
సాక్షి, న్యూఢిల్లీ: ఔషధాల ధరలతో సతమతమవుతున్న సామాన్యులకు కేంద్రం ఊరట కల్పించింది. అవయవ మార్పిడి, తీవ్రమైన బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల చికిత్సలో వాడే 42 కీలక ప్రాణాధార ఔషధాల రిటైల్ ధరలను జాతీయ ఔషధ ధరల నియంత్రణ ప్రాధికార సంస్థ (ఎన్‌పీపీఏ) ఖరారు చేసింది. దాంతో రోగులకు వైద్య ఖర్చుల భారం తగ్గడమే గాక ఫార్మా కంపెనీలు, మందుల దుకాణాల అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట పడనుంది.
ధరలను నియంత్రించిన జాబితాలో బ్రాడ్–స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్, అవయవ మార్పిడి తర్వాత వాడే ఇమ్యునోసప్రెసెంట్స్ వంటి అత్యంత కీలకమైన ఔషధాలున్నాయి. తీవ్రమైన ఇన్ఫెక్షన్ల చికిత్సలో వాడే మెరోపెనమ్–సుల్బాక్టమ్ ఇంజెక్షన్ ధరను రూ.1,938.59, అవయవ మార్పిడిలో కీలకమైన మైకోఫెనోలేట్ మోఫెటిల్ టాబ్లెట్‌కు రూ.131.58, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నివారిణి టాబ్లెట్ క్లారిథ్రోమైసిన్ ఎక్స్‌టెండెడ్–రిలీజ్ టాబ్లెట్‌కు రూ.71.71గా నిర్ణయించారు.
మందుల ధరలను నియంత్రిస్తూ జాతీయ ఔషధ ధరల నియంత్రణ ప్రాధికార సంస్థ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం.. ఔషధ తయారీదారులు తప్పనిసరిగా ధరల పట్టికను డీలర్లు, రాష్ట్ర ఔషధ నియంత్రణ సంస్థలు, ప్రభుత్వానికి అందజేయాలి. అంతేకాకుండా, ప్రతి రిటైల్ మందుల దుకాణం, డీలర్ తమ ప్రాంగణంలో అందరికీ స్పష్టంగా, సులభంగా కనిపించేలా ధరల జాబితాను ప్రదర్శించాల్సి ఉంటుంది.
సామాన్యుడికి ప్రయోజనం ఏమిటి?
సామాన్య రోగులను ఆదుకోవడమే ప్రధాన ఉద్దేశం. మందుల దుకాణాల్లో ధరల పట్టికను తప్పనిసరిగా ప్రదర్శించాలన్న నిబంధనతో వాటికి ప్రభుత్వం నిర్ణయించిన ధర ఎంత ఉందో వినియోగదారులు సులభంగా తెలుసుకోవచ్చు. దీనివల్ల మందుల దుకాణదారులు మోసాలకు పాల్పడకుండా నిరోధించవచ్చు. ఈ చర్యతో ఖరీదైన మందుల భారం తగ్గడమే కాకుండా, ఫార్మా రంగంలో పారదర్శకత మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్య రంగ సంస్కరణల్లో ఇదొక కీలక మలుపు అని అభిప్రాయపడుతున్నారు.