మంత్రి న‌వాబ్ మాలిక్‌కు హైకోర్టు చురకలు

Bombay High Court Directed Nawab Malik Submit Affidavit Defamation Suit - Sakshi

ముంబై: ఎన్సీపీ నేత‌, మ‌హారాష్ట్ర మంత్రి న‌వాబ్ మాలిక్‌కు బాంబే హైకోర్టు చురకలు అంటించింది. కోర్టుకు వచ్చి సమాధానం చెప్పాలని ఆయనను ఉన్నత న్యాయస్థానం సోమవారం ఆదేశించింది. నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖెడే తండ్రి ధ్యాన్‌దేవ్‌ వేసిన పరువు నష్టం దావా విచారణ సందర్భంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. న‌వాబ్ మాలిక్‌ తమ కుటుంబ ప్రతిష్టకు భంగం కలిగించారంటూ ధ్యాన్‌దేవ్‌ పరువునష్టం దావా వేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ మాధవ్‌ జామ్‌ధార్‌ నేతృత్వంలోని వెకేషన్‌ బెంచ్‌.. అఫిడవిట్‌ ద్వారా సమాధానం ఇవ్వాలని మాలిక్‌ను ఆదేశించింది. 

‘మీరు (నవాబ్ మాలిక్) రేపటిలోగా మీ సమాధానం ఇవ్వండి. మీరు ట్విటర్‌లోనే కాదు, ఇక్కడకు వచ్చి కూడా సమాధానం ఇవ్వొచ్చు’ అంటూ మాలిక్‌కు చురకలు అంటించింది. కాగా, ముంబై క్రూయిజ్‌ మాదక ద్రవ్యాల కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి సమీర్‌ వాంఖెడేను లక్ష్యంగా చేసుకుని ట్విటర్‌లో మాలిక్‌ పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే వాంఖెడే కుటుంబానికి వ్యతిరేకంగా మళ్లీ ఎటువంటి ప్రకటనలు చేయకుండా మాలిక్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేయలేదు. (చదవండి: ఆర్యన్‌ కేసు నుంచి వాంఖెడే అవుట్‌)


ప్రతిరోజు తప్పుడు ప్రకటనలతో వాంఖెడే కుటుంబ పరువుకు నష్టం కలిగించేలా నవాబ్‌మాలిక్‌ ఆరోపణలు చేస్తున్నారని వాంఖెడే తరఫు న్యాయవాది అర్షద్ షేక్ కోర్టులో వాదించారు. సోషల్‌ మీడియాలో అసత్య పోస్ట్‌లు పెడుతూ మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఈ ఉదయం కూడా సమీర్ వాంఖడే భార్య సోదరి గురించి ట్వీట్ చేశారని వెల్లడించారు. కనీసం విచారణ ముగిసే వరకు నవాబ్‌ మాలిక్‌ ఎటువంటి ప్రకటనలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. 

దావాపై అఫిడవిట్ దాఖలు చేయడానికి సమయం ఇవ్వాలని నవాబ్ మాలిక్ తరపు న్యాయవాది అతుల్ దామ్లే కోరారు. ఇతర వ్యక్తులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానించిన వాటిని నవాబ్‌ మాలిక్‌ ఆపాదించడం సరికాదని కోర్టుకు తెలిపారు. కాగా, మీడియా సమావేశాలు, సోషల్‌ మీడియా తమ కుటుంబ పరువు తీసిన నవాబ్‌ మాలిక్‌పై రూ.1.25 కోట్లకు ధ్యాన్‌దేవ్ వాంఖెడే దావా వేశారు. (చదవండి: ఆర్యన్‌ను కిడ్నాప్‌ చేయాలనుకున్నారు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top