సేవకుల తయారీ విధానమది

British education system meant to create servant class says PM Narendra modi - Sakshi

బ్రిటిష్‌ విద్యా విధానంపై ప్రధాని మోదీ విమర్శలు

కాశీలో అన్నివిధాలా అభివృద్ధి

యూపీ ఫలితాల తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గంలో పర్యటన

వారణాసి: బ్రిటిష్‌ వలస పాలకులు రూపొందించిన విద్యావిధానం ముఖ్యోద్దేశం వారి అవసరాలను తీర్చేలా సేవకులకు తయారు చేయడమేనని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఆ విధానంలోని చాలా అంశాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా గురువారం వారణాసిలో ఆయన పర్యటించారు.

జాతీయ విద్యా విధానం(ఎన్‌ఈపీ) అమలుపై ఏర్పాటైన మూడు రోజుల ‘అఖిల భారతీయ శిక్షా సమాగమ్‌’ సమ్మేళనాన్ని ప్రారంభించారు. బ్రిటిషర్ల విద్యావిధానంలో స్వాతంత్య్రానంతరం కొన్ని మార్పులు జరిగినా చాలా వరకు పాతవే కొనసాగుతున్నాయన్నారు. కేవలం డిగ్రీ హోల్డర్లను తయారు చేయడమే కాకుండా దేశాన్ని ముందుకు నడిపించేందుకు అవసరమైన మానవ వనరులను సమకూర్చడమే విద్యావిధానం లక్ష్యం కావాలన్నారు.

విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించేందుకు అవసరమైన వాతావరణాన్ని క్యాంపస్‌లలో కల్పించాలి. విద్యావిధానం ద్వారా మారుతున్న ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా యువతను సంసిద్ధులను చేయడమనే గురుతర బాధ్యత మనపై ఉందన్నారు. ‘వినూత్నమైన, నవీనమైన కొత్త ఆలోచనలను ఈ వేదికపై చర్చించాలి. వర్సిటీకి 50–100కిలోమీటర్ల పరిధిలోని సమస్యలను, వనరులను గుర్తించి, వాటికి పరిష్కారాలను కనుగొనాలి.

ప్రభుత్వ పథకాల ప్రభావాన్ని అధ్యయనం చేయాలి’ అని విద్యార్థులకు ప్రధాని సూచించారు. విద్యార్థులు క్షేత్ర పర్యటనల ద్వారా ఆధార సహిత పరిజ్ఞానం పెంచుకోవాలని ప్రధాని నొక్కి చెప్పారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో మొదటిసారిగా పర్యటించిన ప్రధాని..అక్షయపాత్ర మధ్యాహ్న భోజన వంటశాలను ప్రారంభించారు. ఎల్‌టీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈ కిచెన్‌లో లక్ష మంది విద్యార్థులకు భోజనం తయారు చేసేందుకు వీలుంటుంది.

ఈ సందర్భంగా ప్రధాని రూ.1,774 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం సంపూర్ణానంద స్టేడియంలో ఏర్పాటైన సభలో ప్రధాని ప్రసంగిస్తూ..అభివృద్ధి అంటే పైపై మెరుగులు కాదు..పేదలు, అణగారిన, గిరిజన వర్గాల సాధికారతేనని అన్నారు. ‘ఎంపీగా సేవచేసేందుకు కాశీ నాకు ఒక అవకాశమిచ్చింది.

స్వల్పకాలిక పనులతో కొందరు లాభపడి ఉండొచ్చు. కానీ, అలాంటి వాటితో దేశం అభివృద్ధి చెందదని కాశీ ప్రజలు కోరుకున్నారు. వారి ముందుచూపువల్లే ప్రస్తుతం వారణాసిలో ఎంతో అభివృద్ధి జరిగింది. ఈ మొత్తం ప్రాంతం దీనివల్ల ప్రయోజనం పొందుతోంది. దివ్య, నవ్య, భవ్య కాశీ అనే రీతిలో ఎనిమిదేళ్లుగా అభివృద్ధి చెందుతోంది’ అని ప్రధాని చెప్పారు.  

మీ ప్రతిభ అమోఘం
జాతీయ విద్యావిధానం సమ్మేళనానికి హాజరైన ప్రధాని మోదీ స్కూలు విద్యార్థుల ప్రతిభాపాటవాలను చూసి ముగ్ధులయ్యారు. ఆయన చుట్టూ చేరిన స్కూలు పిల్లలు ఒకరు శివతాండవ స్తోత్రమ్‌ ఆలపించగా మరొకరు డ్రమ్‌ వాయించారు. ఒకరు యోగాసనాలు వేసి చూపించగా మరొకరు స్వచ్ఛతా కార్యక్రమం ప్రాముఖ్యంపై పాట పాడారు. ‘మీ అందరికీ ధన్యవాదాలు. ఒక్కొక్కరికీ ఒక్కో ప్రతిభ ఉంది. మీ అందరూ చాలా ప్రతిభావంతులైన చిన్నారులు’అంటూ వారిపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రతి రోజూ పరిశుభ్రత పాటిస్తున్నారా? వ్యాయామం చేస్తున్నారా? అంటూ ప్రశ్నించగా వారంతా అవునని సమాధానమిచ్చారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top