42,655 అంగన్‌వాడీ కేంద్రాలకు, 41,619 పాఠశాలలకు నూటికి నూరు శాతం నల్లా కనెక్షన్లు ఇచ్చినట్టు గుర్తించింది. 27,310 అంగన్‌వాడీలు, 22,882 పాఠశాలల్లో కనెక్షన్లు ఇవ్వడం ద్వారా తెలంగాణ నూటికి నూరు శాతం లక్ష్యాన్ని సాధించింది.

ఈ రెండు విభాగాల్లోనూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా కేవలం ఆరు రాష్ట్రాలు మాత్రమే  లక్ష్యాన్ని సాధించాయి. గ్రామ పంచాయతీల్లో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణకు తగిన మౌలిక వసతులను సమకూర్చుకోవడంలో కూడా ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్, మేఘాలయ, గుజరాత్, ఛత్తీస్‌గఢ్‌ తదితర రాష్ట్రాలు చక్కటి పనితీరు కనబరిచాయని గుర్తించింది. అయితే ఏపీలో 2018-19, 2019-20లో స్వచ్ఛభారత్‌ మిషన్‌ (గ్రామీణ) పథకం ద్వారా కేంద్రం నుంచి వచ్చిన నిధుల్లో వరసగా రూ. 987.39 కోట్లు, రూ. 1,034 కోట్లు ఖర్చు కాలేదని, అనేక రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉందని పేర్కొంది.

తెలంగాణ, గోవాలకు ప్రశంసలు
జల్‌జీవన్‌ మిషన్‌లో భాగంగా ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఏర్పాటు చేయడంలో తెలంగాణ, గోవా నూటికి నూరుశాతం లక్ష్యాన్ని సాధించడాన్ని స్థాయీ సంఘం ప్రశంసించింది. అయితే కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌ నిర్మాణంలో తెలంగాణ సహా పంజాబ్, ఉత్తరాఖండ్, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాలు వెనుకబడ్డాయని వ్యాఖ్యానించింది.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top