
సాక్షి, అమరావతి: ఈ ఏడాది ప్రతి రోజూ గరిష్టంగా 25 వేల మంది అయ్యప్ప భక్తులు శబరిమలను దర్శించుకోవచ్చని కేరళ ప్రభుత్వం తెలిపింది. కరోనా ఉధృతి కారణంగా గత ఏడాది రోజుకు కేవలం వెయ్యి మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించారు. ఈ ఏడాది కరోనా ఉధృతిలో తగ్గుదల నేపథ్యంలో కేరళ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. శబరిమల దర్శనాలకు సంబంధించి దక్షిణాది ఐదు రాష్ట్రాల అధికారులతో కేరళ ప్రభుత్వ అధికారులు మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్, కమిషనర్ హరిజవహర్‌లాల్‌లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కరోనా ఉధృతి చాలా వరకు తగ్గుముఖం పట్టడంతో ఈ ఏడాది ఎక్కువ మంది భక్తులకు అనుమతిస్తున్నట్టు కేరళ ప్రభుత్వం తెలిపింది. అయితే, భక్తులు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని, ఈ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రం నుంచి శబరిమల యాత్రకు వచ్చే భక్తులకు తెలిసేలా విస్త్రత ప్రచారం కల్పించాలని కేరళ ప్రభుత్వం కోరింది.
శబరిమల యాత్రికులకు కేరళ ప్రభుత్వం సూచనలు:
► శబరిమల దర్శనానికి వచ్చే భక్తులు ముందస్తుగా కేరళ ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన ఆన్‌లైన్ పోర్టల్‌లో తప్పనిసరిగా తమ పేర్లను నమోదు చేసుకోవాలి.
► రెండు డోసుల కరోనా టీకా పూర్తయినట్లు ధృవీకరణ పత్రం వెంట తీసుకురావాలి. లేదా దర్శనానికి 72 గంటల ముందుగా పరీక్ష చేయించుకుని, కోవిడ్ నెగిటివ్ ధృవీకరణ పత్రాన్ని వెంట తెచ్చుకోవాలి.
► శబరిమల ఆలయ పరిసరాలలో ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులనూ అనుమతించరు.
► పంబా నదిలో స్నానాలపై ఆంక్షలు ఈ ఏడాది కూడా కొనసాగుతాయి. నదీ స్నానాలకు బదులు కేవలం నది వెంబడి షవర్ స్నానాలకు మాత్రమే అనుమతి ఉంటుంది.