కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంపు?

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు కరవు భత్యం(డీఏ) 4 శాతం మేర పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే డీఏ పర్సంటేజీ ప్రస్తుతమున్న 38% నుంచి 42%కి చేరుకుంటుంది. కార్మిక శాఖ నెలవారీగా విడుదల చేసే పారిశ్రామిక సిబ్బంది వినియోగ ధరల సూచీ(సీపీఐ–ఐడబ్ల్యూ) ప్రాతిపదికగా తీసుకుని కేంద్రం ఉద్యోగులు, పింఛనుదారుల డీఏను ఖరారు చేస్తుంటుంది.
ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ శివ గోపాల్ మిశ్రా తాజా వార్తలపై స్పందిస్తూ..‘డిసెంబర్ 2022 సీపీఐ–ఐడబ్ల్యూ జనవరి 31, 2023న విడుదలైంది. దీని ప్రకారంగా డీఏ పెంపు 4% ఉంటుంది. అప్పుడు 42%కి చేరుకుంటుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రతిపాదనలను తయారు చేసి కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం పంపుతుంది’అని ఆయన అన్నారు. ఒకవేళ ఈ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపితే డీఏ ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి అమలవుతుంది. ప్రస్తుతం ఒక కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు 38% డీఏను పొందుతున్నారు. సెప్టెంబర్ 28, 2022ను రివిజన్ డీఏ 2022 జూలై నుంచి అమల్లోకి వచ్చింది.
మరిన్ని వార్తలు :