
న్యూఢిల్లీ: దేశంలో కుక్కకాటు బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దీనిపై తమిళనాడు శివగంగ నియోజకవర్గం లోక్‌సభ ఎంపీ కార్తీ చిదంబరం ఆందోళన వ్యక్తం చేశారు. 2024లో 37 లక్షలకు పైగా కుక్క కాటు కేసులు నమోదయ్యాయని, ఇటువంటి పరిస్థితుల్లో 2030 నాటికి రేబిస్‌ను నిర్మూలించాలన్న కేంద్రం లక్ష్యం నెరవేరేనా? అంటూ కార్తీ చిదంబరం తన ‘ఎక్స్’ ఖాతాలో ప్రశ్నించారు.
కార్తీ చిదంబరం తన పోస్టులో.. దేశంలో చోటుచేసుకుంటున్న లక్షల కుక్కకాట్లను విస్మరించలేని సమస్యగా పేర్కొన్నారు. పార్లమెంట్ దిగువ సభలో మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ సహాయ మంత్రి ఎస్ పీ సింగ్ బాఘెల్ 2024లో మొత్తం కుక్క కాటు కేసులు 37,17,336 నమోదయ్యాయని తెలిపారు. దీనిపై కార్తీ చిదంబరం సోషల్ మీడియాలో స్పందించారు. గత ఏడాది 54 అనుమానిత మానవ రేబిస్ మరణాలు సంభవించాయని మంత్రి చెప్పిన విషయాన్ని కార్తీ చిదంబరం గుర్తుచేశారు. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సీడీసీ) ద్వారా నేషనల్ రేబిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ కింద రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల నుండి డేటాను సేకరించినట్లు పార్లమెంటులో మంత్రి భాగేల్ తెలిపారు.
We can’t ignore this any more! #Streetdogs pic.twitter.com/6sT4z4DcmO
— Karti P Chidambaram (@KartiPC) July 22, 2025
భారతదేశంలో రేబిస్ తీవ్రమైన ప్రజారోగ్య సవాలుగా పరిణమించింది. ప్రపంచవ్యాప్త రేబిస్ మరణాలలో భారతదేశంలో 36 శాతం నమోదవుతున్నాయి. ఏటా 20 వేల మరణాలకు రేబిస్ కారణంగా నిలుస్తోంది. 15 ఏళ్లలోపు పిల్లలే అధికంగా రేబిస్ బారిన పడుతున్నారు.
గత ఆరు నెలల్లో కర్ణాటకలో 2.3 లక్షలకు పైగా కుక్క కాటు కేసులు, 19 రేబిస్ మరణాలు నమోదయ్యాయి. మరోవైపు కేరళ ప్రభుత్వం వీధి కుక్కల నియంత్రణపై కఠిన చర్యలు తీసుకోవాలని యోచిస్తోందని మంత్రి ఎం.బి. రాజేష్ ఇటీవల పేర్కొన్నారు. కేరళ ఆరోగ్య, విద్యా శాఖలు సంయుక్తంగా రాష్ట్రంలోని పాఠశాలల్లో రేబిస్‌కు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.