సాక్షి, న్యూఢిల్లీ: సీబీఎస్‌ఈ రీవాల్యూయేషన్ పోర్టల్‌పై సైబర్ దాడి జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. పేమెంట్ సిస్టమ్ హ్యాక్ కావడంతో.. కొంతసేపు అనధికారిక యాక్సెస్ జరిగినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇది సైబర్ దాడేంకాదని.. సాంకేతిక సమస్య మాత్రమేనని ఇటు అధికారులు అంటున్నారు.
పోర్టల్ లైవ్ అయిన సమయంలో ఈ సమస్య తలెత్తగా.. సుమారు 50 మంది విద్యార్థులు సిస్టమ్‌లోకి అనధికారికంగా ప్రవేశించినట్లు సమాచారం. దీంతో కొన్ని సందర్భాల్లో చెల్లించాల్సిన ఫీజు రూ.1 నుంచి ఏకంగా రూ.67,000–రూ.68,000 వరకు మారిపోయినట్లు అధికారులు తెలిపారు. అయితే.. ఈ ఘటన సంబంధిత బ్యాంక్ పేమెంట్ గేట్‌వేతో అనుసంధానమైన వ్యవస్థలో గ్లిచ్ కారణంగా(సిస్టమ్‌లో బగ్ వల్ల వచ్చిన ఇష్యూ) జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు సిస్టమ్‌ను నిలిపివేసి సమస్యను సమీక్షించారు.
ఈ వ్యవహారంపై ఐఐటీ మద్రాస్, ఐఐటీ కాన్పూర్ నిపుణులతో పాటు డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బృందం కూడా దర్యాప్తు ప్రారంభించింది. పోర్టల్ కోడ్, సిస్టమ్ ఇంటిగ్రేషన్‌ను సమీక్షిస్తూ భద్రతను మరింత బలోపేతం చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. ఇకపై హెచ్‌డీఎఫ్‌సీతో పాటు ఎస్‌బీఐ, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలను కూడా అదనపు పేమెంట్ గేట్‌వేలుగా అనుసంధానించినట్లు అధికారులు తెలిపారు. సిస్టమ్‌ను మరింత సురక్షితంగా, గ్లిచ్‌లేని విధంగా మార్చేందుకు చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.


