కిర్గిస్తాన్‌లో బయటపడ్డ చారిత్రక టోర్ ఐగిర్ ఆనవాళ్లు
రష్యా పురావస్తు పరిశోధకుల అన్వేషణలో గుర్తింపు
రాతి దూలాలతో నిర్మించిన కట్టడాలు, సిరామిక్ కళాఖండాలు వెలుగులోకి..
అది కిర్గిస్థాన్‌లోని ఇస్సిక్ కుల్ ఉప్పునీటి సరస్సు. ప్రపంచంలో ఎన్నో చెరువులుండగా దీని గురించే ఎందుకు చెప్పుకోవాలంటే ఆ చెరువు కింద ఓ పురాతన నగరం దాగి ఉంది కాబట్టి! 15వ శతాబ్దంలో సంభవించిన భారీ భూకంపం టోరు ఐగిర్ అనే నగరాన్ని నాశనం చేయగా అనంతర కాలంలో సంభవించిన మార్పులతో అక్కడ ఏర్పడిన ఉప్పునీటి సరస్సు ఆ నగరాన్ని మింగేసింది.
అయితే పశ్చిమాసియా దేశాల్లో మధ్యయుగ నివాస ప్రదేశాల గురించి అధ్యయనం చేస్తున్న రష్యా పరిశోధకుల బృందం.. అంతర్ధానమైన సిల్క్‌రూట్ ఆనవాళ్లను వెలికితీయడంతోపాటు 13, 14వ శతాబ్దాల నాటి నెక్రోపోలిస్ సైట్‌ల శోధన మొదలుపెట్టింది. ఈ క్రమంలో రష్యాకు చెందిన అండర్‌వాటర్ ఆర్కియాలాజిస్ట్ మ్యాక్సిమ్ మెన్షికోవ్ ఆధ్వర్యంలోని పరిశోధన బృందం ఇస్సిక్ కుల్ సరస్సు కింద దాగి ఉన్న టోరు ఐగిర్ నగరాన్ని గతేడాది గుర్తించింది.
క్రీస్తుపూర్వ నగరమిది..
క్రీస్తుపూర్వం ఒకటవ శతాబ్దంలో వర్తక, వాణిజ్యం కోసం సిల్‌్కరూట్‌లో ఏర్పడిన నగరాల్లో టోరు ఐగిర్ నగరం కూడా ఒకటి. చైనా నుంచి పశి్చమ దేశాలకు ప్రయాణించే వర్తకులకు ఇది మజిలీ నగరంగా ఉండేది. ఈ నగరం ఆనవాళ్లను గుర్తించేందుకు సరస్సు అడుగుకు వెళ్లిన పరిశోధకులకు ఇటుకలతో నిర్మించిన కట్టడాలు, టర్కీ రాజవంశీయుల, ఇస్లామిక్ పాలన ఆనవాళ్లు, ఇస్లాం సంప్రదాయ సమాధులు కనిపించాయి. ధాన్యాన్ని పిండి చేయడానికి ఉపయోగించిన మన తిరగలి వంటి సాధనాలు, చెక్క, రాతి దూలాలతో నిర్మించిన భవనాలు, సిరామిక్ కళాఖండాలు కూడా కంటబడ్డాయి.
అక్కడ ఓ మసీదు, స్నానశాల, ఇస్లామిక్ విశ్వవిద్యాలయంతోపాటు చక్కటి ఎక్స్‌టీరియర్‌తో ఒక కమ్యూనిటీ బిల్డింగ్ కూడా ఉంది. అండర్ వాటర్ ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, డ్రోన్ షూటింగ్ ప్రక్రియల ద్వారా నీటి అడుగున ఉన్న నగరం గురించి అండర్‌వాటర్ ఆర్కియాలజిస్టులు ప్రపంచానికి తెలియచేశారు. ఈ ఫొటోలను పరిశీలిస్తే నాటి భవన నిర్మాణంలో కాలి్చన ఇటుకలను ఉపయోగించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వాడుకలో ఉన్న ఇటుకలతో పోలిస్తే నాటి ఇటుకలు పరిమాణంలో చాలా పెద్దవి. ఒక్కమాటలో చెప్పాలంటే టోరు ఐగిర్ నగరం క్రీస్తు పూర్వం 1,300 నుంచి 3,300 ఏళ్ల మధ్య విరాజిల్లిన సింధు నాగరకతను గుర్తుచేసింది.


