గిరిజనుల అభివృద్ధికి  రోడ్‌ మ్యాప్‌  | Amit Shah highlighted a tribal development roadmap | Sakshi
Sakshi News home page

గిరిజనుల అభివృద్ధికి  రోడ్‌ మ్యాప్‌ 

Apr 4 2026 5:51 AM | Updated on Apr 4 2026 9:56 AM

Amit Shah highlighted a tribal development roadmap

అస్సాంలో బీజేపీ గెలుపుతో అమలు ఖాయం 

ఎన్నికల సభల్లో హోం మంత్రి అమిత్‌ షా ప్రకటన 

గువాహటి: అస్సాంలోని గిరిజనుల అభివృద్ధికి ప్రధాని మోదీ, సీఎం హిమంత బిశ్వ శర్మ ఒక సమగ్ర రోడ్‌ మ్యాప్‌ను సిద్ధం చేసి ఉంచారని, ముచ్చటగా మూడోసారి బీజేపీ గెలుపుతో అమలు చేయడం తథ్యమని హోం మంత్రి అమిత్‌ షా ప్రకటించారు. గోల్‌పారా, కామ్‌రూప్‌ జిల్లాల్లో శుక్రవారం జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార ర్యాలీల్లో మంత్రి ప్రసంగించారు. ఆదివాసీ మహిళను దేశ రాష్ట్రపతిగా అన్నేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ చేయలేకపోయిందని విమర్శించారు. ద్రౌపదీ ముర్మును దేశ ప్రథమ పౌరురాలిగా చేసిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందన్నారు. పలాశ్‌బరిలో ఐఐఎం ఏర్పాటుకు ఉద్దేశించిన బిల్లును కాంగ్రెస్‌ అడ్డుకునేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు.

‘మీరు ఎంతగా అడ్డుకున్నా, ఐఐఎం ఏర్పాటును ఏమాత్రం ఆపలేరు’ అంటూ లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాం«దీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మినీ అస్సాంగా పేరున్న గోల్‌పారా జిల్లాలోని పలు గిరిజన తెగల అభివృద్ధికి పాటుపడేది బీజేపీ మాత్రమేనని అమిత్‌ షా నొక్కి చెప్పారు. అదే సమయంలో, గిరిజనులు మెజారిటీగా ఉన్న జిల్లాలు ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) అమలు పరిధిలోకి రావని వివరించారు. ప్రతి గిరిజన కుటుంబానికీ ఒక ఆవు, ఒక గేదెను పంపిణీ చేస్తామని సహకార శాఖ మంత్రిగా ఇది తన హామీ అంటూ ఆయన ప్రకటించారు. హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం కారణంగా ధుబ్రి జిల్లా గోలక్‌గంజ్‌లో ఆయన పాల్గొనాల్సిన ఎన్నికల ర్యాలీ రద్దయింది.

Advertisement
 
Advertisement
Advertisement