బిహార్‌ విద్యాశాఖ మంత్రి రాజీనామా

Bihar Education Minister Mewalal Choudhary Resigns - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: బిహార్‌ విద్యాశాఖ మంత్రి మేవాలాల్‌ చౌదరి తన పదవికి రాజీనామా చేశారు. అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కాగా మూడు రోజుల కిందట బిహార్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌తో పాటు 14 మంది మంత్రులుగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు.  ఇందులో భాగంగా తారాపూర్‌ నియోజకవర్గం నుంచి జేడీయూ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన మేవాలాల్‌ చౌదరికి విద్యా శాఖను కేటాయించారు. కాగా గతంలో ఆయన భాగల్‌పూర్‌ వ్యవసాయ వర్సిటీకి వైస్‌ చాన్సలర్‌గా పని చేశారు. 

ఆ సమయంలో వర్సిటీ పరిధిలో నిర్మించిన పలు భవనాల విషయంలో అవకతవకలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేగాకుండా లంచం తీసుకుని అర్హతలేని వారికి యూనివర్శిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, జూనియర్‌ శాస్త్రవేత్తలుగా నియమించారనే తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మేవాలాల్‌కు మంత్రి పదవి కట్టబెట్టడం పట్ల ప్రతిపక్షాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. తన పదవిని కాపాడుకునేందుకు నితీశ్‌ అవినీతిపరులకు కేబినెట్‌లో చోటు కల్పించారంటూ ఆర్జేడీ నేతలు ఆరోపించారు. (చదవండి: వీడియో వైరల్‌.. నెటిజన్ల విమర్శలు)

ఇక ఓ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన మేవాలాల్‌ చౌదరి జాతీయ గీతం తప్పుగా ఆలపించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. "పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా" కు బదులుగా "పంజాబ్ వసంత గుజరాత్ మరాఠా" అని పాడటంతో ప్రతిపక్షాలు సహా నెటిజన్లు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. అవినీతి కేసుల మంత్రికి జాతీయ గీతం కూడా ఆలపించడం రాదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇలాంటి తరుణంలో మేవాలాల్‌ చౌదరి రాజీనామా చేయడం గమనార్హం. (చదవండి: బిహార్‌‌: మంత్రులకు శాఖల కేటాయింపు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top