నీట్‌ పేపర్‌ లీకేజీ కేసు.. లాతూర్‌లో కోచింగ్‌ సెంటర్‌ యజమాని అరెస్ట్‌  | NEET Paper Leak, CBI Arrests Latur Coaching Institute Owner Shivaraj Motegaonkar, Court Sends Him To 9 Day Custody | Sakshi
Sakshi News home page

నీట్‌ పేపర్‌ లీకేజీ కేసు.. లాతూర్‌లో కోచింగ్‌ సెంటర్‌ యజమాని అరెస్ట్‌ 

May 19 2026 5:26 AM | Updated on May 19 2026 9:00 AM

CBI arrests Latur coaching institute owner Shivaraj Motegaonkar

న్యూఢిల్లీ: నీట్‌ పేపర్‌ లీకేజీ కేసులో సీబీఐ అధికారులు మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన కోచింగ్‌ సెంటర్‌ యజమానిని అదుపులోకి తీసుకున్నారు. రేణుకాయీ కెమిస్ట్రీ క్లాసెస్‌(ఆర్‌సీసీ) పేరుతో కోచింగ్‌ సెంటర్‌ నెలకొల్పిన శివరాజ్‌ రఘునాథ్‌ మోటెగావొంకర్‌ ఆదివారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. ఇతడి ఫోన్‌లో ఈ నెల 3వ తేదీన లీకైన నీట్‌ ప్రశ్నపత్రం లభించింది. అంతకుముందు లాతూర్‌లోని శివనగర్‌లో ఉన్న కోచింగ్‌ సెంటర్‌తోపాటు అతడి నివాసంలోనూ సోదాలు జరిపారు. 

శివరాజ్‌ను అతడి నివాసంలోనే దాదాపు 8 గంటలపాటు అధికారులు ప్రశ్నించారు. పేపర్‌ లీకేజీ ముఠాలో శివరాజ్‌ కీలకంగా ఉన్నాడని, ఇతడి కోచింగ్‌ సెంటర్‌కు 9 బ్రాంచీలుండగా, లాతూర్‌లోనిది ప్రధాన కేంద్రమని అధికారులు వెల్లడించారు. లీకేజీ కుట్రలో భాగంగా పరీక్షకు దాదాపు 10 రోజులు ముందుగానే, ఏప్రిల్‌ 23వ తేదీనే ప్రశ్నపత్రం, జవాబులు ఇతడికి అందాయన్నారు. వీటిని ఇతడు చేత్తో రాసిన నోట్స్‌ రూపంలో ఇతరులకు అందజేశాడని, పరీక్ష అనంతరం వీటిని తగులబెట్టారన్నారు. 

నీట్‌ నిర్వహించిన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ)తో సంబంధాలున్న కెమిస్ట్రీ లెక్చరర్‌ పీవీ కులకరి్ణకి శివరాజ్‌ సన్నిహితుడని వివరించారు. ఇతడి ఇల్లు, కోచింగ్‌ సెంటర్‌లలో జరిపిన సోదాల్లో 3వ తేదీన జరిగిన నీట్‌ పరీక్షలోని ప్రశ్నలున్న కెమిస్ట్రీ క్వశ్చన్‌ బ్యాంక్‌ లభించిందని చెప్పారు. ‘గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాల్లోని ఐదు చోట్ల సోదాలు చేపట్టి, కీలక పత్రాలతోపాటు ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లను స్వా«దీనం చేసుకున్నాం. 

వీటిని విశ్లేషించే పని చురుగ్గా సాగుతోంది’అని సీబీఐ ప్రతినిధి తెలిపారు. ఇప్పటి వరకు ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, పుణే, లాతూర్, అహల్యానగర్‌లలో 10 మంది నిందితులను అరెస్ట్‌ చేశామన్నారు. ఇలా ఉండగా, సోమవారం శివరాజ్‌ రఘునాథ్‌ మొటెగావొంకర్‌ను సీబీఐ అధికారులు ఢిల్లీలోని కోర్టులో హాజరుపర్చారు. ఇతర ఆధారాలతోపాటు నీట్‌ పేపర్‌లోని ప్రశ్నలను తన కోచింగ్‌ సెంటర్‌లో విద్యార్థులకు వెల్లడిస్తున్నట్లుగా ఉన్న ఒక వీడియోను కూడా చూపారు. దీంతో, ప్రత్యేక సీబీఐ కోర్టు జడ్జి అజయ్‌ గుప్తా అతడిని 9 రోజుల సీబీఐ కస్టడీకి పంపుతూ ఆదేశాలు జారీ చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement