
సీతాపూర్: ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో జరిగిన షాకింగ్ ఘటన ఓ కుటుంబాన్ని విషాదంలో ముంచేసింది. ఓ ఇంట్లో దూరిన కోతులు.. మంచంపై నిద్రపోతున్న రెండేళ్ల పసికందును బయటకు లాక్కెళ్లి.. ఇంటిపై ఉన్న నీళ్ల డ్రమ్ములో పడేయడంతో ఆ పాప ప్రాణాలు కోల్పోయింది. మఖ్రేహ్తా పోలీస్ స్టేషన్ పరిధిలోని సూరజ్‌పూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.
గురువారం.. అనుజ్ కుమార్ కుమారుడు కనిపించకుండా పోయాడు. తల్లి సవిత స్నానం చేయడానికి వెళ్ళిన సమయంలో.. నిద్రిస్తున్న చిన్నారిని ఇంట్లోకి చొరబడిన కోతులు ఎత్తుకెళ్లాయి. పసికందు కనిపించడం లేదని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఇంట్లో, చుట్టుపక్కల ప్రాంతంలో గాలించారు. చివరికి నీటి డ్రమ్ములో చిన్నారి మృతదేహన్ని గుర్తించారు.
అయితే, ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే కుటుంబ సభ్యులు గురువారం సాయంత్రం శిశువు అంత్యక్రియలు నిర్వహించారు. శుక్రవారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు. శిశువు తండ్రి అనుజ్ కుమార్ ఇంటి బయట ఒక ఎలక్ట్రిక్ షాపును నిర్వహిస్తున్నాడని.. ఇప్పటివరకు కుటుంబం నుండి ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందలేదని పోలీసులు వెల్లడించారు. చిన్నారి మృతికి గల కారణాలు తెలుసుకోవడానికి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.