పదొస్తే పైచేయి | BJP 10 short of simple majority in Rajya Sabha | Sakshi
Sakshi News home page

పదొస్తే పైచేయి

May 23 2026 3:31 AM | Updated on May 23 2026 3:31 AM

BJP 10 short of simple majority in Rajya Sabha

రాజ్యసభలో ఆధిక్యానికి బీజేపీ కసరత్తు

మరో 10 సీట్లు సాధిస్తే సొంతంగా మెజారిటీ మార్కును దాటే అవకాశం 

మొత్తంగా 15 స్థానాలు లభిస్తే ఎన్డీఏకు మూడింట రెండొంతుల ఆధిక్యం 

జమిలి ఎన్నికలు, డీలిమిటేషన్, యూసీసీ, వంటి బిల్లులకు ఇది తప్పనిసరి

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని 10 రాష్ట్రాల్లో ఖాళీ అయిన 24 రాజ్యసభ సీట్లలో మెజార్టీ స్థానాలు గెలుచుకోవడం ద్వారా పెద్దల సభలో పూర్తిస్థాయిలో ఆధిపత్యమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కీలక సంస్కరణల బిల్లులు, రాజ్యాంగ సవరణలను ఆటంకాలు లేకుండా ఆమోదించుకోవాలంటే ఎగువ సభలో సంఖ్యాబలం కమలనాథులకు అత్యంత కీలకంగా మారింది. అందుకే ప్రస్తుత రాజ్యసభ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. 

పూర్తి మెజారిటీపై కన్ను.. 
ప్రస్తుతం 245 స్థానాలున్న రాజ్యసభలో బీజేపీకి ఉన్న 113 స్థానాలతో ఎన్డీఏ కూటమి బలం 148గా ఉంది. బీజేపీ మరో 10 సీట్లను సొంతంగా గెలుచుకుంటే సొంతంగానే మెజారిటీ మార్కు 123ను దాటుతుంది. రాజ్యాంగ సవరణల వంటి కీలక బిల్లుల ఆమోదానికి అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరమైన 163 సీట్ల మార్కును దాటాలంటే ఎన్డీఏకు మరో 15 సీట్లు కావాలి. బీజేపీ భవిష్యత్తులో తీసుకురావొచ్చని భావిస్తున్న కీలక బిల్లుల్లో ఒకే దేశం–ఒకే ఎన్నిక (వన్‌ నేషన్‌–వన్‌ ఎలక్షన్‌) కీలకమైనది.

దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించాలంటే దీనికి రాజ్యాంగ సవరణ అవసరం. అందుకు రాజ్యసభలో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) బిల్లు కూడా బీజేపీ ఎజెండాలో ప్రధానంగా ఉంది. అలాగే జనాభా ఆధారిత నియోజకవర్గాల పునరి్వభజన (డీలిమిటేషన్‌), జడ్జీల నియామక విధానం, ట్రిబ్యునళ్ల వ్యవస్థ, కోర్టు పరిపాలన వంటి అంశాల్లో మార్పులు, ఎన్నికల సంస్కరణలు, కేంద్ర–రాష్ట్ర అధికారాల పునర్వ్యవస్థీకరణ వంటి కీలక అంశాలపై బిల్లులకు మూడింట రెండొంతుల మెజారిటీ తప్పనిసరి. దీంతో బీజేపీ ఆ దిశగా ఆధిపత్యం సాధించేందుకు సిద్ధమవుతోంది. 

12 మంది బీజేపీకి చెందిన వారే 
ప్రస్తుతం నోటిఫికేషన్‌ వెలువడిన 24 స్థానాల్లో ఏపీ, కర్ణాటక, గుజరాత్‌లలో నాలుగు చొప్పున, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లలో మూడు చొప్పున ఖాళీ కానున్నాయి. జార్ఖండ్‌లో రెండు, మణిపూర్, మేఘాలయ, మిజోరం, అరుణాచల్‌ ప్రదేశ్‌లలో ఒక్కో స్థానానికి ఎన్నిక జరగనుంది. ఈ 24 మంది సభ్యుల్లో 12 మంది బీజేపీకి చెందినవారే. వారిలో కేంద్ర సహాయ మంత్రి రవ్‌నీత్‌సింగ్‌ బిట్టూ, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ ఉన్నారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో ఈసారి కేవలం సంస్థాగత విధేయతకే కాకుండా ప్రజాదరణ, ఎన్నికల ప్రభావం, సామాజిక సమీకరణాల వంటి అంశాలకు అధిక ప్రాధాన్యం లభించే అవకాశముందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది పంజాబ్‌ ఎన్నికల దృష్ట్యా కేంద్ర మంత్రి రవ్‌నీత్‌ సింగ్‌ బిట్టూకు మళ్లీ రాజస్తాన్‌ నుంచే అవకాశం లభించొచ్చు.

మరోవైపు దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ లక్ష్యంగా కొందరు కీలక నాయకులను రాజ్యసభ ద్వారా కేంద్ర రాజకీయాల్లోకి తీసుకురావాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక నుంచి సదానందగౌడను రాజ్యసభకు పంపి ఆయనకు కేంద్ర మంత్రి పదవి అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. తమిళనాడుకు చెందిన ఒక ప్రముఖ బీజేపీ నేతను ఆంధ్రప్రదేశ్‌ లేదా కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపే అంశం పరిశీలనలో ఉందని చెబుతున్నారు.

మాజీ ముఖ్యమంత్రులు, ప్రస్తుతం గవర్నర్లుగా ఉన్న సీనియర్‌ నాయకుల పేర్లు కూడా చర్చకు వస్తున్నాయని పార్టీ నేతలు అంటున్నారు. మహిళలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, యువ నాయకులకు మరిన్ని అవకాశాలు కల్పించే దిశగా బీజేపీ వ్యూహం రచిస్తున్నట్లు సమాచారం. పార్టీ రాష్ట్ర యూనిట్లు ఇప్పటికే ఆశావహుల జాబితాలను సిద్ధం చేసి కేంద్ర ఎన్నికల కమిటీకి పంపే ప్రక్రియ ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీనిపై పార్టీ జాతీయ అధ్యక్షుడు సైతం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టినట్లు సమాచారం. 

Advertisement
 
Advertisement
Advertisement