ఆర్‌ఎస్‌ఎస్‌ ఆఫీస్‌పై బాంబు విసిరిన దుండగులు.. వీడియో వైరల్‌

A bomb was hurled at RSS office in Kannur district of Kerala - Sakshi

కన్నూర్‌: కేరళ పయ్యనూర్‌లోని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) కార్యాలయంపై మంగళవారం తెల్లవారుజామున ఇద్దరు దుండగులు బాంబు విసిరారు. దీంతో భవనం ప్రధాన ద్వారం తలుపులు, కిటికీలు ధ్వంసమయ్యాయి. బాంబు దాడి దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. ధ్వంసమైన తలుపులు, కుర్చీలు, టేబుళ్ల ఫోటోలు, బాంబు దాడి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దాడికి కొద్ది సమయం ముందు ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయాన్ని పరిశీలించినట్లు సీసీటీవీలో నమోదైంది. 

బాంబు దాడి జరిగిన సమయంలో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయం మూసి ఉండటం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. 'కన్నూర్‌ జిల్లా, పయ్యనూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయంపై బాంబు దాడి జరిగింది. ఈరోజు తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. కిటికి అద్దాలు ధ్వంసమయ్యాయి.' అని పయ్యనూర్‌ పోలీసులు వెల్లడించారు. మరోవైపు.. దాడి జరిగిన ఆర్‌ఎస్‌ఎస్‌ ఆఫీసు స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు సమీపంలోనే ఉండటం గమనార్హం. దాడి నేపథ్యంలో ఆ ప్రాంతంలో భద్రత పెంచారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దుండగులను పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు. 

దాడి వెనుక సీపీఎం: బీజేపీ
బాంబు దాడి వెనుక సీపీఎం పాత్ర ఉందని ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ నాయకులు ఆరోపించారు. దీనిపై ఉన్నతస్థాయి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. 'ఈ దాడిలో సీపీఎం పాత్ర ఉందని మేము అనుమానిస్తున్నాం. బంగారం స్మగ్లింగ్ వ్యవహారం బహిర్గతమైన తర్వాత అధికార పార్టీ పీకల్లోతు కష్టాల్లోకి జారుకుంది. దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఇలాంటివి చేస్తోంది.' అని బీజేపీ కన్నూర్‌ జిల్లా అధ్యక్షుడు ఎన్‌ హరిస్‌దాసన్‌ పేర్కొన్నారు.

ఇదీ చూడండి: Reverse Waterfall: ఆకాశంలోకి ఎగిరే జలపాతాన్ని ఎప్పుడైనా చూశారా?

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top